మాజీ మంత్రుల మధ్య మళ్ళీ అగ్గి... చంద్రబాబుకు అగ్ని పరీక్ష...!
అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ ఇద్దరి నాయకుల మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంటుంది
By: Tupaki Desk | 11 Dec 2023 3:48 AM GMTఅధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆ ఇద్దరి నాయకుల మధ్య అగ్గి రాజుకుంటూనే ఉంటుంది. అది ఎప్పటికి ఆరని రావణ కాష్టంగానే రగులుతుంది. ఆ ఇద్దరు ఇపుడు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలు. వారే చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు.
ఇపుడు పార్టీలో చూస్తే గంటా ప్రాధాన్యత అంతకంతకు పెరిగిపోతోంది. అదే టైం లో అయ్యన్న పాత్రుడు కేవలం ఒక నియోజకవర్గం స్థాయి నేతగా ఉండిపోతున్నారు. అధినాయకత్వం కూడా గంటాకు ఎనలేని ప్రాధాన్యతను ఇస్తోంది అని అయ్యన్న వర్గం తీవ్ర అసంతృప్తిలో ఉంది. నిజానికి చూస్తే పార్టీ ఓడాక గడచిన అయిదేళ్ళూ రోడ్డున నిలిచి పార్టీ పక్షాన పోరాడింది అయ్యన్నపాత్రుడే అని ఆయన వర్గం అంటోంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని నేరుగా ఢీ కొట్టి నిలబడి అనేక కేసులు కూడా అయ్యన్నపాత్రుడు పెట్టించుకున్నారు అని గుర్తు చేస్తున్నారు. అయితే గత నాలుగేళ్ళూ మౌనంగా ఉంటూ చివరి ఏడాదిలో తెర మీదకు గంటా వచ్చారని ఇపుడు ఆయనకే పార్టీ పెద్ద పీట వేస్తోంది అని అయ్యన్న వర్గం మండిపడుతోంది. గంటా మాట జిల్లా రాజకీయాల్లో చెల్లుబాటు కావడం పట్ల కూడా అయ్యన్న వర్గం రగులుతోంది.
ఇక అయ్యన్నపాత్రుడు తన కుమారుడి విజయ్ పాత్రుడుకి అనకాపల్లి ఎంపీ టికెట్ కోరుకుంటున్నారు. అయితే దానికి గంటా మోకాలడ్డుతున్నారని గుర్రుమంటోంది అయ్యన్నవర్గం. తన కుమారుడికి కాకుండా ఒక ఎన్నారై పారిశ్రామిక వేత్తకు ఎంపీ టికెట్ ఇప్పించేలా గంటా అధినాయకత్వం వద్ద పావులు కదపడంతో మండిపోతోంది. గంటాకు రూరల్ జిల్లా రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తోంది.
అంతే కాదు మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా పార్టీకి చెందిన విషయాలు అన్నీ గంటా వర్గమే తమ చేతుల్లోకి తీసుకుని ఆధిపత్యం చేస్తోంది అని అయ్యన్న వర్గం భావిస్తోందిట. అంతే కాదు చంద్రబాబు సైతం గంటాకు ప్రాధాన్యత ఇవ్వడం అయ్యన్నకు అసలు ఏ మాత్రం నచ్చడంలేదు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అంగబలం అర్ధబలం గంటాకు ఉండడం బలమైన సామాజిక వర్గం బ్యాకప్ ఉండడంతో ఆయన మాట చెల్లుబాటు అవుతోంది అని అంటున్నారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి విషమ పరీక్షంగా మారుతున్నాయి. దాంతో గంటా లాంటి బిగ్ షాట్ తమతో ఉండడం టీడీపీకి అవసరం. అందుకే ఆయనను అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు. ఈ పరిణామాలు చూసిన అయ్యన్న వర్గం విధేయత నిబద్ధతకు ప్రాధాన్యత లేదా అని ప్రశ్నిస్తోంది.
ఏది ఏమైనా సీనియర్ మోస్ట్ లీడర్ గా ఉంటూ పార్టీ గీత దాటని అయ్యన్నకు ఆయన కుటుంబానికి రెండు టికెట్లు ఇచ్చి న్యాయం చేయాలని ఆయన వర్గం కోరుకుంటోంది. ఇక అయ్యన్న అయితే అసలే ఫైర్ బ్రాండ్. ఆయన ఇపుడు గంటాకు ఇస్తున్న ప్రయారిటీ పట్ల మండుతున్నారని అంటున్నారు. ఏదో నాడు ఆయన ఓపెన్ అయితే సంచలనమే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఈ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య ఎన్నికల సమయంలో కీలకమైన రాజుకున్న అగ్గిని చల్లార్చడం చంద్రబాబుకు అగ్ని పరీక్ష అని అంటున్నారు.