బీఆర్‌ఎస్ లోకి కీలక టీడీపీ నేత!
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తాజాగా అధికార బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
By: Tupaki Desk | 20 Oct 2023 10:56 AM GMTతెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. నవంబర్ 30న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి జంపింగ్ జపాంగులు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోకి ఇంకో పార్టీలోకి నేతలు జంప్ చేస్తున్నారు. ప్రస్తుతం తామున్న పార్టీల్లో సీటు దక్కే అవకాశం లేదని తేలిపోయినవారు ఆయా పార్టీల్లోకి దూకేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి తాజాగా అధికార బీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్ లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ లో రావుల చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎంపీ రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ మందా జగన్నాథంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
కాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నుంచి రెండుసార్లు టీడీపీ తరఫున రావుల చంద్రశేఖరరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
1994, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ క్రమంలో 1994లో ఏపీ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. టీడీపీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ టీడీపీ నేతలు వివిధ పార్టీల్లో చేరిపోయినా రావుల చంద్రశేఖరరెడ్డి మాత్రం టీడీపీలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.
వనపర్తి జిల్లాలో రావుల చంద్రశేఖర్ రెడ్డికి మంచి పట్టుంది. వచ్చే ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి ఆయన బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.