చెప్పుతో కొట్టాడని చంపేశాడు.. టీడీపీ నేత హత్య కేసులో సంచలన విషయాలు!
అవును... కర్నూలు జిల్లా పత్తికొండలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు.
By: Tupaki Desk | 18 Aug 2024 4:41 AM GMTనాలుగు రోజుల క్రితం కర్నూలు జిల్లాలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పత్తికొండ మండలంలో తెలుగుదేశం పార్టీ నేతను కొంతమంది వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గత బుధవారం తెల్లవారుజామున మాజీ సర్పంచ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ప్రధాన అనుచరుడు వాకిటి శ్రీనివాసులు బహిర్భూమికి వెళ్లాగా దుండగులు కళ్లల్లో కారం చల్లి హత్య చేశారు.
దీంతో... ఈ విషయం స్థానికంగా సంచలనంగా మారింది. సహజంగానే టీడీపీ నేత హత్యకాబడటంతో రాజకీయ రంగు పులుముకుంది. టీడీపీ నేతలు.. వైసీపీపై విరుచుకుపడ్డారు. ఈ హత్య సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసులో ఆధారాలు సేకరించామని, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నామని సూచించారు.
ఈ సందర్భంగా మరిన్ని వివరాలు వెల్లడించిన ఎస్పీ... శ్రీనివాసులు తలపై వెనుక నుంచి గొడ్డలితో నరికినట్లు గుర్తించామని అన్నారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నామని.. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఇదే క్రమంలో... శ్రీనివాసులుకు గ్రామంలో ఎవరితోనూ ఎటువంటి గొడవలూ లేవని స్పష్టం చేశారు. అయితే.. హత్య జరిగిన ప్రాంతానికి కిలోమీటర్ దూరంలో బీరు సీసాలు గుర్తించినట్లు వెల్లడించారు.
మరోపక్క ఈ హత్యపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఫైరయ్యారు. పత్తికొండలో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేశాడనే కక్షతోనే శ్రీనివాసులు కళ్లల్లో కారం కొట్టి కిరాతకంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ & కో తన పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఇదే క్రమంలో... తెలుగుదేశం పార్టీ శ్రేణుల సహహాన్ని, మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేవారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైసీపీ మూకల చేతుల్లో బలైపోయిన శ్రీనివాసులు ఫ్యామిలీకి టీడీపీ అండగా నిలుస్తుందని ట్వీట్ చేశారు. అయితే తాజాగా ఈ కేసును పోలీసులు ఛేదించారు. షాకింగ్ విషయాలు వెల్లడించారు.
అవును... కర్నూలు జిల్లా పత్తికొండలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో భాగంగా... తెలుగుదేశం పార్టీకే చెందిన నర్సింహులే ఈ హత్య చేశాడని తేల్చారు. అందుకుగల కారణాలను పోలీసులు వివరించారు. గతంలో ఇద్దరి మధ్య ఉన్న గొడవలు, తాజాగా కూటమి ప్రభుత్వంలోని పదవుల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా... గతంలో నర్సింహులును శ్రీనివాసులు చెప్పుతో కొట్టారంట. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైందని అంటున్నారు. అదేవిధంగా... శ్రీనివాసులుకే పత్తికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఛైర్మన్ పదవి వస్తుందంటూ గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని నర్సింహులు జీర్ణించుకోలేకపోయాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని స్పష్టం చేశారు.