టీడీపీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేను కలవరపెడుతున్నారా...!?
మూడు సార్లు వరసబెట్టి టీడీపీ గెలిస్తే ఆ మూడుసార్లూ వెలగపూడి రామక్రిష్ణబాబే ఎమ్మెల్యేగా ఉన్నారు.
By: Tupaki Desk | 4 March 2024 6:02 AM GMTవిశాఖ సిటీలో డ్యాం ష్యూర్ గా టీడీపీ గెలిచే సీటు ఏది అంటే విశాఖ తూర్పు అని ఎవరైనా చెప్పవచ్చు. అంత స్ట్రాంగ్ హోల్డ్ అక్కడ టీడీపీకి ఉంది. అసలు 2009లో తూర్పు సీటు పుట్టిన తరువాత మరో పార్టీ నెగ్గినది లేదు. మూడు సార్లు వరసబెట్టి టీడీపీ గెలిస్తే ఆ మూడుసార్లూ వెలగపూడి రామక్రిష్ణబాబే ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇక నాలుగవసారి ఆయన ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. ఆయన ఈసారి ఎందుకో కలవరపడుతూనే ఎన్నికల యుద్ధం చేస్తున్నారు. మునుపటి ధీమా అయితే కొంత తగ్గింది అని అంటున్నారు. దానికి కారణం ఆయన ప్రత్యర్థిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. ఆయనను వైసీపీ చాలా ముందుగానే అభ్యర్థిగా ప్రకటించేసింది. ఆయన కూడా జనంలో ఉంటున్నారు.
ఇక వెలగపూడి అంగబలం అర్ధబలం ఉన్న వారే. కానీ ఎంవీవీ ఆయన కంటే స్ట్రాంగ్ అని అంటున్నారు. మరో వైపు చూస్తే 2019 తరువాత వెలగపూడి ఆర్ధికంగా కొంత తగ్గారు అని అంటున్నారు. ప్రభుత్వం మద్యం పాలసీలను మార్చేసింది. దాంతో పాటు తామే చేస్తోంది. ఫలితంగా మద్యం వ్యాపారం చేసే వెలగపూడికి అది పెద్ద దెబ్బ అయింది. అయిదేళ్లలో వైసీపీ తూర్పుని ఫుల్ గా ఫోకస్ చేసి పారేసింది.
ఎత్తుకు పై ఎత్తు వేస్తూ సాగింది. ఫలితంగా లోకల్ బాడీ ఎన్నికల్లో తూర్పులో అత్యధిక సంఖ్యలో వైసీపీ కార్పోరేటర్లు నెగ్గారు. ఇక దొంగ ఓట్లు పెద్దగా చేర్చారు అని గత ఏడాదిగా వెలగపూడి ఆందోళన చెందుతూ వరస ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ దానికి ధీటుగా ఫిర్యాదులు చేస్తూ వచ్చింది.
వెలగపూడి నియోజకవర్గంలో నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని వైసీపీ ఆరోపణలు చేసింది కూడా. ఇలా రెండు వైపులా దొంగ ఓట్ల విషయంలో పెద్ద ఎత్తున రాజకీయ రచ్చ సాగింది. దొంగ ఓట్లు ఇష్యూలో వైసీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా వార్ జరిగినా ఫలితం ఏమిటి అన్నది కూడా ఇప్పటికైతే తెలియలేదు.
లేటెస్ట్ లెక్కలు చూస్తే తూర్పులో మొత్తం రెండు లక్షల ఎనభై వేల ఓటర్లు ఉన్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా ఉంది. ఇక ఎంవీవీ పాదయాత్రలు చేస్తూ ఎక్కడికక్కడ సొంత నిధులు వెచ్చిస్తూ ప్రజలకు అవసరం అయిన కార్యక్రమాలను షురూ చేశారు. ఎన్నికల కోడ్ లేకపోవడం వల్ల ఆయన ఏమి చేసినా ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.
ఇక టీడీపీ బలంగా ఉన్న చోట క్యాడర్ ని తెచ్చి మరీ తమ పార్టీలోకి తీసుకుంటున్నారు. అలాగే ఎన్నికల్లో ప్రభావితం చేసే వర్గాలను కూడా వైసీపీ ఆకర్షిస్తోంది. లేటెస్ట్ గా చూస్తే వెలగపూడి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు అంతర్జాతీయ కాల్స్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ పాలనలో ఒక ఎమ్మెల్యేకు కూడా రక్షణ లేదని ఆయన మండిపడ్డారు. వెలగపూడికి ఎవరు బెదిరింపు కాల్స్ చేశారు అన్నది కూడా చర్చగా సాగుతోంది. ఇవి పక్కన పెడితే వెలగపూడి ఎన్నడూ లేనిది తనకు రెండు సార్లు ఎన్నికల్లో ప్రత్యర్ధి అయిన ఎమ్మెల్సీ వంశీ ఇంటికి వెళ్ళి మద్దతు కోరారు. ఒక విధంగా ఇది ఎన్నికల వ్యూహం అనుకున్నా గతంతో పోలిస్తే టీడీపీలో ఎక్కడో తెలియని కలవరం రేగుతోంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే సామాజిక సమీకరణలను కూడా వైసీపీ చక్కబెట్టుకుంటూ వస్తోంది. విశాఖ తూర్పులో బలమైన యాదవ సామాజిక వర్గంలో ఉన్న మేయర్ మద్దతు ఎంవీవికి ఉంది, ఇక 2019లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన అక్రమాన విజయనిర్మలకు గాజువాక టికెట్ ని ఇవ్వడం ద్వారా ఆ సామాజికవర్గం ఓట్లను గుత్తమొత్తంగా విశాఖ తూర్పుతో పాటు భీమిలీలోనూ పొందాలని వైసీపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
ఇలా బహుముఖంగా వైసీపీ వేస్తున్నఎత్తులు ఎంవీవీ దూకుడు ఆయన అంగబలం అర్ధబలం ఇవన్నీ టీడీపీని కొంత కలవరపెడుతున్నాయని అంటున్నారు. వీటితోపాటు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న వెలగపూడి మీద కొంత వ్యతిరేకత అయితే నియోజకవర్గంలో ఉంది. గట్టి అభ్యర్థి ఉంటే ఓటమి ఖాయం అన్నది ఒక విశ్లేషణ. ఇపుడు ఆ పని ఎంవీవీ చేస్తారా అన్నదే చర్చ. రాజకీయ అదృష్టవంతుడిగా ఎంవీవీని చెబుతారు. ఆ సెంటిమెంట్ ఈసారి కూడా ఫలిస్తుందని ఆయన అభిమానులు అనుచరులు అంటున్నారు.