Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ జోరుకు బ్రేకులు ...?

ఇక చూస్తే ప్రతీసారీ గణబాబుకు టికెట్ ఇవ్వడం పట్ల టీడీపీలో కొంత అసంతృప్తి అయితే ఉంది. కానీ దాన్ని సొమ్ము చేసుకునే ఎత్తుగడలు వైసీపీ వద్ద ఉన్నాయా అన్నదే ఇక్కడ చూడాలి.

By:  Tupaki Desk   |   26 Oct 2023 1:30 AM
టీడీపీ ఎమ్మెల్యే హ్యాట్రిక్ జోరుకు బ్రేకులు ...?
X

విశాఖ జిల్లాలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో బలమైన టీడీపీ ఎమ్మెల్యే గణబాబు ఉన్నారు. ఆయన రాజకీయ వారసుడు కూడా. ఆయన తండ్రి మాజీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ఉన్నారు. 1970 నుంచే పెతకంశెట్టి తన రాజకీయాలను కాంగ్రెస్ వేదికగా స్టార్ట్ చేసి 1983లో టీడీపీ రావడంతోనే అందులో చేరి ఫేట్ మార్చుకున్నారు. ఆయన వారసుడిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన గణబాబు 1999లో తొలిసారి పెందుర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2004, 2009లో ఆయన ఓడారు, 2014 నాటికి విశాఖ పశ్చిమకు షిఫ్ట్ అయి గత రెండు ఎన్నికల్లోనూ గెలుస్తూ వస్తున్నారు.

ఆయన మీద సరైన అభ్యర్ధిని ప్రత్యర్ధిగా నిలబెట్టడంలో వైసీపీ తడబడుతూనే ఉంది. లోకల్ కార్డుతో గణబాబు ఉన్నారు. పైగా బలం, బలగం కూడా ఆయనకు బాగానే ఉన్నాయి. అలాంటి చోట 2014లో నాన్ లోకల్ క్యాండిడేట్ గా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ ని నిలబెట్టి చాన్స్ గణబాబుకు ఇచ్చేసింది. ఇక 2019 నాటికి అదే సీటులో 2009లో కాంగ్రెస్ తరఫున గెలిచిన మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ కి అవకాశం ఇచ్చినా ఆయన ఓటమి పాలు అయ్యారంటే గణబాబు పట్టు ఎంతలా బిగుసుకుందో అర్ధం అవుతుంది.

ఇక ఇపుడు చూస్తే 2024 ఎన్నికలకు వైసీపీ మరో ప్రయోగం చేస్తోంది. విశాఖ రూరల్ జిల్లాకు చెందిన విశాఖ డైరీ చైర్మన్ అయిన ఆడారి ఆనందకుమార్ కి తెచ్చి విశాఖ పశ్చిమ నుంచి పోటీకి పెడుతోంది. ఆయన నాన్ లోకల్ అని అపుడే వైసీపీలో అసంతృప్తి ఉంది. అయినా సరే అంగబలం అర్ధ బలం ఉన్నాయని ఆయనకు టికెట్ ఇస్తోంది. ఆయనే 2024 నాటికి విశాఖ పశ్చిమ వైసీపీ క్యాండిడేట్ అని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించేశారు.

ఈసారి టీడీపీని పశ్చిమలో ఓడించాలని కూడా ఆయన పిలుపు ఇచ్చారు. అయితే అది ఆచరణలో అంత సాధ్యమా అన్నది మాత్రం తెలియడంలేదు. రాజకీయంగా వ్యూహాలలో దిట్ట అయిన గణబాబు మరోసారి గెలిచేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన సైలెంట్ గా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేల మాదిరిగా నాయకుల మాదిరిగా ఆయన మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడంలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.

ఇక చూస్తే ప్రతీసారీ గణబాబుకు టికెట్ ఇవ్వడం పట్ల టీడీపీలో కొంత అసంతృప్తి అయితే ఉంది. కానీ దాన్ని సొమ్ము చేసుకునే ఎత్తుగడలు వైసీపీ వద్ద ఉన్నాయా అన్నదే ఇక్కడ చూడాలి. నాన్ లోకల్ గా ఉన్న ఆడారి ఇలా వచ్చి అలా వెళ్తూ రాజకీయం చేస్తే గణబాబుకు హ్యాట్రిక్ ఎమ్మెల్యే చాన్స్ ఇచ్చినట్లేనని అంటున్నారు.

ఆయన విశాఖ పశ్చిమ వాసిగా ఉంటూ ఇప్పటి నుంచే తన రాజకీయం మొదలెట్టకపోతే మాత్రం ముచ్చటగా మూడవసారి కూడా పశ్చిమంలో వైసీపీకి షాక్ తగలకతప్పదని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ టీడీపీలో బలమైన నేతలు ఉన్న చోట సరైన కసరత్తు చేయడంలేదు అని అంటున్నారు. అది విశాఖ తూర్పు అయినా పశ్చిమ అయినా లేక మరో సీటు అయినా కూడా వైసీపీ ఎన్నికల ముందు హడావుడిగా క్యాండిడేట్స్ ని ప్రకటించడం కాదని అయిదేళ్ళూ నిలిచి ఉండే వారిని ముందు పెట్టలేకపోతోంది అన్నది పెద్ద ఫిర్యాదు. మరి పశ్చిమ ఆశలు వైసీపీకి తీరుతాయా లేదా అంటే వెయిట్ అండ్ సీ.