Begin typing your search above and press return to search.

సీట్ల షేరింగే మిగిలిందా ?

తర్వాత మీడియాతో మాట్లాడుతు పొత్తు విషయాన్ని పవన్ ప్రకటించారు. రెండుపార్టీలు కలిసి పోటీచేస్తాయని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నది

By:  Tupaki Desk   |   15 Sept 2023 12:40 PM IST
సీట్ల షేరింగే మిగిలిందా ?
X

అసలు విషయం తేలిపోయింది. మిగిలింది సీట్ల షేరింగ్ మాత్రమే. విషయం ఏమిటంటే ఎప్పటినుండో అనుకుంటున్నదే అయినా తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బహిరంగంగా ప్రకటించారంతే. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ, జనసేన ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయని పవన్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడుతో పవన్ చాలాసేపు భేటీ అయ్యారు. పవన్ తో పాటు బాలకృష్ణ, లోకేష్ కూడా పాల్గొన్నారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతు పొత్తు విషయాన్ని పవన్ ప్రకటించారు. రెండుపార్టీలు కలిసి పోటీచేస్తాయని ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నది. అధికారికంగా ప్రకటించటానికి రెండుపార్టీలు ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు నేపధ్యంలో అధికారికంగా పొత్తును పవన్ ప్రకటించారంతే. పొత్తును ప్రకటించేశారు కాబట్టి ఇక మిగిలింది సీట్ల షేరింగ్ మాత్రమే. అందుబాటులోని సమాచారం ప్రకారం జనసేనకు 23 అసెంబ్లీ, 3 లేదా నాలుగు పార్లమెంటు సీట్లు కేటాయించటానికి చంద్రబాబు రెడీ అయ్యారట.

ఎప్పటినుండో 35 అసెంబ్లీ, 5 పార్లమెంటు స్ధానాల్లో జనసేన పోటీచేయబోతోందని ప్రచారం జరుగుతోంది. అయితే పాత ప్రచారానికి తెరదింపుతు తాజాగా 23 అసెంబ్లీ, 3 లేదా 4 పార్లమెంటు స్ధానాల్లో పోటీచేస్తుందనే ప్రచారం మొదలైంది. విచిత్రం ఏమిటంటే ఎక్కువ సీట్లను జనసేన తీసుకున్నా ఉపయోగం ఉండదు. ఎందుకంటే గట్టి అభ్యర్ధులు చాలా చోట్ల జనసేనకు లేరన్నది వాస్తవం. తీసుకున్న సీట్లలో బలమైన అభ్యర్ధులను పోటీకి దింపాలంటే మళ్ళీ అభ్యర్ధులను కూడా చంద్రబాబే ఇవ్వాల్సుంటుంది.

దానికిబదులు తక్కువ సీట్లు తీసుకుని పూర్తిబలాన్ని కేంద్రీకరించి పోటీచేసిన అన్నీ స్ధానాలను గెలుచుకుంటే సరిపోతుందని పవన్ అనుకున్నారట. అందుకనే 23 అసెంబ్లీ, 3 లేదా 4 పార్లమెంటు సీట్లకే పరిమితమవుతున్నారని జనసేనలో కూడా చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళతో పాటు బీజేపీ కూడా కలుస్తుందా లేదా అన్నది కీలకమైంది. బీజేపీ వీళ్ళతో కలిస్తే రాజకీయం ఒకలాగుంటుంది కలవకపోతే మరోలాగుంటుంది. బీజేపీ కలవకపోతే వీళ్ళతో కలవటానికి వామపక్షాలు సిద్ధంగా ఉన్నాయి. మరి చివరకు బీజేపీ ఏమిచేస్తుందో చూడాలి.