టీడీపీ - జనసేన పొత్తుకు బీటలు... బలపరుస్తున్న పవన్ మాటలు!
ఇందులో భాగంగా... టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు
By: Tupaki Desk | 26 Jan 2024 7:31 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరిపై జనసేన నాయకులకు పవన్ కల్యాణ్ క్షమాపణలు చెప్పారు. దీనికి కారణం... పొత్తు ధర్మం పాటించకుండా చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయమే! ఇదే సమయంలో... చంద్రబాబుకి కౌంటర్ గా పవన్ కల్యాణ్ కూడా రెండు నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు పోటీచేస్తారంటూ ప్రకటించారు.
అవును... జనసేనతో పొత్తు ఉన్నప్పటికీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు నియోజకవర్గాలను చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించేశారు. దీంతో జనసేనలో ఈ విషయం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతే... పొత్తులో జనసేన పరిస్థితి ఆటలో అరటిపండేనా అంటూ జనసేన నేతలు అసహనం వ్యక్తం చేశారు!
దీంతో.. తాజాగా ఈ విషయాలపై స్పందించిన పవన్ "టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించింది.. ఈ పొత్తు ధర్మం కాదు.. అభ్యర్థుల ప్రకటనతో జనసేనలో ఆందోళన చెలరేగింది.. దీనిపై పార్టీ నేతలకు నా క్షమాపణలు" అని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబులాగానే తనపైనా ఒత్తిడి ఉందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను కూడా రెండు నియోజకవర్గాలను ప్రకటిస్తున్నానంటూ రాజోలు, రాజానగరం నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు.
దీంతో... ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో సీఎం విషయంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను కూడా పవన్ ప్రస్థావించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో... టీడీపీ - జనసేనకు చెడిందా.. చెడుతుందా.. ఇందుకు కారణం ఆర్థికపరమైన అంశాలా.. లేక, పవన్ వెనుక ఇంకెవరైనా "పెద్దలు" ఉండి నడిపిస్తున్నారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి!
టీడీపీ నుంచి ఎన్నో అవమానాలు, కొన్ని సందర్భాల్లో చీత్కారాలు, మరికొన్ని సందర్భాల్లో తోలుబొమ్మను చేసి ఆడిస్తున్నారనే దెప్పిపొడుపులు, తన అన్ననే గెలిపించుకోలేకపోయాడు టీడీపీని గెలిపిస్తాడా అనే విమర్శలు, మొదలైనవి ఎన్ని వచ్చినా మౌనంగానే భరించినట్లు కనిపించిన పవన్... ఇలా రెండు టిక్కెట్లు ప్రకటించారనే కారణంతో ఇలా చంద్రబాబుకు జలక్ ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే... గత కొన్ని రోజులుగా టీడీపీ అనుసరిస్తున్న తీరు జనసేన క్యాడర్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదని అంటున్నారు. ఇందులో భాగంగా... టీడీపీ వల్ల జనసేనకు ప్రత్యేకంగా కలిసి వచ్చే అంశాలు ఏవీ కనిపించడం లేదని.. జనసేన వల్ల టీడీపీకి లాభం తప్ప.. టీడీపీ వల్ల జనసేనకు కొత్తగా ఒరిగేదేమీ లేదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. పైగా... మునిగిపోతున్న నావకు మనం జీవం పోసినట్లవుతుందని ముందునుండి జనసేన క్యాడర్ చెబుతూ వస్తుంది కూడా.
అయితే.. ఇంతకాలం పవన్ కి కళ్లు తెరుచుకోలేదో.. లేక, చంద్రబాబు నోరు మెదపనివ్వలేదో తెలియదు కానీ... అన్ని కామెంట్లు వినిపిస్తున్నా... పవన్ రివర్స్ లో క్యాడర్ గొంతు నొక్కి పనికి పూనుకున్నారు. ఇందులో భాగంగా... టీడీపీతో పొత్తు వ్యవహారంపై ఇష్టం లేని వారు పార్టీని వీడి వెళ్ళిపోవచ్చని హుకుం కూడా జారీ చేశారు. తన నిర్ణయాలను వ్యతిరేకించేవారిని వైసీపీ కోవర్టులుగా చూస్తాననే మాటలు కూడా మాట్లాడారు.
దీంతో జనసేన క్యాడర్ లో ఒకింత అసహనం వచ్చింది. తమ బ్రతుకంతా తెలుగుదేశం జెండా మోయడానికి, బ్యానర్లు కట్టడానికి, ఫ్లెక్సీలు నిలబడానికేనా అనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆత్మాభిమానంతో పలువురు జనసైనికులు తిరగబడ్డారు.. జనసేనను వీడి బయటకు వచ్చారు. పవన్ ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తేనే అది తమ పార్టీ అవుతుంది కానీ... టీడీపీకి ఊడిగం చేస్తే కాదని బలంగా భావించినట్లున్నారు.
ఇలా చాలా మంది జనసైనికులతో పాటు పల్వురు కీలక నేతలు సైతం బయటకు వెళ్లిపోవడం.. వెళ్తూ వెళ్టూ పవన్ వైఖరిపై నిప్పులు చేరగడంతో జనసేనకు వచ్చిన హైప్ ఒక్కసారిగా తగ్గిపోతూ వచ్చింది. దీనికితోడు సీఎం పదవిపై చినబాబు లోకేష్ చేసిన కామెంట్స్ దీనికి మరింత ఆజ్యం పోశాయి. దీంతో జనసేన కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేసి అమీతుమీ తేల్చుకోవచ్చని.. బీజేపీతో కలిసి బరిలో దిగే విధంగా అడుగులు వేద్దామని క్యాడర్ పవన్ కు సంకేతాలిచ్చిందని వినిపించింది.
ఇందులో భాగంగానే ఇటీవల పవన్ కల్యాణ్ కొందమంది పాస్టర్లతో సమావేశమైనపుడు.. బీజేపీతో వెళ్తే తమ పరిస్థితి ఏమిటనే విషయం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. దీనిపై స్పందించిన పవన్... బీజేపీతో కలిసి జనసేన ప్రయాణించినా.. మీకు ఏ లోటు రానివవనని చెప్పుకొచ్చారని సమాచారం. దీంతో అవసరమైతే టీడీపీతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో కలిసిపోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు పరిశీలకులు.
ఈ క్రమంలో చంద్రబాబు చేసిన పనికి.. జనసేన నేతలు హర్ట్ అయిన విషయానికి.. ఇది ఆ పార్టీ అధినేత ఇచ్చిన తొలి అల్టిమేటం అని అంటున్నారు. ఇదే సమయంలో... ఈ అల్టిమెటంకు టీడీపి స్పందించిన తీరును బట్టి జనసేన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు విశ్లేషకులు!