టీడీపీకి దూరమవుతున్న నేతలు.. మరో ఇద్దరు రాజీనామా
కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి పలువురు నాయకులు రాజీనామా చేస్తున్నారు
By: Tupaki Desk | 12 Jan 2024 3:34 PM GMTకీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీకి పలువురు నాయకులు రాజీనామా చేస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని రిజైన్ చేసి.. 24 గంటలు కూడా గడవక ముందే.. ఆయన అనుచరుడు, పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న లింగమనేని శివరాం ప్రసాద్ తాజాగా రాజీనామా చేశారు. వాస్తవానికి కేశినేని నానికంటే ముందుగానే శివరాం ప్రసాద్.. టీడీపీలో ఉన్నారు. విజయవాడ రాజకీయాల్లోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. నాని ఎంపీ అయిన తర్వాత.. ఆయనకుమరింత చేరువయ్యారు. పార్టీలో కీలక నేతగా ఉన్న ఆయన.. తాజాగా టీడీపీకి రాజీనామా సమర్పించారు.
త్వరలోనే లింగమనేని శివరాం ప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని అనుచరులు చెబుతున్నారు. మరోవైపు.. గుంటూరు జిల్లాలో అగ్రనాయకుడిగా ఉన్న మాజీ ఎంపీరాయపాటి సాంబశివరావు కుమారుడు.. రాయపాటి రంగారావు కూడా.. టీడీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రిజైన్ చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘ లేఖను ఆయన పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. పార్టీలో తమకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. మానసికంగా, ఆర్థికంగా కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని తెలిపారు.
కాగా, రాయపాటి రంగారావు.. వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి కానీ, నరసరావుపేట టికెట్ కానీ ఆశిస్తున్నారు. కానీ, ఈ రెండు నియోజకవర్గాలు ఎప్పుడో రిజర్వ్ కావడం.. రాయపాటి వర్గానికి ఇటీవల కాలంలో కొంత ప్రాధాన్యం కూడా తగ్గడంతో రంగారావు తాజాగా రాజీనామా చేసారు . ఇక, క్షేత్రస్థాయిలో తిరువూరు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లోని టీడీపీ కేడర్‌తో ఎంపీ కేశినేని నాని అనుచరుడు శ్రీనివాస్.. తాజాగా భేటీ అయ్యారు. ఓ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమానికి 200 మంది వరకు హాజరయ్యారు.
త్వరలోనే వీరంతా కూడా టీడీపీ నుంచి బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు నాని వర్గం పేర్కొంది. మొత్తంగా ఎన్నికలకు ముందు టీడీపీలో జరుగుతున్న ఈ కీలక పరిణామాలు.. పార్టీపై ప్రభావం చూపించే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు.. పార్టీలో కొందరు సీనియర్లు మాత్రం ఎలాంటి ఇబ్బందీ లేదని.. పార్టీకి ఎలాంటి నష్టం జరగబోదని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.