Begin typing your search above and press return to search.

పొత్తుల‌పై టీడీపీ-జ‌నసేన ఉమ్మ‌డి తీర్మానాలు.. !

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ఉమ్మ‌డి తీర్మానాలు వ‌చ్చాయి

By:  Tupaki Desk   |   22 Feb 2024 6:17 PM GMT
పొత్తుల‌పై టీడీపీ-జ‌నసేన ఉమ్మ‌డి తీర్మానాలు.. !
X

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్తున్న టీడీపీ-జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ఉమ్మ‌డి తీర్మానాలు వ‌చ్చాయి. రాష్ట్ర ప్రయోజనాలను.. సమగ్ర అభివృద్ధిని, ప్రజల క్షేమాన్నీ దృష్టిలో ఉంచుకొని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రజా క్షేత్రంలో పని చేయాలని నిర్ణయం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల అధ్యక్షులకు ఈ సమావేశం ధన్యవాదాలు తెలిపింది. ఈ పొత్తును మనస్ఫూర్తిగా స్వాగతించి క్షేత్ర స్థాయిలో కలసి పని చేయాల‌ని కార్య‌క‌ర్త‌ల‌కు పిలుపునిచ్చింది.

''రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. శాంతిభద్రతలు క్షీణించాయి. ఆడపడుచులకు రక్షణ కరవైంది. యువతకు భవిష్యత్తుపై ఆశలు కనిపించడం లేదు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. రైతులను ఆదుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటువంటి క్లిష్ట తరుణంలో ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవ డం బాధ్యతగా భావించి తెలుగుదేశం – జనసేన ఒక తాటిపై నిలిచి ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నాయి'' అని ఉమ్మ‌డి స‌మావేశం తీర్మానం చేసింది.

టీడీపీ-జ‌నసేన‌ ఈ కూటమిని విజయం దిశగా ముందుకు తీసుకువెళ్ళేందుకు ఇరు పార్టీల అధ్యక్షులు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ ఈ సమావేశం తీర్మానించింది. ఇక‌, మ‌రో కీల‌క‌మైన విష‌యం పైనా ఇరు పార్టీల స‌మ‌న్వ‌య క‌మిటీ నేత‌లు.. తీర్మానం చేశారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియా రంగంపై దాడులు పెరిగిపోతుండటం దురదృష్టకర పరిణామమ‌ని నాయ‌కులు పేర్కొన్నారు. ఎన్నికల‌లో ఓటమి తప్పదనే భయంతో మీడియా ప్రతినిధులు, కార్యాలయాలపై దాడులకు పాల్పడు తున్నారని నాయ‌కులు అభిప్రాయ‌ప‌డ్డారు.

''ఈ దాడులు పాలక పక్షమే చేస్తుండటం వైసీపీ నైజాన్ని వెల్లడిస్తోంది. వైసీపీ ప్రభుత్వ పాలనతో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయిందో.. నేతల అరాచకాలు.. పాలకుడి వైఖరి ఏ స్థాయిలో ఉన్నాయో పత్రికలు, ఛానెళ్లు ప్రజలకు తెలియచెబుతున్నాయి'' అని నాయ‌కులు పేర్కొన్నారు. వీటిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం- మీడియా సంస్థలు, పాత్రికేయులను కట్టడి చేసేందుకు జీవోలు ఇచ్చి కేసులు నమోదు చేయిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తోందన్నారు. ఆయా దాడుల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్టు తెలిపారు. మొత్తానికి ఇరు పార్టీల కీల‌క‌నేత‌లు స‌మ‌న్వ‌య క‌మిటీగా ఏర్ప‌డి తీర్మానం చేయ‌డం గ‌మ‌నార్హం.