కీలక నియోజకవర్గాల్లో టీడీపీ టికెట్లు ఆ ఇద్దరికే!
కాగా చిత్తూరు జిల్లాలో కీలక నియోజకవర్గాలైన చంద్రగిరి, శ్రీకాళహస్తికి ప్రస్తుతం నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డిలకే టికెట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 14 March 2024 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల రెండో విడత జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదటి విడతలో 94 అసెంబ్లీ స్థానాలకు సీట్లు ప్రకటించిన చంద్రబాబు రెండో విడతలో మరో 34 స్థానాలకు సీట్లను ప్రకటించారు. మొత్తం రెండు విడతల్లో 128 స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. మరో 16 స్థానాలకు మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది.
కాగా చిత్తూరు జిల్లాలో కీలక నియోజకవర్గాలైన చంద్రగిరి, శ్రీకాళహస్తికి ప్రస్తుతం నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డిలకే టికెట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి సీటును ఆశించిన బీజేపీ నేత, శ్రీకాళహస్తి దేవస్థానం మాజీ చైర్మన్ కోలా ఆనంద్ కు నిరాశ ఎదురైంది. వాస్తవానికి శ్రీకాళహస్తిలో కూడా బీజేపీ పోటీ చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ సీటును టీడీపీనే తీసుకుంది.
అలాగే శ్రీకాళహస్తి సీటును జనసేన పార్టీ తరఫున వినుత ఆశించారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఆమె ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. వినుతతోపాటు ఆమె భర్తను పలుమార్లు పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి సీటును పవన్ కళ్యాణ్ తనకే కేటాయిస్తారని వినుత ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆమెకు సీటు దక్కలేదు. టీడీపీ తరఫున బొజ్జల సుధీర్ రెడ్డికి కేటాయించారు.
ఇక గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన చంద్రగిరి సీటును ప్రస్తుత నియోజకవర్గ ఇంచార్జి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నానికి కేటాయించారు. వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రగిరిలో ఈసారి ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో పులివర్తి నాని అయితేనే గట్టిగా ఫైట్ చేయగలరని చంద్రబాబు ఆయనకే సీటు ఇచ్చారు. చంద్రగిరిలో నానితోపాటు ఆయన భార్య సుధ టీడీపీ తరఫున గట్టిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు చంద్రగిరి సీటును డాలర్స్ దివాకర్ రెడ్డి అనే రియల్టర్ కూడా ఆశించారు. భారీగా ఖర్చు పెట్టుకుంటానని తనకే సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరినా ఎట్టకేలకు పులివర్తి నానికే చంద్రగిరి సీటు దక్కింది. ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తిలో సీటు దక్కని కోలా ఆనంద్, వినుత, చంద్రగిరిలో డాలర్స్ దివాకర్ రెడ్డి ఏ మేరకు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నానికి సహకరిస్తారో వేచిచూడాల్సిందే.