ఆర్జీవీ ఆఫీస్ దగ్గర టీడీపీ నేతల గూండాయిజం!
వాస్తవానికి గత నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఉన్నప్పటికీ పలు కారణాలతో రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Dec 2023 6:26 PM GMTసంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం "వ్యూహం" మొదటి నుంచీ ఎలాంటి సంచలనాలకు వేదికైందనేది తెలిసిన విషయమే. వాస్తవానికి గత నెల 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఉన్నప్పటికీ పలు కారణాలతో రిలీజ్ ను ఆపేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్జీవీ పట్టు వదలని విక్రమార్కుడిలా ఎట్టకేలకు వ్యూహం రిలీజ్ డేట్ ను తీసుకొచ్చారు.. అందుకు తగిన ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... "వ్యూహం" సినిమా ఈ నెల 29న థియేటర్లోకి వస్తోంది. ఈక్రమంలో తాజాగా విజయవాడలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు హాజరయ్యారు. ఇలా సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో టీడీపీ కార్యకర్తలు హంగామా క్రియేట్ చేస్తున్నారు! ఇందులో భాగంగా ఆర్జీవీ డెన్ ముందు పలువురు గూండాలు అల్లర్లు చేశారు!
అవును... హైదరాబాద్ లోని ఆర్జీవీ ఆఫీస్.. “డెన్”ముందు కొంతమంది అల్లరి మూకలు చేరి హంగామా సృష్టించారు. ఇందులో భాగంగా ఆర్జీవీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్జీవీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇకపై చంద్రబాబు, లోకేష్, పవన్ లకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే ఊరుకునేది లేదంటూ.. అసభ్య పదజాలంతో ఆర్జీవీని దూషించారు.
ఇదే సమయంలో వ్యూహం పోస్టర్లను తగులబెట్టిన దుండగులు... సినిమా విడుదలను ఆపేయాలంటూ నినాదాలు చేశారు. ఇదే సమయంలో ఇష్టం వచ్చినట్లు సినిమాలు చేస్తే ఊరుకోము అంటూ వార్నింగ్ లు ఇచ్చే పనికి పూనుకున్నారు. రాయలేని భాషలో ఆర్జీవీపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇలాంటి గుండా ఇజం పనులు చేయడం.. తీరా పోలీసులు వచ్చేసరికి పిరికిపందల్లా పారిపోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
ఇందులో భాగంగా… “సినిమాలపై పడి ఏడవడం ఏమిటి” అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు! టీడీపీ అనుకూల మీడియాలో వస్తున్న కథనాలతో పోలిస్తే ఈ సినిమా చాలా చిన్నదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తుండటం గమనార్హం. ఇలాంటి దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని అంటున్నారు పరిశీలకులు. ఈ సందర్భంగా సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా స్పందించిన ఆర్జీవీ... “నా ఆఫీసు బయట మీ కుక్కలు మొరుగుతున్నాయి.. తీరా పోలీసులు వచ్చే సరికి అవి పరారైపోయాయి” అంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ లను ట్యాగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి గుండాయిజాల కార్యక్రమాలను టీడీపీ నేతలు మానుకోవాలని పలువురు హితవు పలుకుతున్నారు!