Begin typing your search above and press return to search.

స్కిల్ కుంభకోణం డైవర్టే లక్ష్యం!... పవన్ కు ఇదే తక్షణ కర్తవ్యం?

'సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది' అని చెప్పుకునే పవన్... ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు మోకరిల్లేందుకు సిద్ధమయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   15 Sep 2023 7:59 AM GMT
స్కిల్ కుంభకోణం డైవర్టే లక్ష్యం!... పవన్ కు ఇదే తక్షణ కర్తవ్యం?
X

తెలుగుదేశం పార్టీకి ఇంతకాలం అన్నీ తానై నడిపించిన వ్యక్తి ఇప్పుడు జైల్లో ఉన్నారు. దీంతో పార్టీ, కేడర్ సందిగ్ధంలో ఉన్నారనే కామెంట్స్ తెరపైకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో టీడీపీకి ఒక గార్డియన్ కావాలి, కేడర్ కు ఒక భరోసా కావాలి అనుకున్నారో ఏమో కానీ... కష్టకాలంలో పవన్ ను పిలిచారు చంద్రబాబు. దీంతో... ఆర్థికనేరాల కేసుల్లో బెయిల్ అంత త్వరగా రాదని, ఇంకొన్నాళ్ళు జైల్లోనే ఉండక తప్పదని టిడిపికి, చంద్రబాబుకు అర్థమైందనే కామెంట్లు తెరపైకి వస్తున్నాయి.

దీంతో ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో పార్టీని నడిపేది ఎవరు అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు. అదేంటి...? లోకేష్ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఉన్నాడు కదా అనే ప్రశ్న తలెత్తడం సహజం! అయితే... పార్టీని, క్యాడర్ ను నడపగలిగే శక్తి లోకేష్ కు లేదనేది బాబు నమ్మకం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే పరిస్థితుల్లో అచ్చెన్నను నమ్మి ఇంతపెద్ద బాధ్యత కూడా ఇవ్వలేం అనే భయం కూడా ఉండి ఉండొచ్చని అంటున్నారు.

ఇక బాలయ్యను అయితే బాబు పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదని చెబుతున్నారు. బాలయ్య జనాల్లోకి వెళ్తే క్యాడర్ భయపడి పారిపోతారనే ఆలోచన కూడా ఉండి ఉండొచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వచ్చేవరకూ పార్టీని జనంలో యాక్టివ్ గా ఉంచేది ఎలా అని ఆలోచించినట్లున్నారు. దీంతో పాత చుట్టం.. పిలవగానే వచ్చి ఏది చెబితే అది చేసే పవన్ ను పిలిపించారని అంటున్నారు.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్ లో భాగంగా చంద్రబాబును లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ కలిశారు. ఆ తరువాత పవన్ మీడియాతో మాట్లాడారు. రానున్న రోజుల్లో తామంతా కలిసి నడుస్తామని, జగన్ అరాచకాలను అడ్డుకుంటాం అని అన్నారు. టీడీపీ - జనసేన కలిసే పోటీ చేస్తాయని, బీజేపీ ఆలోచించుకోవాలన్నట్లుగా బాల్ అవతలి కోర్టుకు విసిరేశారు. ఇప్పుడు ఈ కూటమిలో చేరతారా లేదా అనేది బీజేపీ ఇష్టం!

పవన్ కల్యాణ్ ఇలా పొత్తుపై రియాక్ట్ అయిన అనంతరం జనసైనికుల్లో సందిగ్ధ పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... "సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది" అని చెప్పుకునే పవన్... ఇప్పుడు ఏకంగా చంద్రబాబు ముందు మోకరిల్లేందుకు సిద్ధమయ్యారనే మాటలు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడా టీడీపీ నేతలు ఊహించిన ఆశించిన స్థాయిలో స్పందన లేదనే మాటలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అరెస్టు అనంతరం భారీగా సానుభూతి వస్తుందనుకుంటే అదీ లేదని అంటున్నారు. ఇన్నాళ్లకు అవినీతి పరుడికి తగిన శాస్తి జరిగిందని అనుకున్న వాళ్లే తప్ప అయ్యో అనేవాళ్ళు లేరని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి.

ఈ విషయంమీద పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం తమ నాయకుల వద్ద ఆవేదన వెలిబుచ్చిన సంగతి తెలిసిందే. జనాన్ని పోగుచేయాలని, అందులో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడాలని విజయవాడ నాయకులను అయన ఆదేశించిన విషయానికి సంబంధించిన ఆడియో లీకైంది! దీంతో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి తక్షణమే అద్దె జనం అండదండలు కావాలని, లేకుంటే మనుగడ కష్టమే అని భావిస్తున్నారనే కామెంట్లు బయటకు వచ్చాయి.

దీంతో ఇందులో భాగంగానే పవన్ కు కొత్త పని అప్పగించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.


కాపు యువత బలి కానుందా?

ఇదిలా ఉండగా ఇప్పుడు పవన్ ఎలాగూ టిడిపితో పొత్తు కలిపేశారు కాబట్టి చంద్రబాబు కోసం కాపులు రోడ్డెక్కాల్సిన అనివార్యతను పవన్ కల్పించారనే చర్చ ఇప్పుడు ఆ సమాజంలో మొదలైందని తెలుస్తుంది. అంటే ఇప్పుడు జనసైనికులు, కాపు యువత చంద్రబాబూ కోసం ధర్నాలు చేయాలి.. ఆందోళనలు చేయాలి.. ప్రభుత్వంతో పోరాడాలి. ఇదే సమయంలో రెండు భుజాలమీద రెండు పార్టీల జెండాలు పట్టుకుని జనసైనికులు యుద్ధం చేయాలనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇంతా చేస్తే అసలు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు? అనేది మరో భారీ ప్రశ్నగా ఉంది. మొదటి నుంచి మన కాపులు.. మన అస్తిత్వం అని ఆశతో ఉంటూ వస్తున్న కాపు నాయకులూ, ఆ సామాజిక వర్గ యువతకు సీట్లు దక్కుతాయా, దక్కితే ఎన్ని దక్కుతాయనేది ఎవరికీ అర్థం కానీ బ్రహ్మ పదార్థంలా మారిందని అంటున్నారు పరిశీలకులు.

పైగా ఈ విషయంలో పవన్ కు కూడా ఈ విషయంలో పెద్దగా కండిషన్స్ ఏమీ లేవా.. చంద్రబాబు ఇచ్చిందే ప్రసాదం అనుకునే పరిషితుల్లో ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది. రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద "అసలు పొత్తులో భాగంగా మీకెన్ని సీట్లు" అని విలేకరి అడిగిన ప్రశ్నకు "అదంతా తరువాత చూద్దాం.. ముందైతే కలిసి పనిచేద్దాం" అన్నారు పవన్.

దీంతో కూలెంతో తెలియకుండా కల్లంలోకి దిగమన్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అవును... పవన్ కళ్యాణ్‌ కే సీట్ల గురించి క్లారిటీ లేనపుడు జన సైనికులకు మాత్రం ఏమి అంచనా ఉంటుందనే చర్చ మొదలైంది. సో... పవన్ తో ఏకీభవించే జనసైనికులు అందాకా ఏమీ అడక్కుండా పని చేయడమే తక్షణ కర్తవ్యంగా భావించాలన్నమాట. ప్రస్తుతం పవన్ కి ఉన్న టాస్క్... జనసైనికులకు పవన్ ఇచ్చిన టాస్క్ కుడా అదే అని అంటున్నారు పరిశీలకులు.