ఫస్ట్ లిస్టులో టీడీపీ అన్ని.. జనసేన ఎన్నంటే?
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి జాబితాలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే వివరాలు ఉండవంటున్నారు. తెలుగుదేశం.. జనసేన అభ్యర్థుల్ని డిక్లేర్ చేస్తారంటున్నారు.
By: Tupaki Desk | 24 Feb 2024 3:45 AM GMTఏపీలో ఇప్పుడు ఏదైనా హాట్ టాపిక్ ఉందా? అంటే.. విపక్ష టీడీపీ - జనసేన మధ్య పొత్తు లెక్కల మీదనే. ఎన్ని సీట్లను చంద్రబాబు వదులుకుంటున్నారా? ఎన్ని సీట్లను జనసేన చేజిక్కించుకుంటుందన్నది ఆసక్తికర చర్చగా మారింది. ఏది ఏమైనా ఈ రోజున సైకిల్ - గ్లాస్ పార్టీల తొలి అభ్యర్థుల జాబితా విడుదల కావటం ఖాయమంటున్నారు. ఈ సందర్భంగా మొదటి జాబితాలో ఏ పార్టీ ఎన్ని స్థానాలకు తమ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తారు? అన్నది ఆసక్తికర చర్చగా మారింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం మొదటి జాబితాలో బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే వివరాలు ఉండవంటున్నారు. తెలుగుదేశం.. జనసేన అభ్యర్థుల్ని డిక్లేర్ చేస్తారంటున్నారు. అయితే.. ఏ పార్టీకి ఎన్ని? అన్నవిషయంలోకి వెళితే.. తెలుగుదేశం పార్టీ 50 స్థానాల్లో తమ తొలి అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తారంటున్నారు.అదే సమయంలోజనసేన సైతం 15 స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు విడుదల చేసే వీలుందంటున్నారు.
అదే జరిగితే.. చాలా ఎక్కువ స్థానాల్ని జనసేనకు కేటాయించినట్లుగా భావిస్తున్నారు. 175 స్థానాల్లో మొదటి జాబితా 65 స్థానాలైతే.. ఐదారు శాతం కంటే ఎక్కువ సీట్లు జనసేనకు ఇవ్వకూడదన్న ప్రాథమిక లెక్కలకు భిన్నంగా టీడీపీ పోటీ చేసే అభ్యర్థులకు 30 శాతం అభ్యర్థుల్ని ప్రకటించటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరిని బ్యాలెన్సు చేసుకోవటం అవసరమని.. అందుకే జనసేన మొదటి జాబితాలోఅభ్యర్థుల సంఖ్య కాస్తంత ఎక్కువ ఉంటారని.. రాబోయే జాబితాల్లో ఇప్పుడున్నట్లుగా శాతం లెక్కలు వర్కువుట్ కావంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
అయితే.. అలాంటిదేమీ లేదని.. పొత్తు లెక్కల్ని స్వాగతించాల్సిందేనని జనసైనికులు చెబుతున్నారు. పరస్పర విరుద్ధమైన లెక్కలతో ఉన్న ఈ రెండు పార్టీల మధ్య సానుకూల వాతావరణం ఎప్పటికి కుదురుతుందన్నది ప్రశ్నగా మారింది. తొలిజాబితాపై రెండు పార్టీల నుంచి ఒత్తిడి అంతకంతకూ ఎక్కువగా ఉన్న వేళలో.. ఈ రోజు (శనివారం) ఫస్ట్ లిస్టు విడుదల కావటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. అంచనాలకు తగ్గట్లే జనసేనకు భారీగా అవకాశాలు కల్పిస్తూ.. సీట్లు కేటాయిస్తే దెబ్బ ఖాయమంటున్నారు. మొదటి జాబితాను వెంటనే విడుదల చేయటానికి మరో మిత్రుడు బీజేపీ కారణమంటున్నారు. బీజేపీతో పొత్తు.. టికెట్ల లెక్కలు ఒక కొలిక్కి రాకపోవటమే జాబితా విడుదలకు ఆటంకంగా మారాయంటున్నారు. శనివారం ఉదయం సీనియర్ నేతల్ని పార్టీ ఆఫీసుకు రావాలంటూ ఆహ్వానం పంపటం చూస్తే.. తొలిజాబితాను ప్రకటించే వీలు ఎక్కువంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.