Begin typing your search above and press return to search.

టీడీపీ కూటమి వైపు ఆశగా చూస్తున్న బలమైన సామాజిక వర్గం !

ఇదిలా ఉంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలతో బలీయమైన సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2024 4:00 AM GMT
టీడీపీ కూటమి వైపు ఆశగా చూస్తున్న బలమైన సామాజిక వర్గం !
X

ఏపీలో రాజకీయాలు అంటే సామాజిక సమీకరణలే. కులాల సంకుల సమరమే. ఏ మాత్రం తేడా వచ్చిన సున్నితమైన ఈ బంధాలలో భారీ మార్పులు వస్తాయి. దాంతో ఇబ్బంది అవుతుంది. ఇదిలా ఉంటే చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీసీలతో బలీయమైన సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు.

అది 2019లో కూడా కంటిన్యూ అయింది. వైసీపీ చెప్పుకోదగిన స్థాయిలో బీసీ ఓట్లను రాబట్టుకున్నా టీడీపీ సైతం తన వాటాను దక్కించుకుంది. కాబట్టే ఓటు షేర్ 40 శాతం లభించింది. 23 సీట్లు కూడా దక్కాయి. ఇక ఈసారి మరింత పకడ్బంధీగా టీడీపీ సోషల్ ఇంజనీరింగ్ పనిచేసింది. జనసేనతో స్నేహం కలిపింది. అలా కాపులను తమ వైపు తిప్పుకుని బీసీలను కూడా ఇంకో వైపు ఉంచుకుని అఖండ విజయం అందుకుంది.

ఈ నేపధ్యంలో కాపులు అంతా కూడా కూటమిని మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చారు. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండడం టీడీపీ కూడా కాపులకు గత అయిదేళ్లలో దగ్గర కావడం వంటివి జరిగాయి. ఇంకో వైపు వైసీపీ కొత్తగా రూపొందించిన సోషల్ ఇంజనీరింగ్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ముందు వరసలో ఉన్నారు.

అంతే కాదు వైసీపీ కాపులకు ప్రత్యేకంగా చేసింది లేదు అన్న అసంతృప్తి తీవ్రంగా కాపులలో ఉంది. అధికారంలోకి వస్తూనే ఈబీసీ రిజర్వేషన్లు కాపులకు కట్ చేసింది. అంతే కాదు ప్రతీ ఏటా వేయి కోట్లు కాపు కార్పొరేషన్ కి ఇస్తామని చెప్పినా ఆచరణలో మాత్రం అది జరగలేదు. ఈ పరిణామాల క్రమంలో వైసీపీని కాపులు పక్కన పెట్టారు.

ఇక కాపులను బీసీలలో చేరుస్తామని 2014లో చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ అయిదేళ్ళలో అది జరగలేదు. దాని వల్ల కూడా ఆనాడు కాపులు దూరం దూరం అయ్యారు. ఈసారి కూడా కాపులకు ఆ ఆశలు లేకపోలేదు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి ఆక్సిజన్ గా టీడీపీ జనసేన ఉన్నాయి. మొత్తం 18 మంది ఎంపీలు ఎండీయే ప్రభుత్వాన్ని కేంద్రంలో నిలబెడుతున్నారు.

ఈ పరిణామలను చూస్తే కాపులకు ఆరు దశాబ్దాలుగా ఉన్న కోరిక అయిన బీసీల జాబితాలో చేర్చడం అన్నది తలచుకుంటే జరుగుతుంది అని అంటున్నారు. అయితే దానికి గట్టిగా కృషి చేయాల్సి ఉంది. బీసీలలో కూడా అగ్రహం రాకుండా చూసుకోవాలి. ఆ డిమాండ్ అలా ఉండగానే ఈ మధ్యలో కూడా కూటమి తన వరకూ చేయాల్సినవి చేయగలవి కొన్ని ఉన్నాయని అంటున్నారు.

అవేంటి అంటే కేంద్రం పది శాతం ఆర్ధికంగా వెనకబడిన వర్గాలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో కాపుల వాటాను అయిదు శాతాన్ని పునరుద్ధరించడం అని అంటున్నారు. జగన్ సర్కార్ రద్దు చేసిన దానిని టీడీపీ కూటమి చేస్తే విద్యా ఉపాధి అవకాశాలలో ఓసీ కాపులకు ఎంతో మేలు జరుగుతుందని కూడా భావిస్తున్నారు.

అయితే ఇక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఓసీలలో బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు కమ్మలు, రెడ్లు వెలమలు ఇతర వర్గాలు అన్నీ కూడా ఏకమొత్తంగా టీడీపీ కూటమికి 2024 ఎన్నికల్లో మద్దతు ప్రకటించాయి. వారంతా ఓసీ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. అందులో అయిదు శాతం కాపులకు ఇస్తే వారికి కోత పడుతుంది. మరి వారి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా ఉంది. అయితే కాపులు మాత్రం గతంలో ఇచ్చారు కాబట్టి ఇదేమీ కొత్త డిమాండ్ కాదని అంటున్నారు.

ఈ డిమాండ్ నెరవేర్చకపోతే మాత్రం కాపులు గుస్సా అవడం ఖాయమని అంటున్నారు. మరో వైపు చూస్తే కాపు కార్పోరేషన్ కి ఏటా వేయి కోట్ల రూపాయలు అయినా కేటాయించి దానికి జవసత్వాలు అందించడం. ఆ విధంగా చేస్తే కార్పోరేషన్ ద్వారా చాలా మంది కాపులకు ఆర్ధిక ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు. దీంతో వారంతా కూటమి ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి కూటమి పెద్దలు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో చూడాలని అంటున్నారు. ఇంకో వైపు కాపులను బీసీలలో చేర్చమని అటు ముద్రగడ ఇటు చేగొండి హరి రామజోగయ్య కూడా కోరడం విశేషం. చూడాలి మరి ఏమి జరుగుతుందో.