Begin typing your search above and press return to search.

కేంద్రంలో టీడీపీ మంత్రులు వీరే ?

ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా టీడీపీ కోటాలో నలుగురు జనసేన కోటలో ఒకరు ప్రమాణం చేసే అవకాశం ఉంది

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:42 PM GMT
కేంద్రంలో టీడీపీ మంత్రులు వీరే ?
X

ఈ నెల 9న రాత్రి ఏడున్నర గంటలకు కేంద్ర మంత్రివర్గం ప్రమాణం చేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా అరవై మందికి తక్కువ లేకుండా మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా టీడీపీ కోటాలో నలుగురు జనసేన కోటలో ఒకరు ప్రమాణం చేసే అవకాశం ఉంది. అలాగే బీజేపీ నుంచి ఒకరూ లేదా ఇద్దరు మంత్రులు కావచ్చు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో శుక్రవారం రాత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా మంత్రివర్గంలో చర్చించారు. మంత్రివర్గంలో చేరే టీడీపీ ఎంపీల విషయంలోనూ క్లారిటీ వచ్చినట్లుగా చెబుతున్నారు. నడ్డా నివాసానికి బాబుతో పాటు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ కూడా ఒకే కారులో వెళ్ళారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి నలుగురు చేరుతారు అని అంటున్నారు. వారిలో ఇద్దరికి క్యాబినెట్ బెర్తులు దక్కుతాయి అని తెలుస్తోంది. అలాగే మరో ఇద్దరికి సహాయ మంత్రులు దక్కుతాయని అంటున్నారు.

క్యాబినెట్ మంత్రుల జాబితాలో గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఈయన అమెరికాలో బడా పారిశ్రామికవేత్త. తన నామినేషన్ పత్రాల మీద వేల కోట్ల ఆస్తులు ఓపెన్ గా రాసిన ఈయన అప్పట్లో సెన్సేషన్ అయ్యారు.

ఈయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటిస్తే ఏపీకి భారీ ఎత్తున పరిశ్రమలు తెస్తారని బాబు భావిస్తున్నారుట. ఈయన గుంటూరు జిల్లా నుంచి గెలిచారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఏపీలో పెట్టుబడులు రావాలంటే ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఉండడం కరెక్ట్ అని బాబు భావిస్తున్నారుట.

ఇక రెండవ పేరు చూస్తే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయన శ్రీకాకుళం నుంచి మూడవసారి ఎంపీగా గెలిచారు. ఆయనకు క్యాబినెట్ ర్యాక్ పదవి ఇస్తారని అంటున్నారు. గతంలో ఆయన తండ్రి చూసిన గ్రామీణాభివృద్ధి శాఖకే రామ్మోహన్ కి దక్కేలా బాబు చక్రం తిప్పుతున్నారు అని అంటున్నారు. కింజరాపు కుటుంబం టీడీపీకి విధేయంగా ఉంటూ వస్తోంది. అది కూడా ప్లస్ పాయింట్. బీసీ సామాజిక వర్గం మరో కీలకమైనది.

మూడవ పేరు చూస్తే వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి. ఈయన బడా పారిశ్రామికవేత్త. ఈయన నెల్లూరులో వైసీపీ నుంచి టీడీపీ వైపు రావడంతో మొత్తానికి మొత్తం సీట్లు క్లీన్ స్వీప్ చేశారు. దాంతో ఆయన అంగబలాన్ని అర్ధబలాన్ని గుర్తించి ఏ మాత్రం తక్కువ చేయకుండా కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చేలా బాబు పావులు కదుపుతున్నారు. ఆయన ఒకసారి రాజ్యసభ కూడా చేసి ఉన్నందున సహాయ మంత్రి పదవి ఇస్తారా లేక ఇండిపెండెంట్ చార్జితో ఇస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా బలమైన ఒక సామాజిక వర్గాన్ని బాబు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లుగా చెబుతున్నారు

ఇక చివరిగా మరో మంత్రి పదవిని రాయలసీమకు ఇవ్వాలని నిర్ణయించారుట. ఆ పదవిని అనంతపురం నుంచి ఎంపీగా గెలిచిన అంబికా లక్ష్మీ నారాయణకు ఇస్తారని అంటున్నారు. ఆయన బీసీలలో వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వారు. బలహీన వర్గాలలో బలమైన నేతగా ఉన్నారు దాంతో సీమలో పట్టు నిలుపుకోవడానికి బాబు ఆయన పేరుని ప్రతిపాదిస్తున్నారు అని అంటున్నారు.

ఇలా టీడీపీ క్యాబినెట్ మంత్రుల లిస్ట్ ఉందని తెలుస్తోంది. అదె సమయంలో జనసేన నుంచి ఇద్దరు ఎంపీలు గెలిచారు. వీరిలో ఒకరిని కేంద్ర మంత్రి పదవి ఇస్తారు. మచిలీపట్నం నుంచి మూడవసారి ఎంపీ అయిన వల్లభనేని బాలశౌరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని అంటున్నారు. ఆయన కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు. పైగా జనసేన అధినేతకు ఇష్టుడు.

లా ఏపీ నుంచి టీడీపీ జనసేనలలో అయిదురుగు మంత్రులు అవుతారని అంటున్నారు. అలాగే బీజేపీ నుంచి కచ్చితంగా దగ్గుబాటి పురంధేశ్వరికి చాన్స్ ఇస్తారు అంటున్నారు. రెండవ బెర్త్ ఇస్తే కనుక అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కి దక్కవచ్చు అన్నది కూడా వినిపిస్తున్న మాట.