బాబు అరెస్టు...ఈ నేతలకు గొప్ప వరంగా మారిందిగా!
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన విషయం తెలిపిందే.
By: Tupaki Desk | 24 Sep 2023 11:09 AM GMTటీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయిన విషయం తెలిపిందే. చంద్రబాబు కుమారుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సైతం త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం సైతం జోరుగా సాగుతోంది. చంద్రబాబు అరెస్టు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారగా... తెలుగుదేశం పార్టీ శ్రేణులను కలవరపాటుగు గురిచేస్తోంది. అయితే, చంద్రబాబు అరెస్టు, తదనంతర ఎపిసోడ్ తమకు దక్కిన గొప్ప అవకాశంగా పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధ్యక్షుడు అరెస్టు అయితే పార్టీ నేతలు ఇదే గొప్ప చాన్స్ అనుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా... ఎవరి లెక్కలు వారికి ఉంటాయి మరి!
చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన అరెస్టు చేయగా... బాబుపై అక్రమ కేసులను కొట్టివేయాలని, ఆయన్ని విడుదల చేయాలంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతల నిరసనలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లిపోతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు సభా వేదికగా తమ నిరసన గళాన్ని వినిపిస్తుండగా... ఆ చాన్స్ దొరకని టీడీపీ నేతలు ఇదే చాన్స్ అని వాడుకుంటున్నట్లు సమాచారం. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు చంద్రబాబు అరెస్టును వాడుకుంటున్నట్లు సమాచారం.
టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్న వారు అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పటికీ, తృటిలో చాన్స్ కోల్పోయిన వారు లేదా భవిష్యత్తులో చట్టసభల్లో అడుగు పెట్టాలి అనుకుంటున్న వారు చంద్రబాబు అరెస్టు చాన్స్ ఉపయోగించుకుంటూ తమ తమ నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేయడమే కాకుండా చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారంటూ తెలియజేశారంటూ వివరిస్తున్నారు. మునుపటి కంటే ప్రజలు తమ అబిప్రాయాలను వినడం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని టీడీపీ నేతలు పలువురు అంతర్గత సంభాషణల్లో పేర్కొంటున్నారట. దీంతోపాటుగా పార్టీ శ్రేణులను యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఓ మంచి చాన్స్ దొరికిందని భావిస్తున్నారట. మొత్తంగా బాబు అరెస్టు టీడీపీ నేతలను ఎంతగా బాధిస్తుందో ... అదే రీతిలో ఎంతో కొంత మేలు కూడా చేస్తోందని అంటున్నారు.