Begin typing your search above and press return to search.

జెండా మార్చు...టికెట్ కొట్టు..!

పది అసెంబ్లీ సీట్లు పంతానికి అడిగిందో లేక ప్రెస్టేజ్ కి అడిగిందో తెలియదు కానీ బీజేపీ పట్టుబట్టి తీసుకుంది.

By:  Tupaki Desk   |   22 April 2024 1:30 AM GMT
జెండా మార్చు...టికెట్ కొట్టు..!
X

జెండాదే కదా ఏముంది. కండువాగా మారి మెడలో అలా పడి ఉంటుంది. మనసు మాత్రం మనదే కదా. అందువల్ల జెండాదేముంది. మార్చేయ్, సీటు టికెట్ పట్టేయ్. ఇదే ఏపీలో ప్రస్తుతం అమలు అవుతున్న నయా నీతి. తెలుగుదేశం పార్టీ పొత్తులు కూటమి కధలు చూస్తే భలే తమాషాగా ఉన్నాయి. పది అసెంబ్లీ సీట్లు పంతానికి అడిగిందో లేక ప్రెస్టేజ్ కి అడిగిందో తెలియదు కానీ బీజేపీ పట్టుబట్టి తీసుకుంది. అలాగే ఆరు ఎంపీ సీట్లు తీసుకుంది.

మరి గట్టి అభ్యర్ధులు ఉన్నారా అంటే పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసే వారు చాలా మంది ఉన్నారు. కానీ కావాల్సింది అంగబలం అర్ధబలం. దాంతో ఇక్కడే పెద్దన్న టీడీపీ పంట పండుతోంది అని అంటున్నారు. టికెట్లు పొత్తులో భాగంగా ఇచ్చినా ఆయా సీట్లలో ఉన్న టీడీపీ బలమైన నేతలను మిత్ర పార్టీలలోకి పంపించి సీటు దక్కేలా అన్ని చర్యలూ తీసుకుంటోంది.

ఏపీని రాజకీయంగా ఒక కుదుపు కుదిపేసిన అనపర్తి టికెట్ విషయంలో ప్రస్తుతం కూటమి కధ సుఖాంతం అయింది. అదెలా అంటే కండువాలు మార్చేసుకోవడంతోనే అని అంటున్నారు. టీడీపీ జెండాని పక్కన పెట్టేసి బీజేపీ జెండా పట్టుకుంటే చాలు కడుపులో చల్ల కదలకుండా సీటు వచ్చింది, టికెట్టూ దక్కింది ఇదే ఫార్ములాతో నల్లమల్లి రామక్రిష్ణారెడ్డి బీజేపీలోకి వచ్చేశారు.

పాపం ఆయన టీడీపీ నుంచే పోటీ చేయాలని అనుకున్నారు. కానీ అధినాయకత్వమే బీజేపీలోకి వెళ్ళమని ప్రోత్సహించిందని చెబుతున్నారు. రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడుకోకూడదు అంటే ఇదే ఉదాహరణగా తీసుకోవాలి మరి. ఆయకు ఎలాగోలా టికెట్ ఇప్పించేశారు. మనవాడే జెండా మార్చుకున్నాడు. మనతోనే ఉంటాడు ఇదే థియరీ అన్న మాట.

ఇదే విధంగా బీజేపీలో ఎంపీ టికెట్లు పొందిన వారు కొన్ని చోట్ల ఎమ్మెల్యే టికెట్లు పొందిన వారు చూస్తే వారెవ్వా పాలిటిక్స్ అని అనిపించకమానదు. ఈ ఒక్క పార్టీనే కాదు, జనసేన టికెట్లు కూడా చాలా మంది పొందారు. వారిలో చాలా మంది టీడీపీ నుంచి సడెన్ గా వెళ్ళిన వారే. శ్రీకాకుళం జిల్లా పాలకొండ అసెంబ్లీ టికెట్ ని అలాగే నిమ్మక జయక్రిష్ణ పొందారు. ఆయన ముందు రోజు వరకూ టీడీపీ సీనియర్ నేత. జనసేనలో చేరి టికెట్ సంపాదించేశారు. జస్ట్ కండువా మార్పు. మిగిలినదంతా సేం టూ సేం.

