రాజమండ్రి రూరల్ నాకే అంటున్న గోరంట్ల...!
By: Tupaki Desk | 24 Feb 2024 3:04 PM GMTతెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా ఏకంగా 94 మంది అభ్యర్ధులను ఒకేసారి ప్రకటించింది. అంతే కాదు, మిత్రపక్షం అయిన జనసేనకు 24 సీట్లు కేటాయించింది. అయితే టీడీపీ ప్రకటించిన సీట్లలో సీనియర్లు చాలా మంది కనిపించలేదు. రాజమండ్రి సిటీ టికెట్ ని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త వాసుకి ప్రకటించిన టీడీపీ రూరల్ సీటుని మాత్రం పెండింగులో పెట్టేసింది.
ఇక రూరల్ టికెట్ విషయంలో ఇప్పటికే బెట్టింగుల మీద బెట్టింగులు జరుగుతున్న విషయం తెలిసిందే. గెలుపు కోసం ఈ బెట్టింగులు కాదు రూరల్ టికెట్ ఎవరికి ఇస్తారు అన్న దాని మీద ఆ సీటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరికా లేక జనసేన నేత కందుల దుర్గేష్ కా అన్న చర్చ నడుస్తోంది. ఈ నేపధ్యంలో ఇటీవల రాజమండ్రి వచ్చిన పవన్ కళ్యాణ్ దుర్గేష్ కే ఆ టికెట్ అని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు రిలీజ్ చేసిన 94 మంది అభ్యర్ధుల లిస్ట్ లో రాజమండ్రి రూరల్ లేకపోవడం విశేషం. ఈ సీటు విషయంలో అటు కందుల ఇటు గోరంట్లల మధ్య హోరా హోరీ పోరు సాగుతూండడంతో పెండింగులో పెట్టారు అని అంటున్నారు. దాంతోనే ఆ సీటుని ప్రకటించలేదు అని అంటున్నారు.
దీని మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ టికెట్ తనకే అని ధీమాగా చెప్పారు. ఈ విషయంలో తనకే సీటు ఇస్తామని చంద్రబాబు చెప్పారని కూడా ఆయన అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ రాజమండ్రి రూరల్ టికెట్ ని ప్రకటించలేదు అని గుర్తు చేశారు.
ఇక టీడీపీ జాబితాలో తన పేరు కూడా ఉందని, కానీ జనసేన నేతలను ఒప్పించాలని ఆపారని బుచ్చయ్య చౌదరి అంటున్నారు. మరో వైపు చూస్తే టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని కూడా బుచ్చయ్య మరో మాట కూడా చెప్పారు. అంటే టికెట్ తనదే అని చెబుతూనే ఈ మాట కూడా ఆయన అనడంతో ఈ సీటు కచ్చితంగా గోరంట్లకు ఇస్తారా లేక దుర్గేష్ కి ఇస్తారా అన్నది చర్చనీయాంశం అవుతోంది.
ఎవరికి సీటు ఇచ్చినా కూడా రెండవ వారిని ఒప్పించి మాత్రమే ఇస్తారు అని అంటున్నారు. ఎందుచేతంటే ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయని కూడా రెండు పార్టీల అధినాయకత్వాలకు తెలుసు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే బుచ్చయ్య సీనియర్ మోస్ట్ లీడర్. దాంతో ఆయన విషయంలో ఆచీ తూచీ నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.