Begin typing your search above and press return to search.

టీడీపీ, జనసేన, బీజేపీ సుముహూర్తం అప్పుడేనా?

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20 లేదా 21 బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వవచ్చని టాక్‌ నడుస్తోంది.

By:  Tupaki Desk   |   17 Feb 2024 6:46 AM GMT
టీడీపీ, జనసేన, బీజేపీ సుముహూర్తం అప్పుడేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 50 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. బీజేపీని తమతో కలుపుకోవాలని ఈ రెండు పార్టీలు ఆశిస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలు అమిత్‌ షా, జేపీ నడ్డాలను కలిసి వచ్చారు. పొత్తులపై చర్చించడానికే చంద్రబాబు వెళ్లారని టాక్‌ నడిచింది. కాగా గతంలోనే.. అంటే టీడీపీ, జనసేన పొత్తు కుదరడానికి ముందే జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ సైతం ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలిసి వచ్చారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20 లేదా 21 బీజేపీ.. టీడీపీ, జనసేనలతో పొత్తుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వవచ్చని టాక్‌ నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ కలిసి ఢిల్లీ వెళ్తారని గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. పొత్తును ఫైనల్‌ చేసుకుని వస్తారని చెబుతున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పొత్తులపై తమ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

కాగా మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఉన్న బీజేపీ పార్లమెంటు సీట్లపైనే దృష్టి సారించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న 25 లోక్‌ సభా స్థానాల్లో ఏకంగా 8–10 వరకు సీట్లను తమకు ఇవ్వాలని టీడీపీ, జనసేనను కోరుతున్నట్టు చెబుతున్నారు. ఈ పది స్థానాల్లో 8 బీజేపీ, మరో రెండు చోట్ల జనసేన పోటీ చేస్తాయని అంటున్నారు.

అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పెద్దగా పట్టుబట్టడం లేదని సమాచారం. 8 పార్లమెంటు సీట్లు తమకు కావాల్సిందేనని కోరుతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ, జనసేనకు 35 అసెంబ్లీ, 10 పార్లమెంటు సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించినట్టు చర్చ నడుస్తోంది.

అందుకే మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 45 స్థానాలను జనసేన, బీజేపీలకు ఇవ్వాల్సిందేనని బీజేపీ నేతలు కోరినట్టు చెబుతున్నారు. ఈ 45 అసెంబ్లీ స్థానాల్లో 12–15 వరకు బీజేపీకి పోగా మిగిలిన స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని అంటున్నారు. ఇలా అయితేనే ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని బీజేపీ, జనసేన.. చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం.

జనసేన తక్కువ సీట్లు తీసుకోవద్దని, అలా తీసుకుంటే కాపు సామాజికవర్గం కూటమికి ఓట్లేయబోదని కాపు సంక్షేమ సేన నేత, మాజీ మంత్రి హరిరామజోగయ్య లాంటివారు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బీజేపీ కూడా ఇలాంటి డిమాండే వినిపిస్తోందని అంటున్నారు.

వచ్చే ప్రభుత్వంలో మూడు పార్టీల సంకీర్ణమే ఉండాలి తప్ప పూర్తిగా మెజారిటీ సీట్లు టీడీపీ తీసుకుని.. ఆ సీట్లతోనే ప్రభుత్వం ఏర్పడేలా ఉండకూడదన్నది బీజేపీ విధానమని చెబుతున్నారు. ఇందుకు చంద్రబాబు కూడా అంగీకరించారని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో సీట్లు రానివారు నిరాశ చెందొద్దని, అధికారంలోకి వచ్చాక వారికి సముచిత న్యాయం చేశామని చంద్రబాబు చెప్పారని గుర్తు చేస్తున్నారు.

ఫిబ్రవరి 20 లేదా 21 తేదీల్లో బీజేపీతో తమ పొత్తును చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ప్రకటిస్తారని అంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా పాల్గొంటారని టాక్‌ నడుస్తోంది.