Begin typing your search above and press return to search.

టీడీపీ మ్యానిఫేస్టో : ఏపీ శ్రీలంక మాత్రం కాదు లెండి !

కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే వాటిని అమలు చేస్తున్నారు అని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

By:  Tupaki Desk   |   1 May 2024 2:30 AM GMT
టీడీపీ మ్యానిఫేస్టో : ఏపీ శ్రీలంక మాత్రం కాదు లెండి !
X

ఏపీలో వైసీపీ సంక్షేమ పధకాలు ఇబ్బడి ముబ్బడిగా అయిదేళ్ళూ అమలు చేసింది. నిజానికి అందులో కొన్ని అవసరమా అనిపించకమానదు. కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసమే వాటిని అమలు చేస్తున్నారు అని అంతా అంటున్న నేపధ్యం ఉంది.

ఇక వైసీపీని విమర్శించే క్రమంలో తొలి మూడేళ్ళూ ఏపీ శ్రీలంక అయిపోతుందని టీడీపీ జనసేన విమర్శలు గుప్పించాయి. పప్పు బెల్లాలుగా పంచేస్తారా అని గద్దించాయి. తీరా చూస్తే ఇపుడు ఎన్నికల వేళకు నాలుక మడతేసి టీడీపీ కూటమి విడుదల చేసిన మ్యానిఫేస్టో చూస్తే కనుక ఏపీ శ్రీలంక మాత్రం కాదు లెండి అని సెటైర్లు పడుతున్నాయి.

ఎందుకంటే వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలకు రమారమి డెబ్బై నుంచి ఎనభై వేల కోట్లు ఏటా ఖర్చు అవుతూంటే నిజంగా టీడీపీ మ్యానిఫేస్టో అమలు చేయాలనుకుంటే మాత్రం మూడింతలు ఇంతకు ఖర్చు అవుతుందని ఆర్ధిక నిపుణులు లెక్క వేస్తున్నారు. అంటే రెండు లక్షల కోట్ల రూపాయలు అన్న మాట. మరి అదే జరిగితే ఏపీ శ్రీలంక లాంటి ఆర్ధిక సంక్షోభమేంటి దాని బాబు లాంటిదే చూస్తుంది అని అంటున్నారు.

అందుకే శ్రీలంకతో పోలిక వద్దు అని కామెంట్స్ చేస్తున్నారు. అయినా కానీ ఈ తాయిలాలు ఏమిటి, ఈ హామీలను గుప్పించడం ఏమిటి. అసలు ఏపీకి ఏమి ఉంది ఆర్ధిక వనరులు ఏమి ఉన్నాయని అనుభవం తో పండిన చంద్రబాబు ఆలోచించారా అన్న చర్చ వినిపిస్తోంది. దేశంలో ఎక్కడా లేని అన్ని పధకాలు తెచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఇక్కడ ఒక్కటే ధైర్యం అనుకోవాలని వైసీపీ విమర్శిస్తోంది. ఎటూ అమలు చేయం కాబట్టే ఇంత డేరింగ్ గా హామీలు ఇచ్చారని.

ఇక మేధావులు కూడా అమలు చేయలేని హామీలే ఇవి అని అంటున్నారు. కేవలం ఓట్ల పంట పండించుకోవడానికే తప్ప ఏపీ కోసం ఇచ్చే హామీలు కానే కావని అంటున్నారు. ప్రతీ కులానికీ తాయిలాలు ప్రకటించారు. ఎవరికి ఏమి ఇస్తారో తెలియదు కానీ ఇస్తున్నామని మాత్రం ప్రకటించారు.

ఈ మ్యానిఫేస్టోని చూసిన వారు అంతా ఇది వాస్తవాలకు దూరంగానే ఉంది అని అంటున్నారు. చంద్రబాబు చిత్తశుద్ధితో ఈ హామీలను అమలు చేయాలని చూస్తే మాత్రం ఏపీని ఎన్ని సార్లు అమ్మాలో కూడా అర్ధం కాదనే అంటున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండదనే అంటున్నారు.

ఇవన్నీ ఎలా చేస్తారు అంటే సంపద సృష్టిస్తామని చంద్రబాబు చాలా ఈజీగా అంటున్నారు. నిజానికి చంద్రబాబు ఉమ్మడి ఏపీని తొమ్మిదేళ్ళు పాలించి దిగిపోయిన తరువాత పూర్తి రెవిన్యూ లోటుతోనే వైఎస్సార్ కి అధికారం అప్పగించారు అని నాటి కాంగ్రెస్ నేతలు చెప్పారు. అవి రికార్డులలో ఉన్నాయి. ఇక విభజన ఏపీలో అయిదేళ్ళూ అప్పులతోనే రాష్ట్రం నడచింది అన్నది తెలిసిందే.

సంపద సృష్టించడం అన్నది అంత సులువు కాదు అలాగని అది జరగదు అని కూడా కాదు. కానీ ఒక రూపాయి సంపద సృష్టిస్తే రెండు రూపాయల ఖర్చు రెడీగా ఉంటుంది. ఇది సంసారం. అసలైన సంపద సృష్టించడం అంటే అర్ధం ఏంటి అంటే ఉన్నంతలో ఖర్చు తగ్గించుకుని పొదుపు చేయడమని తలపండిన ఆర్ధిక నిపుణులు చెబుతారు.

అంతే తప్ప ఏమీ లేని రాష్ట్రానికి పదమూడు లక్షల కోట్ల అప్పు ఉన్న ఏపీకి ఇంకా ముంచడానికి ఈ ఉచిత హామీలు ఇస్తూ పోతే అసలు రాష్ట్రం ఉనికికే ముప్పు వాటిల్లుతుంది అని అంటున్నారు. ఖాయిలా పడ్డ పరిశ్రమలు అని అంటూంటారు. అలా రాష్ట్రం ఖాయిలా పడకూడదు. వైసీపీ టీడీపీ ఇలా పోటీ పడుతూ ఇస్తున్న హామీలతో ఏపీ భవిష్యత్తు ఏమి అవుతుందో దేవుడికే ఎరుక అన్నది ఏమీ మీద మమకారం ఉన్న వారు బాధాతప్త హృదయంతో అంటున్న మాట.

ఏపీని సరైన దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపించాల్సిన దార్శనికత కరవు అవుతోంది అనడానికే ఇవన్నీ అంటున్న వారూ ఉన్నారు. సమస్యలు ఎపుడూ ఉంటాయి. వాటికి పరిష్కారం వెతికే వారు లేకపోవడమే అసలైన సమస్య అన్నది ప్రముఖుల మాట. ఏపీ పరిస్థితి చూస్తే అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.