హైదరాబాద్ లో చంద్రబాబు భారీ ర్యాలీ
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని, ఏపీకి నిధుల కేటాయింపులో ఉదారత చూపాలని నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కోరారు.
By: Tupaki Desk | 5 July 2024 5:12 PM GMTఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పరిటాల బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారత ప్రధాని నరేంద్ర మోడీతో నిన్న భేటీ అయిన చంద్రబాబు ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్ర శేఖర్, రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్, ఎన్డీఏ తరఫున గెలిచిన ఎంపీలు కూడా ఉన్నారు.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలని, ఏపీకి నిధుల కేటాయింపులో ఉదారత చూపాలని నిర్మలా సీతారామన్ ను చంద్రబాబు కోరారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు నిర్మలమ్మ అభయ హస్తం ఇచ్చారని తెలుస్తోంది. నిర్మల సీతారామన్ తో భేటీ అయిన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కాబోతున్నారు.
మరోవైపు, ఈ రోజు సాయంత్రం ఢిల్లీ పర్యటన ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ కు సాయంత్రం 6 గంటలకు చేరుకోబోతున్నారు. బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో ఆయన రాబోతున్నారు. ఈ క్రమంలోని చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించేందుకు తెలంగాణ టిడిపి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి కూడా ఇచ్చారు. ర్యాలీలో 300 మందికి మించి పాల్గొనకూడదని, డీజే, పేపర్ స్ప్రే గన్స్ వాడకూడదని సూచించారు.
ఈ రోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి చంద్రబాబు నివాసం వరకు రెండు గంటలపాటు భారీ ర్యాలీకి తెలంగాణ టిడిపి శ్రేణులు, టిడిపి అభిమానులు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికలకు ముందు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ పై మాత్రమే దృష్టి సారించానని, ఇకపై తెలంగాణపై కూడా ఫోకస్ పెడతానని టిడిపి అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం చెప్పిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసేందుకు చంద్రబాబు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.