టీడీపీ వీక్... ఈ ప్రచారం ఎవరిది...!?
మిత్రుడు అంటే బలోపేతం చేయాలి. కానీ వీక్ చేయకూడదు. ఏపీలో చూసుకుంటే టీడీపీని మిత్రులే బలహీనం చేస్తున్నారు అని అంటున్నారు.
By: Tupaki Desk | 16 March 2024 2:30 PM GMTమిత్రుడు అంటే బలోపేతం చేయాలి. కానీ వీక్ చేయకూడదు. ఏపీలో చూసుకుంటే టీడీపీని మిత్రులే బలహీనం చేస్తున్నారు అని అంటున్నారు. అదెలా అంటే జనసేన అధినేత అనేకసార్లు తెలిసో తెలియకో లేక ఆర్భాటంగానో చేసిన పలు వ్యాఖ్యలు టీడీపీని ఇబ్బందులోకి నెట్టాయి. పార్టీకి మైనస్ గా మారాయి.
జనసేన అధినాయకత్వం తన పార్టీ నేతలతో మాట్లాడుతూ టీడీపీ చంద్రబాబు అరెస్ట్ తరువాత దారుణమైన పరిస్థితిలో తామే వెళ్ళి ఆదుకున్నామని చెప్పుకొచ్చారు. అంతే కాదు పవన్ వారాహి యాత్రలో భాగంగా క్రిష్ణా జిల్లాలో మాట్లాడుతూ ఇపుడు టీడీపీ కష్టాలలో ఉందని అందువల్ల మనం వారిని అండగా ఉండాలి వారిని తగ్గించి మాట్లాడకూడదని చెప్పారు. ఈ మాటలు పైకి బాగానే ఉన్నా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా టీడీపీ వీక్ గా ఉందనే చెప్పినట్లుగా ప్రత్యర్ధులు ప్రచారం చేశారు.
ఇక బీజేపీ పెద్దలతో చీవాట్లు తిని మరీ టీడీపీతో పొత్తుకు ఒప్పించాను అని పవన్ మరో సందర్భంలో అన్నారు. అంటే టీడీపీ అంటే బీజేపీకి ఇష్టం లేదని ఆ పార్టీని దూరం పెట్టారని చెప్పకనే చెప్పి చులకన చేశారు అని అంటున్నారు. అంతే కాదు బీజేపీతో పొత్తుల కోసం జనసేన కృషి చేసిందని చెప్పుకున్నారు.
ఇవన్నీ టీడీపీని ఇబ్బందుల పాలు చేసేవే అని అంటున్నారు. ఇపుడు అది చాలదు అన్నట్లుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇండియా టుడే కాంక్లేవ్ లో మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీని వీడివెళ్ళారని, తిరిగి ఓడిపోయాక ఆయనే వచ్చి చేరారు అని చెప్పడం ద్వారా టీడీపీని పూర్తిగా కార్నర్ చేసి పారేశారు అని అంటున్నారు.
టీడీపీ తమంతట తామే వచ్చి పొత్తులు పెట్టుకుంది అని చెప్పడం ద్వారా ఆ పార్టీ వీక్ నెస్ అది అన్నట్లుగానే అమిత్ షా మాటలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ పెద్దలు పిలుపు మేరకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడుతో సహా చాలా మంది చెబుతూ వచ్చారు. టీడీపీ అనుకూల మీడియా అదే రాతలు రాస్తూ వచ్చింది.
కానీ అమిత్ షా మాటలతో టీడీపీయే తానుగా కోరి మరీ అటు వైపు వెళ్ళి మరీ చేరింది అని బీజేపీ పెద్దలు తేటతెల్లం చేశారు. ఆ మాటకు వస్తే దాని కంటే ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా బీజేపీలోకి రావాలనుకున్న చంద్రబాబుకు ఆహ్వానం వచ్చి చేరినందుకు సంతోషం అని కూటమి పొత్తులు కట్టాక ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
ఇవన్నీ చూస్తే జనంలోకి వెళ్ళే సంకేతాలు ఏమిటి అన్న ప్రశ్నలు వస్తున్నాయి. టీడీపీ వీక్ గా ఉంది కాబట్టే జనసేనతో పొత్తు కుదుర్చుకుందని అలాగే బీజేపీతో పొత్తుకు వెళ్ళిందని కూడా భావన కలుగుతోంది అని అంటున్నారు. ఆ విధంగా అభిప్రాయం ఏర్పడ్డాక జనాలు టీడీపీ వీక్ అని ఎందుకు అనుకోరు అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఇదంతా పొత్తులు ఎత్తులు వ్యూహాలు అని టీడీపీ ఎంత డబాయించి చెప్పినా వ్యవహారాన్ని బట్టబయలు చేసేలా మిత్రుల కామెంట్స్ ఉండడంతో టీడీపీ ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేదు అందుకే అంతా కలసి వస్తున్నారు అన్న భావన జనంలోకి పూర్తిగా పోతోంది అని అంటున్నారు. అది పూర్తిగా జనంలో ఎస్టాబ్లిష్ అయ్యేలా అమిత్ షా లేటెస్ట్ కామెంట్స్ కూడా ఉన్నాయని అంటున్నారు.
మరి ఎన్నికల కంటే ముందే టీడీపీ వీక్ అని చెప్పేసుకుంటే ఒప్పేసుకుంటే ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల మీద పడదా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది ఏమైనా టీడీపీ కంటే వైసీపీ స్ట్రాంగ్ అన్నది ఎటూ అధికార పార్టీ నిరూపించుకుంటూ వస్తుంది. అది వారు ప్రచారం చేసుకుంటూ ఉంటారు.
తాను సోలోగా వస్తామని కూడా చెబుతూ ఉంటారు. కానీ టీడీపీ వీక్ అన్నది బయటపడడం అది జనాల్లోకి పోవడం అంటూ జరిగితే అదే అసలైన ప్రమాద ఘంటికలను మోగించే అంశం అవుతుందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే కనుక మిత్రుల వల్ల టీడీపీ బలపడుతోందా అంటే అది నిజమే అనుకున్నా కాదనుకున్న వీక్ అన్న సంకేతం మాత్రం జనంలోకి వెళ్ళిపోయింది అన్నది ఒక కఠినమైన విశ్లేషణగా ఉంది.