బాబు మాట వినని నేతలు.. సీఎంకు మచ్చతెస్తున్నారా?
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. గతాన్ని వదిలేయాలని చెబుతున్నారు. ``నిజమే.. గత ఐదేళ్లలో మనం అనేక ఇబ్బందులు పడ్డాం
By: Tupaki Desk | 16 Jun 2024 3:30 PM GMTటీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. గతాన్ని వదిలేయాలని చెబుతున్నారు. ``నిజమే.. గత ఐదేళ్లలో మనం అనేక ఇబ్బందులు పడ్డాం. అనేక కేసులు కూడా ఎదుర్కొన్నాం. కానీ, మనం కూడా వారిలాగానే (వైసీపీ) ఉందామా? అలా వద్దు. ఏదైనా ఉంటే చట్టం ప్రకారంముందుకు సాగుదాం`` అని తమ్ముళ్లకు, పార్టీ నాయకులకు పదే పదే చెబుతున్నారు. తాజాగా శనివారం కూడా పార్టీ కార్యాలయంలో ఆయన మంత్రులు, ఇతర జిల్లాల సీనియర్లకు కూడా కక్ష సాధింపు రాజకీయాలు మనకు వద్దని తేల్చి చెప్పారు.
అయితే.. చంద్రబాబు అలా చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ముఖ్య నాయకులు కొందరు మాత్రం వివాదాల ను పెంచి పోషించి.. అధినేతకు మచ్చలు అంటించే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా విజయవాడలోని శివారు ప్రాంతం, నూజివీడు వెళ్లే దారిలో `అక్రమ నిర్మాణం` పేరుతో విజయవాడ మునిసిపల్ అధికారులు ఓ కట్టడాన్ని కూల్చివేశారు. కానీ, దీని వెనుక రాజకీయం ఉందనేది అందరికీ తెలిసిందే.
విజయవాడ-నూజివీడు రహదారిపై నిర్మించిన ఈ కట్టడం వైసీపీ నేత నందెపు జగదీష్ ది కావడం విశేషం. ఆయనపై వ్యతిరేకతతోనే దీనిని కూల్చివేశారని వైసీపీనాయకులు ధర్నాలకు దిగారు. నిజానికి నందెపు జగదీష్. తాజాగా సెంట్రల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు, ఫైర్ బ్రాండ్ బొండా ఉమా మహేశ్వరరావుకు ప్రధాన అనుచరుడు. 2019 ఎన్నికల వరకు కూడా ఆయన టీడీపీలోనే ఉన్నారు. 2022లో పార్టీ మారి వైసీపీలోకి చేరిపోయారు.
అయితే.. నందెపు జగదీష్ వివాదాలకు కడుదూరంగా ఉంటారు. కానీ, తన వర్గం కాకుండా.. పొరుగు పార్టీకి జై కొట్టారన్న కసితో ఉన్న టీడీపీ నేత బొండా ఉమా.. జగదీష్‌కు చెందిన కట్టడాన్ని ఇలా కూల్చి వేశారని.. వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఏదేమైనా.. రాజకీయంగా ప్రత్యర్థుల ఇళ్లపైకి, వారి కట్టడాలపైకి బుల్ డోజర్లు నడిపించే సంస్కృతిని ఈ పరిణామం తలపిస్తోంది. ఇలాంటివి వద్దనే చంద్రబాబు చెబుతున్నారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం ఆయన చెప్పిన మాటలను వినిపించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. తాజా పరిణామంతోఉద్కిక్తతలను కొని తెచ్చుకోవడమేనని అంటున్నారు పరిశీలకులు.