Begin typing your search above and press return to search.

తెలంగాణా ఫలితంతో ఏపీలో టీడీపీ జాతకం మారుతుందా ..?

బీయారెస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో మూడు వంతులు టీడీపీతోనే గడచింది.

By:  Tupaki Desk   |   19 Nov 2023 2:05 AM GMT
తెలంగాణా ఫలితంతో ఏపీలో టీడీపీ జాతకం మారుతుందా ..?
X

తెలంగాణా ఎన్నికలకూ ఏపీ ఎన్నికలకూ సంబంధం ఏంటి, తలపండిన రాజకీయ పండితుల జోస్యం ఏంటి అన్నదే ఇపుడు హాట్ పాయింట్. బీయారెస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ జీవితంలో మూడు వంతులు టీడీపీతోనే గడచింది.

ఆయన 2014 దాకా టీడీపీలోనే ఉన్నారు. ఆయన ఎన్టీయార్ , చంద్రబాబు మంత్రివర్గాలలో కీలకమైన శాఖలు నిర్వహించారు. ఇక రాష్ట్ర విభజన తరువాత ఆయన బీయారెస్ లోకి వెళ్ళి మంత్రి అయ్యారు. ఇక 2018లో ఆయన ఓడాక మాత్రం రాజకీయం తిరగబడింది. గడచిన అయిదేళ్ళ పాటు ఆయన రాజకీయ వైభవం పెద్దగా లేదు.

దాంతో ఉన్న అసంతృప్తి ఒక వైపు కాంగ్రెస్ కి గ్రాఫ్ పెరగడం మరో వైపు ఇవన్నీ ఆలోచించుకుని తుమ్మల బీయారెస్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరాక చాలా సంచలన ప్రకటనలు ఇస్తున్నారు. కేసీయార్ కి మంత్రి పదవిని మొదటిసారిగా టీడీపీలో ఇప్పించింది తానేనని మూడు దశాబ్దాల నాటి రాజకీయ గుట్టుని బయటపెట్టిన తుమ్మల తన వల్లనే బీయారెస్ కి ఖమ్మంలో కళా కాంతులు దక్కాయని మరో విషయం చెప్పారు.

తాను బీయారెస్ లో చేరలేదని, తన అవసరం ఉందని కేసీయారే భావించి తనను ఆ పార్టీలోకి తీసుకెళ్లారని కూడా మరో విషయం చెప్పారు. ప్రతుతం మంత్రి ఖమ్మం సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ మీద తుమ్మలా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. తనది ఖాయమైన విజయం అని ఆయన అంటున్నారు.

ఇక తుమ్మల విజయం కోసం టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున కృషి చేయడం మరో రాజకీయ సంచలనం. వారంతా బయటకు వచ్చి మరీ తుమ్మలకు జై కొడుతున్నారు. ఈ సందర్భంగా తుమ్మల కూడా టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు. ఇక ఆయన లాంటి చాలా మంది నేతలు ఏపీలో టీడీపీ బాగుండాలని కోరుకుంటున్నారు.

అందుకే వారంతా తమదైన రాజకీయ జోస్యం చెబుతున్నారు. తెలంగాణాలో జరుగుతున్న ఎన్నికలు అనంతర పరిణామాలు అన్నీ కూడా ఏపీలో కూడా భారీ ఎత్తున రాజకీయ మార్పులకు దారి తీస్తాయని టీడీపీకి అక్కడ మద్దతు ఇస్తున్న తమ్ముళ్ళు అంచనా కడుతున్నారు. అంటే తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి కూడా మేలు జరిగేలా అక్కడ పరిణామాలు మారుతాయని లెక్కలేవో వేసుకున్నట్లుగా ఉన్నారని అంటున్నారు.

అందుకే తుమ్మలతో పాటు చాలా మంది నేతలకు మాజీ తమ్ముళ్లకు టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసి ప్రసుతం కాంగ్రెస్ లో ఉన్న వారికి ఔట్ రేట్ గా మద్దతు ఇస్తున్నారు. మరి తెలంగాణాలో కాంగ్రెస్ గెలిస్తే ఏపీలో టీడీపీకి రాజకీయ లాభం కలుగుతుందా కలిగితే ఎలా కలుగుతుంది అన్నది చర్చగా ఉంది.

నిజం చెప్పాలంటే ఈ రోజు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఒకనాటి తెలుగు తమ్ముడే. అంతే కాదు ఆయన చంద్రబాబుకు అనుంగు శిష్యుడు. మరి ఇలా చాలా మంది నేతలు కాంగ్రెస్ లో కీలక స్థానాలలో ఉన్నారు.

ఈ మాజీ తమ్ముళ్ళు అంతా తెలంగాణాలో కాంగ్రెస్ రావాలని కోరుకుంటూనే ఏపీలో టీడీపీ గెలవాలని కోరుకుంటున్నారు. తెలంగాణా టీడీపీ తమ్ముళ్ళు కూడా తెలంగాణా నుంచి ఏపీకి రూటు వేసుకుంటామని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.