పవన్ కి మద్దతుగా గంటా బిగ్ సౌండ్...పొత్తు కుదిరినట్లే....?
గంటా జనసేనకు పవన్ కి మద్దతుగా తాజాగా బిగ్ సౌండ్ చేయడం చర్చనీయాంశం అయింది. పవన్ మీద ఏపీ ప్రభుత్వం పరువు నష్టం కేసుని పెట్టింది
By: Tupaki Desk | 23 July 2023 1:53 AM GMTవిశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరవుకు మెగా కుటుంబంతో మంచి రిలేషన్స్ ఉన్న సంగతి విధితమే. మెగాస్టార్ చిరంజీవితో ఆయనకు ఎంతో సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు ప్రోత్సాహంతో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన గంటా శ్రీనివాసరావు 2008లో చిరంజీవి ప్రజారాజ్యం స్థాపిస్తే అందులోకి వెళ్లారు. అలా విశాఖ జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు.
ప్రజారాజ్యం పార్టీకి నాలుగు అసెంబ్లీ సీట్లను గెలిపించడంతో ఆయన కీలకమైన పాత్ర పోషించారు. 2014 నాటికి తెలుగుదేశంలో చేరిన గంటా 2019లో ఓటమి పాలు కాగానే ముందు వైసీపీ ఆ తరువాత జనసేనలలో చేరేందుకు ప్రయత్నం చేశారు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతానికి టీడీపీ బెటర్ అని భావించి అందులోనే తన రాజకీయాన్ని దూకుడుని పెంచిన గంటా జనసేనకు పవన్ కి మద్దతుగా తాజాగా బిగ్ సౌండ్ చేయడం చర్చనీయాంశం అయింది. పవన్ మీద ఏపీ ప్రభుత్వం పరువు నష్టం కేసుని పెట్టింది. దీని మీద చంద్రబాబు మొదట రియాక్ట్ అయ్యారు. ఆయన ట్విట్టర్ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే గంటా కూడా ట్విట్టర్ ద్వారానే పవన్ కి మద్దతుగా ముందుకు వచ్చారు.
ఏపీ పరువు తీసింది జగన్ అని ఘాటుగానే గంటా విమర్శలు అందులో చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా తేలేదని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయితే అడ్డుకోలేకపోయారని, ఏపీ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదని, అవ్వా తాతలకు నెలకు మూడు వేల పించన్ ఎక్కడ ఇచ్చారు అని సంపూర్ణ మద్య పాన నిషేధం ఏమైందని నిలదీశారు.
యువతకు జాబ్ క్యాలండర్ సంగతి ఏమిటి అని కూడా ప్రశ్నించారు. ఇలా గంటా చాలా విషయాలతో వైసీపీని గట్టిగా టార్గెట్ చేశారు. పవన్ ఏమన్నారని ఆయన మీద పరువు నష్టం కేసు పెడతారు అని గంటా సౌండ్ చేస్తూ జనసేనానికి తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ విధంగా ఆయన చేయడం రాజకీయ వ్యూహంతో కూడుకున్నదే అని అంటున్నారు.
గంటా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నపుడు పవన్ యువరాజ్యం అధినేతగా ఉన్నారు. ఎపుడైతే కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారో నాటి నుంచి పవన్ సైలెంట్ అయ్యారు. అలా చేయడానికి కారణం అయిన వారిలో గంటా కూడా ఉన్నారని పవన్ భావించారు. అందుకే గంటా పట్ల ఆయన దూరం అంటూనే వస్తున్నారు.
అయితే ఇటీవల కాలంలో జరిగిన ఒక కీలక పరిణామం తరువాత గంటా జనసేనల మధ్య గ్యాప్ తగ్గింది అని అంటున్నారు. గంటాకు అత్యంత సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జనసేనలోకి వెళ్లారు. అదంతా గంటా సూచనల మేరకే అని అంటున్నారు. దీన్ని పంచకర్ల ఖండించినా గంటా వల్లనే పంచకర్ల రాజకీయ జీవితం స్టార్ట్ అయిందని అందరూ అంటారు దాంతో పంచకర్ల జనసేనలోకి వెళ్లారని చెబుతున్నారు
మరో వైపు ఏంటి అంటే పవన్ సైతం మీకున్న బలమైన స్నేహితులతో విశాఖ సహా ఉత్తరాంధ్రాలో జనసేనను విస్తరించండి అని కోరారు. ఆ బలమైన స్నేహితుడు గంటాయేనా అన్న భావన కూడా కలుగుతోంది. ఇక గంటా టీడీపీలో ఉన్నా జనసేనతో ఎటూ పొత్తులు ఉంటాయి కాబట్టి ఏమీ సమస్య రాదనే అంటున్నారు.
మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల్లో జనసేనకు కూడా చాలా మంది అండ దండలు కావాలని ఆ విధంగా గంటా మళ్ళీ తన మద్దతుని ఆ పార్టీని ఇండైరెక్ట్ గా తెలియచేసారా అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ సర్కార్ మీద ప్రశ్నలు సంధిస్తూ గంటా ట్విట్టర్ లో ఒక రేంజిలో తన పవర్ చూపించారనే అంటున్నారు. మరి పొత్తులు కనుక జనసేన టీడీపీ మధ్య కుదిరితే మాత్రం గంటా పాత్ర విశాఖ జిల్లా రాజకీయాల్లో విశేషంగా ఉంటుంది అని అంటున్నారు.