Begin typing your search above and press return to search.

జనసేనకు ఇస్తే ఇండిపెండెంట్ గా బరిలోకి...!?

జనసేన కోరుతుంది విజయనగరం అసెంబ్లీ, నెల్లిమర్ల, గజపతినగరం గా ఉంది.

By:  Tupaki Desk   |   14 Feb 2024 1:30 PM GMT
జనసేనకు ఇస్తే ఇండిపెండెంట్ గా బరిలోకి...!?
X

టీడీపీకి హెచ్చరికలు చేస్తున్నారు తమ్ముళ్ళు. తమ నియోజకవర్గంలో తాము బలంగా ఉండగా ఆ సీట్లు పొత్తు పేరుతో జనసేనకు కట్టబెడితే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకైనా రెడీ అంటూ ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జనసేన కోరుతున్న సీట్లలో తమ్ముళ్లకు గట్టిగానే బలం ఉంది.

జనసేన కోరుతుంది విజయనగరం అసెంబ్లీ, నెల్లిమర్ల, గజపతినగరం గా ఉంది. అయితే ఇందులో జనసేన విషయంలో ఒక సీటు టీడీపీ ఇవ్వడానికి అంగీకరిస్తోంది అని అంటున్నారు. తమకు మూడు సీట్లూ కావాలని జనసేన కోరుతూంటే ఒక్క దానితో సరిపెట్టాలని టీడీపీ హై కమాండ్ ఆలోచిస్తోంది.

అయితే ఆ ఒక్కటీ ఎక్కడా ఎవరి నెత్తిన పిడుగు పడుతుంది అన్నది పెద్ద చర్చగా ఉంది. నెల్లిమర్లలో ఇప్పటికే పార్టీలోనే రెండు వర్గాల మధ్య పోరు సాగుతోంది. మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి అలాగే ప్రస్తుత ఇంచార్జి కర్రోతు బంగార్ రాజుల మధ్య సీటు కోసం పోటీ ఉంది.

ఇది చాలదు అన్నట్లుగా జనసేన ఈ సీటు కోరుతోంది. లోకం మాధవికి ఆ సీటు ఇప్పించుకోవాలని జనసేన అధినాయకత్వం చూస్తోంది. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. 1983 నుంచి చూస్తే అరడజన్ కి తక్కువ లేకుండా టీడీపీ గెలిచిన సీటు ఇది. దీన్ని వదులుకోవడానికి టీడీపీ హై కమాండ్ కూడా ఇష్టపడడంలేదు అని అంటున్నారు. ఈ నియోజకవర్గంలోనే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం అవుతోంది. రేపటి రోజున అతి పెద్ద సిటీగా నెల్లిమర్ల పరిసరాలు మారనున్నాయి. దాంతో ఎమ్మెల్యే అంటే ఇక్కడే గెలవాలని చూస్తున్నారు.

ఇక విజయనగరంలో అశోక్ గజపతిరాజు కానీ ఆయన కుమార్తె కానీ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఈ సీటు విషయంలో కూడా వదులుకోవడానికి టీడీపీ నో చెబుతోంది అంటున్నారు. జిల్లాకు హెడ్ క్వార్టర్స్ కాబట్టి రాజకీయ కేంద్రంగా ఉన్న సీటు తమ చేతిలో ఉండాలని చూస్తోంది.

దాంతో గజపతినగరం సీటు జనసేనకు ఇస్తారని అంటున్నారు. ఇక్కడ 2014లో గెలిచిన మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు ఉన్నారు. అంగబలం అర్ధబలం దండీగా ఉన్న ఆయన సీటు తనకే ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సీటుని ఇవ్వకపోతే ఆయన ఏమి చేస్తారు అన్న దాని మీద చర్చ సాగుతోంది.

ఆయన ఇండిపెండెంట్ గా అయినా పోటీకి దిగుతారు అన్న ప్రచారం కూడా మరో వైపు సాగుతోంది. ఆయనే కాదు ఉత్తరాంధ్రాలో బలంగా ఉన్న నియోజకవర్గాలలో పొత్తు పేరుతో సీట్లు ఇస్తే ఇండిపెండెంట్ గా బరిలో ఉండేందుకు కొందరు ఉత్సాహం చూపిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి పొత్తు కధ కాదు కానీ ఉత్తరాంధ్రా టీడీపీలో ఎన్నడూ చూడని సంఘటనలు చోటు చేసుకుంటాయని అంటున్నారు.