Begin typing your search above and press return to search.

వ్యూహాలన్నీ కలగాపులగం చేస్తూ... లాజిక్ మిస్ అవుతూ....!

అలాగే వ్యూహాలు ఉండాలి అవి ఒకదాని మీద ఒకటి పడి వ్యూహకర్తకే అయమయం కలిగించకూడదు. లక్ష్యాన్ని చేరుకోకుండా ముందే ఆగిపోరాదు.

By:  Tupaki Desk   |   30 Aug 2023 12:47 PM GMT
వ్యూహాలన్నీ కలగాపులగం చేస్తూ... లాజిక్ మిస్ అవుతూ....!
X

మసాలా ఉండాలి. కానీ అది కలగాపులగం కాకూడదు. అలాగే వ్యూహాలు ఉండాలి అవి ఒకదాని మీద ఒకటి పడి వ్యూహకర్తకే అయమయం కలిగించకూడదు. లక్ష్యాన్ని చేరుకోకుండా ముందే ఆగిపోరాదు. తెలుగుదేశం గతంలో అలా ప్రయోగించిన వ్యూహాలు పెర్ఫెక్ట్ గా పనిచేశాయి. కానీ 2019 నుంచి టీడీపీ ఏ వ్యూహం వేసినా బెడిసి కొడుతోంది. దానికి కారణం అతి ఉత్సాహమా లేక ప్రత్యర్ధి విషయంలో లైట్ తీసుకోవడమా లేక. తమ మీద తమకు అతి ధీమావా అన్నదే అర్ధం కావడంలేదు అని అంటున్నారు.

ఏపీలో వైసీపీని గద్దె దించాలన్నది చంద్రబాబు పంతం. ఇంకా గట్టిగా చెప్పలంటే శపధం కూడా. బాబు కనుక తలచుకుంటే ఆ పని చేయగలరేమో. కానీ దానికి కావాల్సిన వ్యూహాలతో పాటు వాటిని ఏ టైం లో ప్రయోగించాలో కూడా చూసుకోవాలి. ఒకేసారి అన్నీ వదిలేస్తే ఏవీ పనిచేయకుండా పోతాయి. ఇపుడు అదే జరుగుతోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఫీల్ గుడ్ అన్న దాంతో గడచింది. రెండవ ఏడాది మొత్తం కరోనా తినేసింది. మూడవ ఏడాది మధ్య నుంచే టీడీపీ అయినా మరో పార్టీ అయినా జనంలోకి వచ్చాయి. ఈలోగా సగం పాలన సాగడంతో వైసీపీ మీద వ్యతిరేకత అయితే ఎంతో కొంత వచ్చింది. దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నంతో టీడీపీ బాదుడే బాదుడు అంటూ తీసుకున్న ప్రోగ్రాం హిట్ అయింది. టీడీపీకి మైలేజ్ ని తీసుకుని వచ్చింది.

అయితే అది జనంలో ఉండగానే కొత్త నినాదాలతో జనంలోకి పంపాలన్న ఆరాటంతో టీడీపీ అసలైన పోరాటం నీరు కారిపోతోంది. సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న స్లోగన్ అయితే టీడీపీ గతంలో ఇచ్చింది. ఇది జనం మెదళ్లలో ఉండగానే హూ కిల్డ్ బాబాయ్ అంటూ మరో స్లోగన్ తెచ్చుకొచ్చింది.

ఇంకో వైపు జగన్ నిన్ను భరించలేము అంటూ మరో నినాదాన్ని బాబు స్వయంగా ఇచ్చారు. పోనీ ఇది క్యాచీగా జనంలోకి పంపుతారు అనుకుంటే జగన్ వల్లనే ఏపీ సర్వనాశనం, విభజన కంటే జగనే పెద్ద ప్రమాదం అని మరో నినాదం ఇచ్చారు బాబు. అంతకు ముందు కరోనా తరువాత కరోనా కంటే జగనే డేంజర్ అంటూ ఒక నినాదం ఇచ్చారు.

ఇలా జగన్ని ఎంత తొందరగా దించాలన్న ఆతృతతో నినాదాలు అన్నీ ఒక దాని వెంట ఒకటి ఇచ్చుకుంటూ పోతున్నారు. అలాగే అవి జనంలోనికి వెళ్ళకముందే మరో స్లోగన్ తో ముందుకు పోతున్నారు. ఇది పూర్తిగా జనాలను అయోమయంలో పెట్టే విధంగానే ఉందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఈ రోజుకీ వైసీపీని దించేందుకు బలమైన నినాదాన్ని ఒక్కటి టీడీపీ రూపొందించలేకపోతోంది.

ఆనాడు వైసీపీ అధినేత జగన్ బై బై బాబు అంటూ ఒక నినాదం ఇచ్చారు. అదే జనంలోకి దూసుకుపోయింది. మరో నినాదం అన్నది వైసీపీకి అవసరం పడలేదు, ఆ దిశగా ఆ పార్టీ ఆలోచన కూడా చేయలేదు. దాంతో భారీ సక్సెస్ ని వైసీపీ కొట్టగలిగింది. టీడీపీకి అలాంటి స్లోగన్ ఇపుడు కావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అలా సింగిల్ స్లోగన్ తో టీడీపీ వస్తే జనాలు ఆలోచించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

మరో వైపు చూస్తే చంద్రబాబు ప్రకటనలు కూడా వైరుధ్యంతో కూడుకుని ఉంటున్నాయి. ఏపీలో తెలుగుదేశం ప్రభజనం వీస్తోందని బాబు ఒక వైపు చెబుతారు. ఎన్నికలు ఇక పెట్టడమే ఆలస్యం, పెడితే కనుక కచ్చితంగా వైసీపీ ఓడి ఇంటికి పోతుందని అంటారు. తిరిగి అదే నోటితో ఏపీలో పొత్తులను కుదుర్చుకుంటామని అంటారు. మరి టీడీపీ బలంగా ఉన్నపుడు పొత్తుల విషయం ఎందుకు అన్న ప్రశ్న అయితే జనాలకు కలుగుతుంది కదా. ఈ చిన్న లాజిక్ ని మిస్ అవుతూ టీడీపీ చేసే ప్రకటనలే వైసీపీ బలాన్ని పెంచుతున్నాయని అంటున్నారు.

ఏది ఏమైనా ఎన్నికలు ఇంకా ఎనిమిది తొమ్మిది నెలలలో ఉన్నాయి. అందువల్ల ఈలోగా టీడీపీ తన వ్యూహాలకు పదును పెట్టాలి. అదే సమయంలో ఒక పద్ధతి ప్రకారం జనంలోకి వస్తే ఆ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరి ఈ రోజుకు అయితే వైసీపీ మీద పూర్తి నెగిటివిటీని జనంలోకి పంపించడంతో టీడీపీ అనుకున్నది అయితే సాధించలేకపోయింది అని అంటున్నారు.