Begin typing your search above and press return to search.

#TDPJSPCollapse..ట్రెండింగ్...ఓట్ల బదిలీ కష్టమేనా?

మరోవైపు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 7:26 AM GMT
#TDPJSPCollapse..ట్రెండింగ్...ఓట్ల బదిలీ కష్టమేనా?
X

ఆంధ్రప్రదేశ్‌ అంతా ఇప్పుడు ఒకటే చర్చ. టీడీపీ, జనసేన కూటమి ఎన్నికల్లో పోటీ చేసే తొలి విడత జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో ఉన్న మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో జనసేన కేవలం 24 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు గానూ కేవలం 3 స్థానాల్లోనే పోటీ చేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. దీంతో వైసీపీ తమదే ఇక గెలుపు అని సంబరపడుతోంది.

మరోవైపు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల్లో తీవ్ర నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయని అంటున్నారు. పార్టీనే నమ్ముకుని, పవన్‌ కళ్యాణ్‌ పైన విశ్వాసంతో పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో కేవలం 24 మందికే సీట్లు దక్కనున్నాయి. దీంతో మిగిలినవారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తక్కువ సీట్లతో కాపులెవరూ టీడీపీ, జనసేన కూటమికి ఓట్లు వేయబోరని అంటున్నారు. ఓట్ల బదిలీ సాఫీగా జరగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ తన ప్రచారాన్ని ఉధృతం చేసింది. పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుపోవడం వల్లే చాలా తక్కువ సీట్లు తీసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాపు సామాజికవర్గాన్ని నట్టేట ముంచారని, కాపులెవరూ పవన్‌ ను నమ్మొద్దని వైసీపీ కాపు నేతలు సూచిస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియాలో ఈ ప్రచారం భారీ ఎత్తున సాగుతోంది.

ఇక జనసేన సగటు కార్యకర్తల ఆవేదన అంతా ఇంతా కాదని చర్చ జరుగుతోంది. ఏ ఒక్కరిని కదిపినా.. ‘ఏంటి మనోడు.. ఇలా చేశాడు’, ‘ఇలాగయితే కష్టమే’, ‘మళ్లీ జగనే వస్తాడు’ అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఇంత తక్కువ సీట్లు తీసుకోవడం వల్ల ఓటు షేర్‌ సరిగా జరగదనే విషయం ఆరో తరగతి చదివే తన కుమారుడు కూడా చెబుతున్నాడని.. పవన్‌ కళ్యాణ్‌ కు ఎందుకు తెలియడం లేదని ఒక జనసేన వీరాభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇన్నాళ్లూ పవన్‌ కళ్యాణ్‌ ను నమ్ముకుని బ్యానర్లు, ఫ్లెక్సీలు పెట్టామని, వేరే పార్టీల వారితో గొడవలు కూడా పడ్డామని.. ఇక ఇలాంటివాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు మరో కార్యకర్త కుండబద్దలు కొట్టేశాడు. అభివృద్ధి లేకపోయినా జగన్‌ పథకాల వల్ల తమకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని.. ఈ నేపథ్యంలో తమ ఓటును టీడీపీకి వేసే పరిస్థితే లేదని తేల్చిచెబుతున్నారు. జనసేనకు కూడా ఓట్లేయబోమని వైసీపీకే తమ ఓట్లేస్తామని కొంతమంది కాపు యువకులు వెల్లడించారు.

మరోవైపు సోషల్‌ మీడియాలోనూ TDPJSPCollapse అనే హ్యాష్‌ ట్యాగ్‌ దేశ స్థాయిలో ట్రెండింగుగా మారింది. పవన్‌ కళ్యాణ్‌ నట్టేట మునగడంతోపాటు చంద్రబాబు కూడా మరోసారి మునగడం ఖాయమని పోస్టులు పెడుతున్నారు. TDPJSPCollapse హ్యాష్‌ ట్యాగును వైసీపీ శ్రేణులతోపాటు జనసేన శ్రేణులు కూడా ట్రెండ్‌ చేస్తుండటం విశేషం.

ఇప్పటికైనా మించిపోయింది లేదని.. ఇంకా ప్రకటించాల్సిన 57 సీట్లలోనైనా జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కనీసం 40 సీట్లయినా లేకపోతే పొత్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చిచెబుతున్నారు. మరి తన తిక్కతో ముందుకు సాగుతున్న పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల లెక్కలను పట్టించుకుంటారా అనేది వేయి మిలియన్‌ డాలర్ల ప్రశ్న.