మైలవరం మీద ఒట్టు...వసంతకు దేవినేని రెడ్ సిగ్నల్ ..!
వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు.
By: Tupaki Desk | 5 Feb 2024 2:45 AM GMTవైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ టీడీపీలోకి జంప్ చేయాలని చూస్తున్నారు. తిరిగి తన సిట్టింగ్ సీటు నుంచి పోటీకి ఆయన అన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు అయిన వారి ద్వారానే రాయబారాలు నడుపుతున్నారు అని అంటున్నారు. వసంత మైలవరం నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు.
అయితే ఆయన రాకకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మోకాలడ్డు తున్నారు. పార్టీలోకి దూకి చాలా మంది మైలవరంలో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే నేను మాత్రం మైలవరం నుంచే పోటీ చేస్తాను అంటూ దేవినేని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారి టీడీపీలోకి వస్తున్న వారికి తరిమి కొట్టాలంటూ ఆయన క్యాడర్ కి పిలుపు ఇచ్చారు.
మైలవరం టికెట్ కోసం వసంత తో పాటు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా కన్నేసారు అని దేవినేని చెప్పడం విశేషం. వీరంతా వంద కోట్లు ఖర్చు పెట్టి అయినా మైలవరం టికెట్ సాధించి పోటీ చేస్తారుట అని ఆయన మండిపడ్డారు. వందల కోట్లు ఖర్చు చేసి ఎవరిని కొంటారు అని ఆయన ప్రశ్నించారు.
పార్టీలు మారి రాజకీయ వ్యభిచారం చేసేవారిని దూరం పెట్టాలని ఆయన కోరారు. తాను పాతికేళ్లుగా టీడీపీలో ఉంటూ పార్టీ విధానల ప్రకారం నడచుకుంటున్నానని దేవినేని ఉమా చెప్పుకున్నారు. తన పైన గతంలో హత్యా యత్నాలు కూడా చేశారని ఆయన సంచలన కామెంట్స్ చేశారు. టీడీపీలో ఉన్న వారు ఇతర పార్టీలలో చేరి బాగా ఆస్తులు సంపాదించుకున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను మైలవరం సీటు వదలను చావుకైనా వెనకాడను అని భీషణ ప్రతిన చేశారు దేవినేని, కాకిలా కలకాలం బతికేకంటే హంసలా చచ్చేందుకే దేవినేని సిద్ధం అని ఆయన కార్యకర్తల సాక్షిగా ఒట్టు పెట్టేశారు. తాను 2024లో పోటీ చేయడం ఖాయమని మరో రెండు రోజూలలో మైలవరం నియోజకవర్గం అన్నేరావుపేట నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేస్తాను అని ఆయన ప్రకటించారు.
మొత్తానికి దేవినేని తన పోటీ సీటూ రెండూ చెప్పేశారు. ఇపుడు వసంత ఏమి చేస్తారు అన్నది చూడాలి. వసంత కూడా తన వర్గం నేతలతో మీటింగ్ పెట్టారు. టీడీపీలోకి వెళ్లాలని ఆయన ప్రయత్నం ముమ్మరం చేశారు. అయితే ఆయనకు మైలవరం టికెట్ దక్కదని అంటున్నారు. దేవినేని ఉమా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. బాబు నుంచి తగిన హామీ లేకుండా దేవినేని ఈ విధంగా మాట్లాడరు అని అంటున్నారు.
సో వసంత పార్టీలో చేరితే ఎక్కడ నుంచి పోటీ చేస్తారు ఏ సీటు ఇస్తారు అంటే చెప్పలేని పరిస్థితి. మొత్తానికి వసంత వైసీపీ నుంచి వీడితే కనుక ఆయన రాజకీయ గమ్యం ఏమిటి అన్నది అయోమయంలో పడుతుందా అన్న చర్చ అయితే వస్తోంది.