వైరల్: లోకేశ్ ఫోటోకు అర్థనగ్నంగా కూర్చొబెట్టి సారీ చెప్పించారు
గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయం రంగు
By: Tupaki Desk | 10 Jun 2024 5:29 AM GMTగడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పూర్తిగా మారిపోయిన విషయం తెలిసిందే. మిగిలిన రాష్ట్రాల్లోని రాజకీయం రంగు.. రుచి.. వాసనలకు భిన్నంగా ఏపీ రాజకీయాలు ఉంటున్నాయి. రాజకీయ విభేదాలు కక్షలుగా.. రాజకీయ వైరం వ్యక్తిగత శత్రుత్వం వరకు వెళ్లింది. ఇది నేతలకు కాకుండా.. ఆయా పార్టీలను అభిమానించే వారిలోనూ ఇదే పరిస్థితి. దీంతో.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా.. ప్రత్యేక పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న వాదన పెద్ద ఎత్తున వినిపించింది. దీనికి సంకేతంగా ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలిగ్ వేళ హింస చోటు చేసుకుంటుందని భావించారు.
అయితే.. చెదురుముదురు సంఘటనలు మినహా పెద్ద ఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. ఇదిలా ఉంటే.. పోలింగ్ ముగిసిన తర్వాతి రోజు నుంచి ఏపీలోని పలు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున దాడులు.. అల్లర్లుచోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది. చివరకు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి.. ఉన్నతాధికారుల మీద వేటు వేయటంతో పాటు.. కఠినంగా వ్యవహరిచాలన్న విస్పష్ట ఆదేశాలు వచ్చిన తర్వాతే పరిస్థితులు అంతో ఇంతో చక్కబడ్డాయి.
ఎన్నికల పలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తిరుగులేని మెజార్టీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకోవటంతో పాటు.. చరిత్రలో మరెప్పుడూ లేనట్లుగా చారిత్రక విజయాన్ని నమోదుచేసింది తెలుగుదేశం. పార్టీ విజయం సాధించినా.. మంచిరోజు కోసం చంద్రబాబు తన ప్రభుత్వాన్ని ఈ నెల 12న (బుధవారం) కొలువు తీరాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనంతనే ఏపీలోని పలు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు వైసీపికి చెందిన వారిపై దాడులకు తెగబడుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా వైరల్ అయిన వీడియో మాత్రం షాకింగ్ గా మారింది. రాజకీయ వైరంతో.. గత ప్రభుత్వంలో తమ పార్టీ ముఖ్యనేతల్లో ఒకరైన లోకేశ్ ను.. ఆయన తల్లి భువనేశ్వరిని ఉద్దేశించి తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. తెలుగు తమ్ముళ్లు వైసీపీకి నేత ఒకరిపై దాడి చేయటం ఒక ఎత్తు.. అతడ్ని అర్థనగ్నంగా కూర్చోబెట్టి.. లోకేశ్ ఫోటోకు సారీ చెప్పించిన వైనం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్న వైసీపీ మహిళా నేత పాలేటి క్రిష్ణవేణి. వైసీపీ సర్కారు అధికారంలో ఉన్న వేళలో తమ నియోజకవర్గ పరిధిలో ఎవరు తమ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా వారిపై విరుచుకుపడేవారు. ఇదే విషయాన్ని గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ణవేణి మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి జగన్ కానీ ఆయన సతీమణి భారతి మీద ఎవరు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా తాము పోరాడుతున్నట్లుగా వెల్లడించారు.
అంతేకాదు.. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా తాము దూసుకెళుతున్నామని.. అలాంటి తమను లోకేశ్ సానుభూతిపరులు తమకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా పేర్కొనేవారు. చర్యలకు పట్టుబట్టేవారు. తమపై దాడికి పాల్పడిన వారికి ధీటుగా తాము కూడా సమాధానం చెప్పినట్లుగా కూడా ఆమె చెప్పేవారు. మంగళగిరిలో లోకేశ్ రాజకీయ పతనానికి తాను కంకణబద్ధులై ఉన్నట్లుగా చెప్పేవారు.
కట్ చేస్తే.. తాజాగా క్రిష్ణవేణి భర్త రాజకుమార్ ను అర్థనగ్నంగా మార్చి.. లోకేవ్ కటౌట్ ఎదుట కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించటం షాకింగ్ గా మారింది. గతంలో తాను.. తన కుటుంబ సభ్యులు లోకేశ్ మీద కానీ చంద్రబాబు మీద కానీ తప్పుడు వ్యాఖ్యలు చేసి ఉంటే తాను సారీ చెబుతున్నట్లుగా పేర్కొన్నారు. దాడి అనంతరం భయంతో అతను ఆ రకంగా సారీ చెప్పినట్లుగా వీడియోలో కనిపిస్తోంది.
రాజకీయ వైరం వేళ.. ఈ తరహా ఘటనలు ఏ మాత్రం సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు దాష్టీకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న వేళ.. తెలుగు తమ్ముళ్లు కూడా అదే పని ఎందుకు చేయాలి? అప్పుడు వారికి.. వీరికి పెద్దగా తేడా ఉండదన్న విషయాన్ని మిస్ అవుతున్నారు. ఈ తరహా ఘటనలు పార్టీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేలా చేస్తాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.