టీడీపీ.. చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది ఇది!
ఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటోంది
By: Tupaki Desk | 6 Aug 2024 9:53 AM GMTఆంధ్రప్రదేశ్ లో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్పుకుంటోంది. తమ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో మహిళల భద్రత అంశం కూడా ఒకటని తరచూ చెబుతోంది. ప్రభుత్వంలోనూ ఒకేసారి ముగ్గురు మహిళలకు మంత్రులుగా చంద్రబాబు అవకాశమిచ్చారు. వీరిలో ఒకరిని హోం శాఖ మంత్రిగా నియమించడం విశేషం.
మహిళలను ఎవరు అవమానించినా, వారు ఏ పార్టీ వారైనా, సోషల్ మీడియాలో మహిళలను అవమానిస్తూ పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు, హోం శాఖ మంత్రి వంగలపూడి పలుమార్లు చెప్పారు.
అయితే నోరు ఒకటి చెబితే.. చెయ్యి ఒకటి చేస్తుందన్నట్టు టీడీపీ నేతలు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించాయి, ముఖ్యంగా టీడీపీ అధికారి ప్రతినిధి, నెల్లూరు జిల్లా నేత ఆనం వెంకట రమణారెడ్డి.. వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు దుమారం రేపుతోంది.
ప్రస్తుతం ఆర్కే రోజా విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజా విదేశాల్లో ఉన్న ఫొటోను పోస్టు చేసిన ఆనం వెంకట రమణారెడ్డి దానిపై వ్యంగ్యంగా స్పందించారు. ‘అక్క సూపర్’ అంటూ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్ పక్కనే విరగబడి నవ్వుతున్నట్టు ఒక ఎమోజీని కూడా ఆనం వెంకట రమణారెడ్డి పోస్టు చేశారు.
గత కొంతకాలంగా ఆనం వెంకట రమణారెడ్డి.. ఆర్కే రోజాపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఈ కోణంలో రోజా విదేశీ పర్యటనకు సంబంధించి ఆమె ఫొటోను పోస్టు చేసిన ఆనం ఆమెను ఎగతాళి చేశారు.
రాజకీయపరంగా, సైద్ధాంతికంగా ఎవరు ఎవరినైనా విమర్శించవచ్చు. దీన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఒకరి వ్యక్తిగత విషయాలను లేదా వారి ఆహార్యాన్ని, డ్రస్సింగ్ స్టయిల్ ను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదంటున్నారు.
ఇప్పుడు రోజాపైన ఆనం వెంకట రమణారెడ్డి పెట్టిన పోస్టు కూడా ఇలాగే ఉందని అంటున్నారు. ఆమె విదేశీ పర్యటనలో ధరించిన డ్రస్సుతో ఉన్న రోజా ఫొటోను పోస్టు చేసిన ఆయన దానిపై వ్యంగ్యంగా స్పందించారు. ఆనం పోస్టుపై నెటిజన్లు తమకు తోచిన రీతిలో స్పందిస్తున్నారు.
మరి మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యలు చేసినా, పోస్టులు పెట్టినా వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పినట్టు తమ పార్టీ నేత ఆనం వెంకట రమణారెడ్డిపై చర్యలు తీసుకుంటారా? తీసుకోకపోతే టీడీపీ నేతల మాట ఒకటి.. చేత ఒకటిగా భావించాల్సి ఉంటుందని అంటున్నారు.
గతంలో అధికార పక్షంలో ఉన్నప్పుడు రోజా చేసిన వ్యాఖ్యల పట్ల ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. ఇందులో ఎవరికీ ఏ సందేహం అవసరం లేదు కూడా. ఇందుకు తగ్గట్టే ఆమె భారీ వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఇది మొన్నటి ఎన్నికల్లో ప్రతిఫలించి ఆమె చిత్తుగా ఓడారు. ఇప్పుడు అదేపని టీడీపీ నేతలు చేస్తే.. వైసీపీకి, టీడీపీకి తేడా ఏముంటుందనే చర్చ జరుగుతోంది.