ఒక విధంగా టీడీపీ మిత్రపక్షాలకు 31 సీట్లు ఇచ్చింది అని బెంగ అవసరం లేదు అందులో చాలా సీట్లు ఇలా తమ్ముళ్ళ కండువా మార్పుతో టీడీపీతోనే ఉన్నట్లు అవుతోంది అంటున్నారు. ఇంకోవైపు చూస్తే పొత్తులు ఎందుకు ఈ పోటీలు ఏంటి అన్నది రాజకీయంగా ఎవరికైనా కలిగే సందేహం.

ఆ మాత్రం సరదా ఉంటే ఆ పార్టీల గుర్తుతోనే పోటీ చేయవచ్చు కదా. అంటే అక్కడే ఉంది రాజకీయ మతలబు. పేరుకు మూడు జెండాలు కనిపించాలి. మూడు పార్టీలు కూటమి కట్టినట్లుగా ఉండాలి. ఆయా పార్టీలకు ఉండే అభిమాన గణం కూటమి వైపుగా టర్న్ కావాలి. అందుకోసం ఈ అతి పెద్ద ప్రయత్నం. ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ జాతీయ పార్టీ నాటి జనసంఘ్ నుంచి నేటి బీజేపీ దాకా చూస్తే డెబ్బై ఏళ్లకు పైబడిన సుదీర్ఘమైన ప్రయాణం

ఆ పార్టీ నిజానికి ఏపీలో మొత్తం 175 అసెంబ్లీకి పోటీ చేయాల్సిన పరిస్థితిలో ఉండాలి. కానీ పొత్తులలో పది సీట్లు ఇచ్చినా తమ పార్టీ నుంచి గట్టి అభ్యర్దులను నిలబెట్టలేకపోవడం ఏమిటి అన్నదే చర్చకు వస్తోంది. ఒక విధంగా ఏపీలో ఇది కాషాయ విషాదం అని అంటున్నారు. ప్రతీ ఎన్నికల తరువాత ఫలితాలను చూసి నిట్టూర్చడం. వచ్చే ఎన్నికల నాటికి బలపడతామని స్టేట్మెంట్స్ ఇవ్వడం. తీరా ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడం, పక్క పార్టీ వారికి తెచ్చి కండువాలు కప్పి టికెట్లు ఇవ్వడం తంతుగా సాగుతోంది.

మరి ఇలాగైతే ఎప్పటికి ఏపీలో కమల వికాసం జరిగేను అంటే దానికి జవాబు ఎవరూ చెప్పలేరు అనే అంటున్నారు. ఇక జనసేనను తీసుకుంటే పదేళ్ళ రాజకీయ ప్రస్థానం. దానికి ముందు అయిదేళ్ళు ప్రజారాజ్యం అనుభవం ఉంది. అన్నీ కలుపుకుంటే సుదీర్ఘ కాలమే. మరి నియోజకవర్గంలో గట్టి నేతలను తయారు చేసుకోలేకపోయారా అన్నదే అందరికీ కలుగుతున్న డౌట్లు.

జనసేన నుంచి 21 మందికి సీట్లు కేటాయిస్తే సగానికి సగం మంది పక్క పార్టీల నుంచి వచ్చిన వారికే అకామిడేట్ చేశారు అన్న ప్రచారం ఉంది. ఏది ఏమైనా ఏపీలో నయా రాజకీయ నీతి ఏమిటి అంటే జెండా మార్చు, టికెట్ పట్టు. ఇదే ఇపుడు సూపర్ హిట్ పొలిటికల్ ఫార్ములా అని అంటున్నారు. మరి జనాలు ఎలా దీనిని రిసీవ్ చేసుకుంటారు అన్నదే చూడాల్సి ఉంది.