టీడీపీ మ్యానిఫేస్టోకి ఏడాదికి ఆరు లక్షల కోట్లు కావాలా ?
ఎన్నికల మ్యానిఫేస్టోలు గడచిన కొన్ని ఎన్నికల నుంచి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు
By: Tupaki Desk | 3 May 2024 2:30 PM GMTఎన్నికల మ్యానిఫేస్టోలు గడచిన కొన్ని ఎన్నికల నుంచి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. గతంలో అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు. కానీ ఇపుడు ప్రజలలో చైతన్యం పెరిగింది. దానికి తోడు ఓడిపోయిన పార్టీకి అవే ఆయుధాలుగా మారుతున్నాయి. పదేళ్ళ క్రితం బీజేపీ దేశంలో ఇచ్చిన హామీలను సైతం ఈ రోజుకూ గుర్తుకు తెచ్చి ఎందుకు అమలు చేయడం లేదూ అని అడిగే రాజకీయ చైతన్యం జనాలకు వచ్చింది అంటే వాటిని ఏ విధంగానూ తక్కువ చేయడానికి లేదు.
ఓట్లు వస్తాయి కదా నోటికి వచ్చిన హామీలు గుప్పిస్తే ఆనక అధికారంలోకి వచ్చిన తరువాత నానా ఇబ్బందులు పడాలి. అది అంతిమంగా ప్రభుత్వ మనుగడకే కాదు పార్టీ మనుగడకు విశ్వసనీయతకు కూడా అతి పెద్ద ముప్పుగా పరిణమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఇపుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. అలాగే ప్రతీ వారి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.
నేతలు చెప్పే ప్రతీ ఒక్క మాటా రికార్డు అవుతొనే ఉంటుంది. కాదని తప్పించుకునే వీలే లేదు. అందుకే ఇచ్చే హామీ ఏదైనా ఆచీ తూచీ వ్యవహరించాలి. మరి తెలుగుదేశం అన్నీ ఆలోచించుకునే హామీలు ఇచ్చిందా అన్న చర్చ వస్తోంది. ఎందుకంటే వైసీపీ బటన్ నొక్కుడు కార్యక్రమాన్ని ఎద్దేవా చేస్తూ ఏపీ శ్రీలంక అవుతుందని అప్పుల కుప్ప అవుతుందని బండలేసి ప్రతీ రోజూ రచ్చ చేసిన టీడీపీ ఇపుడు తన ఎన్నికల హామీలతో అంతకంటే పెద్ద గోతిలో తానే పడుతోందా అన్న చర్చ అయితే హాట్ గానే సాగుతోంది.
వైసీపీ అయిదేళ్ల పాటు ఎన్నికల ప్రణాళికను అమలు చేసింది. నవరత్నాలు అమలు చేయడానికి ఏటా డెబ్బై వేల కోట్లు ఆ పార్టీకు ఖర్చు అయ్యాయి. ఇపుడు టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టోని చూస్తే కనుక దానికి పది రెట్లు హామీలు గుప్పించారు. అవన్నీ తీర్చాలీ అంటే కనుక ఏడాదికి కచ్చితంగా ఆరు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి తీసి పక్కన పెట్టాల్సిందే అని అంటున్నారు.
ఇక ఏపీ బడ్జెట్ తిప్పి తిప్పి చూసినా మూడు లక్షల కోట్ల రూపాయలు అని చెబుతున్నా అది కూడా కాదనే అంటున్నారు. అప్పులు అన్నీ వైసీపీ ప్రభుత్వం చేసి పారేసింది అని అంటున్నారు. ఆఖరికి ఆస్తులు తాకట్టు పెట్టి కూడా అప్పులు తెచ్చి అయిదేళ్ల పాటు పంటి బిగువున జగన్ సంక్షేమ పధకాలు అమలు చేశారు. ఇచ్చిన మాటకు తప్పకుండా ఆయన పధకాలను అమలు చేశారు.
తన క్రెడిబిలిటీని కాపాడుకోవడానికి కరోనా అనంతరం ఆర్థిక వ్యవస్థ చితికిపోయినా అప్పులతో అంతా నడిపించారు. ఇపుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా అప్పులు పుట్టే పరిస్థితి లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే అప్పులు తీసుకోవాలి. అదే విధంగా కేంద్రం ఉదారంగా నిధులు ఏపీకి ఇచ్చే పరిస్థితి ఎపుడూలేదు.
టీడీపీ ఎన్నికల మ్యానిఫేస్టోకి బీజేపీ దూరం జరగడం వెనక ఆర్ధిక భారం మా నెత్తిన పెట్టొద్దు అన్న బలమైన సందేశం ఉంది అని అంటున్నారు. ఇక టీడీపీ వారు ఇంత డబ్బు ఎలా తెస్తారు అంటే ఠక్కున చెప్పే సమాధానం సంపద సృష్టిస్తామని. పధకాలు ప్రభుత్వ వచ్చిన డే వన్ నుంచి స్టార్ట్ చేయాల్సిందే. సంపద సృష్టి అన్న బావి తవ్వడం మొదలెడితే ఫలితాలు వచ్చేటప్పటికి మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి.
అయినా ఏపీ ఆర్ధికంగా ఎంతవరకూ పొటెన్షియాలిటీ కలిగి ఉంది. ఏపీలో సంపద సృష్టించడం అంటే కుదిరే వ్యవహారమేనా నూటికి ఎనభై శాతం మంది జనాభా కేవలం వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం ఏపీ అన్నది కూడా చూడాలి అని అంటున్నారు. ఏపీలో మహా నగరాలు లేవు. ఉన్నంతలో విశాఖ ఉంది. విజయవాడ ఆ తరువాత ప్లేస్ ఇక టైర్ టూ సిటీస్ మాత్రమే ఉన్నాయి. మిగిలినవి పట్టణాలు కొన్ని ఉంటే ఎక్కువ శాతం పల్లెలు.
సేవా రంగం కానీ ఐటీ రంగం కానీ అభివృద్ధి చెందేందుకు చాలా ఎక్కువ సమయం పడుతుంది. పారిశ్రామికంగా ఏపీ అభివృద్ధి సాధించాలన్నా కూడా లాంగ్ టైం పడుతుంది అని అంటున్నారు. మరి ఇంతలా ఏపీ ఇబ్బందులలో ఉన్న వేళ ఏటా ఆరు లక్షల కోట్లతో ఖర్చు చేయాల్సిన పథకాలని మ్యానిఫేస్టో రిలీజ్ చేసిన చంద్రబాబు విజనరీ అని ఎలా అనాలి అన్నదే అతి పెద్ద ప్రశ్నగా ఉందిపుడు.
ఈ ఎన్నికల మ్యానిఫేస్టో తరువాత టీడీపీ చంద్రబాబు క్రెడిబిలిటీని ప్రశ్నిస్తున్న వారు పెరుగుతున్నారు కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకోవడం కోసమే ఈ మ్యానిఫేస్టో తప్ప ఆచరణకు సాధ్యం కాదని ముందే తేల్చేస్తున్నారు. మరో వైపు జగన్ స్కీములకు డబ్బులు పంచితే శ్రీలంక అవుతుందని చెప్పిన టీడీపీకి ఇపుడు చంద్రబాబు పధకాలకు పంచితే అమెరికా అవుతుందా అని ఎద్దేవా చేస్తున్నారు. అలవి కాని ఆచరణకు నోచుకోని హామీలు కాబట్టే బీజేపీ ఈ ఎన్నికల ప్రణాళికకు మద్దతు ఇవ్వడం లేదని కూడా అంటున్నారు.