Begin typing your search above and press return to search.

మూడు తీర్మానాలతో టీడీపీ - జనసేన తొలి సమావేశం... హైలైట్స్ ఇవే!

అవును... ఇరువైపులా 14 మంది నాయకులతో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది.

By:  Tupaki Desk   |   23 Oct 2023 2:37 PM GMT
మూడు తీర్మానాలతో టీడీపీ - జనసేన తొలి సమావేశం... హైలైట్స్  ఇవే!
X

టీడీపీ శ్రేణులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారని కథనాలొస్తున్న "తెలుగుదేశం- జనసేన పార్టీల సమన్వయ కమిటీ" తొలి సమావేశం ఈ రోజు జరిగింది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నారా లోకేష్‌ హాజరయ్యారు. వీరిద్ధరి అధ్యక్షతన రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్న మంజీరా హోటల్‌ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా 6 అంశాల అజెండాతో కొనసాగిందని తెలుస్తుంది.


అవును... ఇరువైపులా 14 మంది నాయకులతో జనసేన, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ భేటీలో జనసేన నుంచి పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్, వి మహేందర్ రెడ్డి, కోటికలపుడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పలవలసాల యశస్వినీ.. పాల్గొనగా... టీడీపీ నుంచి కూడా ఏడుగురు సభ్యులు పాల్గొన్నారు.

వీరిలో... నారా లోకేష్, కింజరాపు అచ్చెంనాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల స్వామ్య ఉన్నారు.

ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైకందుకున్న పవన్... జనసేన - టీడీపీ కలయిక కోసం గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న మద్దతుదారులందరికీ... చారిత్రక ప్రాంతమైన రాజమండ్రి నుంచి జనసేన తరుపున, టీడీపీ తరుపున నమస్కారాలు తెలిపారు. నాలుగు వారాల క్రితం చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేశారని.. తనను ఏపీలోకి అడుగుపెట్టకుండా బోర్డర్ లో ఆపేశారని తెలిపారు.

ఈ సందర్భంగా సీపీఐ, సీపీఎం, బీజేపీ పార్టీలపైన కూడా వైసీపీ దాడి చేసిందని.. వైసీపీ దాడిచేయని పార్టీ అంటూ లేదని పవన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడని నిర్ణయించుకున్నామని తెలిపారు. 2014 పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ దేశ సమైక్యత, తెలుగువారి ఐక్యత, ఏపీ అభివృద్ధి దిశగా పనిచేసినట్లు పవన్ తెలిపారు!

2014లో టీడీపీకి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడానికి గలకారణం... చంద్రబాబు అనుభవమే అని పునరుధ్ఘాటించారు. ఇదే సమయంలో వైసీపీకి, జగన్ కు జనసేన వ్యతిరేకం కాదని చెప్పిన పవన్... వారి విధానాలకు వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అయితే ఆ విధానాలు 2014లో చూశారా.. 2019లో చూశారా.. 2019 ఎన్నికల అనంతర చూశారా అన్నది తెలియాల్సి ఉంది!

ఈ సందర్భంగా... కల్తీ మద్యం అమ్ముతున్నారని, 30వేల కోట్లు మద్యంపై సంపాదిస్తున్నారని, ఇసుక దోపిడీలు, ఖనిజ దోపిడీలు జరుగుతున్నాయని.. అక్రమ కేసులు పెట్టడం వంటివాటితో వైసీపీతో విభేధిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు వైసీపీతో విభేధించడానికి కారణాలు కోకొల్లలు అని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో ఎన్డీయేలో భాగస్వామ్యం గురించి కూడా పవన్ స్పందించారు.

ఎన్డీయేలో భాగస్వామిగా ఉండి కూడా ఏపీ భవిష్యత్తు, ఏపీ అభివృద్ధి కోసం ఒక చారిత్రక పొత్తు జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో 70ఏళ్లు పైబడిన వ్యక్తిని జైల్లో పెట్టి, టెక్నికల్ విషయాలని చెప్పి బెయిల్ రాకుండా చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఈ సందర్భంగా... ఉమ్మడి కార్యచరణ, ఉమ్మడి మేనిఫెస్టోలు ఎలా ఉండాలనే విషయాలపైనే టీడీపీ - జనసేనలు చర్చించినట్లు తెలిపారు.

అనంతరం లోకేష్ మాట్లాడుతూ... 2014లో నవ్యాంధ్రకు రాజధాని లేదని, ఆ సమయంలో సమర్ధవంతమైన నాయకుడు కావాలనే ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్... అన్ కండిషనల్ గా టీడీపీకి - బీజేపీ పొత్తుకి మద్దతు పలికారని గుర్తుచేశారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడటం వల్ల అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినట్లు చెప్పుకొచ్చారు!

ఇదే క్రమంలో మరోసారి రాష్ట్రప్రయోజనాలకోసమే టీడీపీ - జనసేనలు కలిసే ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని లోకేష్ తెలిపారు. ఇదే సమయంలో జిల్లాస్థాయిలో టీడీపీ, జనసేన నాయకులు కలిసి సమావేశాలు ఏర్పాటూ చేసుకోవాలని నిర్ణయించినట్లు లోకేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా లోకేష్ మూడు తీర్మానాలను ప్రకటించారు.

ఇందులో భాగంగా... చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను నిరసించడాన్ని తొలి తీర్మానంగా పెట్టినట్లు తెలిపిన లోకేష్... అరాచక పాలన నుంఛి ఈ రాష్ట్ర ప్రజలను కాపాడటం అనే విషయాన్ని రెండో తీర్మానంగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా... అన్ని వర్గాలనూ అభివృద్ధి బాటలో నడిపిస్తుంది ఈ పొత్తని లోకేష్ తనదైన శైలిలో ప్రకటించారు. ఇలా ఈ మూడు తీర్మానాలనూ ఈ భేటీలో తీసుకున్నట్లు లోకేష్ తెలిపారు. నవంబర్‌ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.

సమావేశానికి ముందు ఫ్యామిలీ ములాకత్:

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌ లో ఉన్న చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి ములాకాత్ అయ్యారు. సోమవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గరకు చేరుకున్న లోకేష్, బ్రాహ్మణిలు.. చంద్రబాబుతో ములాకిత్ అయ్యేందుకు లోపలి వెళ్లారు. వారితో పాటు టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు కూడా ములాకాత్ అయ్యారు.