హ్యాట్రిక్ వీరులు.. టీడీపీకి విధేయులు!
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా 7 సార్లు విజయం దక్కించుకున్నారు.
By: Tupaki Desk | 4 Jun 2024 1:46 PM GMTటీడీపీ ఏపీలో ఈవీఎంల కుంభస్థలం భేదించింది. ఏకంగా ఓట్ల వరద పారించింది. నైరుతిలో వర్షాలు ఇంకా ప్రారంభం కాకుండానే.. దీనికి సంకేతమా అన్నట్టుగా.. ఏపీలో ఓట్ల కుంభవృష్టి కురిసింది. అయితే.. ఈక్రమంలో అనేక సంచనాలు చోటు చేసుకున్నా యి. ఏడు సార్లు గెలిచిన వారు.. తొమ్మిదిసార్లు గెలిచిన చంద్రబాబుతోపాటు.. వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టిన నాయకులు కూడా నాయకులు. అదేసమయంలో తొలిదశలోనే పోటీ చేసి విజయం దక్కించుకున్న వారు కూడా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏకంగా 7 సార్లు విజయం దక్కించుకున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయన టీడీపీ టికెట్‌పైనే మధ్యలో ఓడినా.. 7 సార్లు విజయం సాధించారు. ఇక, నర్సీపట్నం నుంచి పోటీచేసి.. మధ్యలో ఓడినా.. అయ్యన్న పాత్రుడు కూడా.. ఏడుసార్లు విజయం దక్కించుకున్నారు. అదేవిధంగా తాజాగా ఎన్నికల్లో పలువురు హ్యాట్రిక్ కొట్టారు. వీరిలో ఏలూరి సాంబశివరావు.. పరుచూరు నియోజకవర్గం నుంచి వరుస విజయం అందుకున్నారు. ప్రజానేతగా గుర్తింపు పొందారు. గొట్టిపాటి రవికుమార్.. అద్దంకి నుంచి మూడోసారి గెలుపు గుర్రం ఎక్కారు. 2014లో వైసీపీ, 2019, తాజా ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆయన విజయం దక్కించుకున్నారు.
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు కూడా వరుసగా మూడో సారి విజయం దక్కించుకున్నారు. 2014లో తొలిసారి టెక్కలి నుంచి పోటీ చేసిన ఆయన 2019, 2024 ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి పోటీ చేసిన బెందాళం అశోక్ కూడా..వరుసగా విజయం సాధించారు. అన్నగారి కుమారుడు.. నటసింహం నందమూరి బాలయ్య వరుసగా హిందూపురం నుంచిమూడోసారి విజయం దక్కించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నుంచి వరుసగా నిమ్మల రామానాయుడు మూడోసారి గెలుపు గుర్రం ఎక్కారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం నియోజకవర్గంలో నిమ్మకాయల చినరాజప్ప వరుసగా మూడోసారి గెలుపు గుర్రం ఎక్కారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ 2014 నుంచి వరుస విజయాలు అందుకున్నా రు. గతంలో గన్నవరం ఎంపీగా కూడా గెలిచారు. రేపల్లె నియోజకవర్గం నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన అనగాని సత్యప్రసాద్ కూడా వరుస విజయాలు అందుకున్నారు. ఇక, తాజా ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మి దర్శి నుంచి విజయం సాధించారు. పిడుగురాళ్ల మాధవి గుంటూరువెస్ట్ నుంచి టీడీపీ తరఫున గెలుపు గుర్రం ఎక్కారు.