Begin typing your search above and press return to search.

అచ్చెన్నా... మరీ అంత ధీమానా ...?

రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు, ఉల్టా పట్లా కొడుతుంది.

By:  Tupaki Desk   |   29 Oct 2023 4:30 PM GMT
అచ్చెన్నా... మరీ అంత ధీమానా ...?
X

రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు, ఉల్టా పట్లా కొడుతుంది. దానికి ఒక్క ఓటు అటు ఇటు అయితే చాలు. అసలే 2024 ఎన్నికలు ఏపీలో హోరా హోరీ పోటీకి దారితీసేలా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రతీ ఒక్క ఓటు కీలకమే. కానీ ఈ విషయం ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు అర్ధం అవుతోందా అన్నదే ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ఉంటున్నా తన సొంత ప్రాంతం ఉత్తరాంధ్రాలో పార్టీ బలోపేతానికి పెద్దగా పనిచేసింది లేదు అని అంటున్నారు.

ఇక శ్రీకాకుళం జిల్లాలో అయినా పార్టీని గాడిన పెడుతున్నారా అన్నది చూస్తే చేదు జవాబే వస్తుంది. ఇక ఆయన 2019లో జగన్ వేవ్ లో గెలిపించిన సొంత నియోజకవర్గం టెక్కలి లో కూడా పర్యటించడం లేదు అని అంటున్నారు. అచ్చెన్న ఉంటే విజయవాడ లేకపోతే విశాఖలో అన్నట్లుగానే గడిపేస్తున్నారు.

ఇంకా కుదిరితే తన సొంత గ్రామం నిమ్మాడ ఇలా వెళ్ళి అలా వస్తున్నారు. అంతే తప్ప టెక్కలిలో ఆయన పర్యటించడం లేదు, పార్టీని పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. టెక్కలిలో అచ్చెన్న టూర్ చేసి కచ్చితంగా ఏడాదికి పై దాటింది అని అంటున్నారు.

మరి అచ్చెన్న ధీమా ఎందుకు అంటే అక్కడ వైసీపీ వర్గ పోరుతో సతమతం అవుతోంది. గడచిన నాలుగున్నరేళ్ళలో ముగ్గురు ఇంచార్జిలను మార్చారు. ఇపుడు ఏకంగా ఎమ్మెల్సీ దువ్వాడ సతీమణి జెడ్పీటీసీ వాణికి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆమె పనితీరు కూడా ఏమీ బాగా లేదు. ఈ నేపధ్యంలో కళ్ళు మూసుకుని గెలుస్తామని అచ్చెన్న భావిస్తున్నారని అంటున్నారు.

అయితే రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదని అంటున్నారు. వైసీపీలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి టికెట్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఆమె బలమైన క్యాండిడేట్. పైగా కేంద్ర మంత్రిగా చేసిన పరిచయాలు ఉన్నాయి. నేరుగా ఎర్రన్నాయుడునే ఓడించిన నేపధ్యం ఉంది.

టెక్కలిలో ఆమెకు గట్టి పట్టు ఉంది. పార్టీలకు అతీతంగా ఆమె డాక్టర్ గా సేవా కార్యక్రమాల పరంగా కూడా జనంలో ఉన్నారు. ఆమెకు టికెట్ అంటే మాజీ ఇంచార్జి ఏపీ కాళింగ కార్పోరేషన్ ప్రెసిడెంట్ పేడాడ తిలక్ పూర్తి మద్దతు ఇస్తారు. అలా వైసీపీలో వర్గ పోరు కూడా తగ్గిపోతుంది.

దాంతో పాటు దువ్వాడ శ్రీను వైపు ఉన్న వారు కూడా కృపారాణి పక్షం వస్తారని అంటున్నారు. టెక్కలిలో అచ్చెన్నను ఓడించాలని జగన్ నుంచి గట్టి పట్టుదల ఉంది. దాంతో ఆరు నూరు అయినా ఈసారి వైసీపీ అంత ఈజీగా ఈ సీటు వదిలేది ఉండదు, మరి అన్నీ తెలిసి అచ్చెన్నాయుడు టెక్కలిలో గెలుస్తాను అని ధీమా ఎలా పడుతున్నారు అన్నదే ప్రశ్నగా ఉంది. తన సొంత నియోజకవర్గం హరిశ్చంద్రపురం అసెంబ్లీ పునర్ విభజనలో పోవడంతో 2009లో అచ్చెన్న టెక్కలికి షిఫ్ట్ అయ్యారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చవి చూశారు.

ఇక 2014, 2019లలో కూడా అచ్చెన్నాయుడు మెజారిటీ ఎనిమిది వేల చిల్లరగానే ఉంది. అక్కడ గతంలో కాంగ్రెస్ కానీ తరువాత వైసీపీ కానీ బలంగానే ఉన్నాయి. పైగా కాళింగులకు ఆ సీటు ఇలాకాగా ఉంది. తమ సీట్లో తమ సామాజిక వర్గం వారే గెలవాలని వారు పట్టుబట్టి ఉన్నారు. ఆ సామాజికవర్గానికే వైసీపీ టికెట్ ఇస్తూ వస్తోంది. ఇలా రాజకీయ సామాజిక సమీకరణలు కలిస్తే అచ్చెన్నకు ఇబ్బందులు తప్పవని అంటున్నారు. అచ్చెన్నాయుడు అతి ధీమా పడడం తగునా అని సొంత పార్టీ నుంచే కామెంట్స్ వస్తున్నాయట.