Begin typing your search above and press return to search.

విజ్ఞత మరిచిన విమర్శలు... టీడీపీ పరిస్థితిని చెబుతున్న బండారు మాటలు!

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం అత్యంత సహజం.

By:  Tupaki Desk   |   30 Sep 2023 9:58 AM GMT
విజ్ఞత మరిచిన విమర్శలు... టీడీపీ పరిస్థితిని చెబుతున్న బండారు మాటలు!
X

రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఉండటం అత్యంత సహజం. కానీ ఉచ్చనీచాలు మరిచి.. సంస్కారం విడిచి.. నిస్సిగ్గుగా, సభ్యసమాజం తలదించుకునేలా.. తమ ఇంట్లో ఆడవాళ్లు చీ తూ అని ఊసేలా మాట్లాడే నేతలు కూడా ఈ రోజుల్లో రాజకీయాల్లో నాయకులుగా చెలామణీ అయిపోతున్నారనే కామెంట్లు ఈ మధ్యకాలంలో బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే చుట్టూ చీకట్లు.. దారి తెన్నూ తెలియని ప్రయాణం.. ఎటు వెళుతుందో తెలియని మార్గం.. ఈ పరిస్థితుల్లో ఎవరిని నిందించాలో తెలియదు.. దీనికి ముగింపు ఎక్కడో అర్ధంకాదు. అందుకే ఏమి చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగుదేశం నాయకులు సోయ తప్పి కామెంట్లు చేస్తున్నారు. విజ్ఞత మరిచిన విమర్శలు చేస్తున్నారు అనే విమర్శలు సంపాదించుకుంటున్నారు.

తాజాగా మైకుల ముందుకు వచ్చిన బండారు సత్యనారాయణ మూర్తి... మంత్రి ఆర్కే రోజా పై నీచమైన విమర్శలు చేశారు. అసభ్యకరమైన మాటలు అన్నారు. తన ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారనే ఇంగితం మరిచినట్లున్నారు. ఈ మాటల వల్ల టీడీపీ మరింత బజారున పడుతుందన్న విషయం ఆలోచించనట్లున్నారు. ఇవాళ మనం ఒకటంటే రేపు మనపైనా, మన ఇంట్లో ఆడాళ్లపైనా, మనం వెనకేసుకొచ్చిన వాళ్లపైనా రెండు పడతాయనే కనీస జ్ఞానం లోపించినట్లుందని చెబుతున్నారు.

అవును... దాదాపు నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన విశాఖ టిడిపి నాయకుడు బండారు సత్యనరాయణమూర్తి.. తాజాగా మంత్రి రోజా మీద చేసిన వ్యాఖ్యలు టీడీపీ నాయకుల మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మహిళా మంత్రిని ఉద్దేశించి రాయడానికి వీల్లేని భాషలో దూషిస్తూ ఘనకార్యం చేసినట్లు విర్రవీగడం చూస్తుంటే పార్టీ ఎటు వైపు పయనిస్తోంది అనే సందేహం కలగక మానదనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పెద్ద దిక్కు చంద్రబాబు జైల్లో ఉన్నారు. యువనేత లోకేష్ పరారీలో ఉన్నారని అంటున్నారు ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడో లేదో తెలీయని పరిస్థితి అని సొంత పార్టీ నేతలే ఆఫ్ ద రికార్డ్ వాపోతున్న పరిస్థితి.

ఇక సీనియర్లు అని చెప్పుకునే వాళ్లూ.. బాబుకు కుడి చెయ్యి, ఎడమ చెయ్యి అని చెప్పుకునే నేతలు సైలెంట్ అయ్యారు. ఇక జిల్లాల్లో క్యాడర్ సైతం గప్ చుప్ అయ్యారని అంటున్నారు. పార్టీకి దిశానిర్దేశం లేక జాతరలో దారితప్పిన పిల్లాడిలా మారింది పరిస్థితి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సమయంలో... చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి వంటివారి దృష్టిలో పడే క్రమంలోనో ఏమో కానీ... సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు కొట్టేయడానికన్నట్లుగా బండారు వంటి నేతలు తమ స్థాయి మరిచి సోయి తప్పి మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోందని తెలుస్తుంది. "బాలకృష్ణ వంటి సంస్కారవంతైన నాయకుడిని రోజా విమర్శిస్తూ మాట్లాడతారా" అంటూ బండారు తమ నాయకుడు బాలయ్యను వెనకేసుకు రావడం చూస్తుంటే ఆయన ఉద్దేశ్యం స్పష్టమవుతోంది.

"ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి" అని బహిరంగ వేధికలపై మాట్లాడిన బాలయ్యను.. ప్రజాస్వామ్య దేవాలయం అయిన అసెంబ్లీలో తోటి సభ్యులవైపు అసభ్యకరంగా చేతులు చూపించిన బాలయ్యను... సంస్కారానికి ప్రతిరూపం అని చెప్పడం ద్వారా బండారు తన గులాంగిరీ స్థాయిని బయటపెట్టకున్నారనే విమర్శలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి.

ఇలాగైనా ఎలాగైనా చంద్రబాబు కుటుంబం ఆశీస్సులు పొందాలన్న ఆతృతతో బండారు.. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతూ తమ నోటి దురద తీర్చుకుంటున్నారనే విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. పదవిలో ఉన్న ఒక మహిళా మంత్రి మీదనే ఇలా అసభ్యకరమైన భాషలో దాడులు చేస్తుంటే మామూలు మహిళలకు వీళ్ళు ఎలాంటి గౌరవం ఇస్తారు? అంటూ రాం గోపాల్ వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆలోచనలు రేకెత్తిస్తోంది.

ఏది ఏమైనా... ఎవరు ఏ పార్టీ అయినా... బండారు సత్యనారాయణ మూర్తి.. మంత్రి రోజాపై చేసిన విమర్శలు మాత్రం మహిళా లోకం అసహ్యించుకునేవని అంటున్నారు పరిశీలకులు. ఇవి ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని చెబుతున్నారు. మరి.. ఈ విమర్శలపై రోజా.. మహిళా పోలీసులకు ఫిర్యాదు చేస్తారా.. లేక, కోర్టును ఆశ్రయిస్తారా.. అదీగాక ప్రభుత్వమే రంగంలోకి దిగి బండారుపై చర్యలు తీసుకుంటుందా అనేది వేచి చూడాలి!

అంతకంటే ముఖ్యంగా... ఈ విమర్శలపై నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఏ విధంగా స్పందిస్తారనేది మరింత ఆసక్తి కరంగా మారింది.