Begin typing your search above and press return to search.

కేశినేని నాని రూటే సెపరేట్...లోకేష్ ఎదుటే సీన్

నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తూంటే విజయవాడ ఎంపీ సొంత పార్టీకి చెందిన కేశినేని నాని డుమ్మా కొట్టడం టీడీపీలో తీవ్ర కలకలం రేపుతోంది.

By:  Tupaki Desk   |   20 Aug 2023 12:35 PM GMT
కేశినేని నాని రూటే సెపరేట్...లోకేష్ ఎదుటే సీన్
X

టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి నాయకుడు, ఫ్యూచర్ లీడర్ అయిన నారా లోకేష్ విజయవాడలో పాదయాత్ర చేస్తూంటే విజయవాడ ఎంపీ సొంత పార్టీకి చెందిన కేశినేని నాని డుమ్మా కొట్టడం టీడీపీలో తీవ్ర కలకలం రేపుతోంది. నాని బదులు అన్నట్లుగా ఆయన సోదరుడు కేశినేని చిన్ని మొత్తం నారా లోకేష్ టూర్ లో అన్నీ తానే అయి చూసుకుంటున్నారు.

ఇక కేశినేని నాని వ్యతిరేకించే బుద్ధా వెంకన్న, బోండా ఉమా వంటి వారు అంతా లోకేష్ పాదయాత్ర టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నారు. రెండు రోజులుగా ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగుతోంది. టీడీపీకి జీవనాడి లాంటి జిల్లాలో జరుగుతున్న పాదయాత్ర. 2024 ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై అన్నట్లుగా ఉన్న వేళ లోకేష్ కాళ్ళీడ్చుకుంటూ వేలాది కిలోమీటర్లు నడచి వచ్చి క్రిష్ణా జిల్లాలో పాదం మోపితే ఏకంగా సొంత పార్టీకి చెందిన ఎంపీ గైర్ హాజరు కావడం ఏ రకమైన రాజకీయ సంకేతాలను పంపిస్తుంది అన్నది కూడా తమ్ముళ్లకు పాలుపోవడంలేదు.

అయితే కేశినేని నాని రూటే సెపరేట్ అని పసుపు శిబిరంలో అంటున్నారు. ముక్కుసూటిగా రాజకీయాలు చేసే కేశినేని నాని తన కుటుంబాన్ని బయటకు లాగవద్దని చాలా కాలం క్రితమే పార్టీకి సున్నితంగా హెచ్చరించారు. అన్నదమ్ములను విడదీసే రాజకీయం మానుకోవాలని కోరారు. అయితే ఇపుడు అదే జరుగుతోంది. కేశినేనికి వెన్నుదన్నుగా నిన్నటిదాకా ఉండే చిన్ని ఇపుడు నాని వ్యతిరేకులతో చేతులు కలిపారు అని ఆయన వర్గం అంటోంది.

దాంతోనే తీవ్ర మనస్తాపంతో నాని ఉన్నారని, పార్టీ సైతం పొమ్మనకుండా పొగ పెట్టే తీరున వ్యవహరిస్తోంది అని అనుమానిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికే అన్నది కూడా పార్టీలో లోపాయికారిగా వినిపిస్తున్న మాట అంటున్నారు. ఇలా వాస్తవాలు అన్నీ కళ్లెదుట ఉండగా నాని ఎందుకు లోకేష్ పాదయాత్రలో పాల్గొంటారు అన్నది ఆయన వైపు వారి వాదన.

దీనికంటే ముందు కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేతను విజయ్వాడ మేయర్ గా నిలబెడితే వైసీపీ కంటే కూడా సొంత పార్టీలోని వారే ఓడించారు అన్నది మరో బాధ. దీని మీద ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని కూడా ఆవేదన ఉందిట. ఇవన్నీ పక్కన పెడితే గైర్ హాజర్ ద్వారా కేశినేని నాని ఏ రకమైన సంకేతం ఇస్తున్నారు అన్నదే పార్టీ బయటా లోపలా చర్చగా ఉంది.

కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అన్నది మరో ప్రశ్న. తన తమ్ముడిని పోటీగా పెడితే తాను కచ్చితంగా పోటీ చేస్తాను అని ఆ మధ్య నాని హెచ్చరించారు. అతనికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా పనిచేస్తాను అని కూడా చెప్పారని అంటారు. ఇపుడు కేశినేని చిన్ని దాదాపుగా క్యాండిడేట్ అని అంటున్నారు. మరి నాని ఏమి చేయబోతున్నారు అన్నదే ఆలోచించాల్సిన విషయం.

నాని ముందు ఉన్న ఆప్షన్లు ఏంటి అంటే అర్జంటుగా పార్టీ మారడం. ఆయన వస్తే వైసీపీలో తీసుకుంటామని ఆ పార్టీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి చాలా కాలం క్రితమే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు విజయవాడలో వైసీపీకి సరైన క్యాండిడేట్ కోసం అన్వేషణ సాగుతోంది. దాంతో సిట్టింగ్ ఎంపీ, బలమైన నేత తమ వైపునకు వస్తే ఫ్యాన్ పార్టీ రెడీ అని తీసుకుంటుంది అని అంటున్నారు.

అయితే నాని వైసీపీలో చేరే అవకాశాలు ఎంతవరకూ ఉన్నాయన్నదే చర్చగా ఉంది. ఒకవేళ అలా కాకపోతే బీజేపీ జనసేన ఒంటరిగా పోటీ చేసిన పక్షంలో కేంద్ర మంత్రి గడ్కరీతో ఉన్న పరిచయాల దృష్ట్యా నాని బీజేపీలో చేరి పోటీ చేయవచ్చు అన్నది మరో చర్చగా ఉంది. ఏది ఏమైనా టీడీపీ సిట్టింగ్ ఎంపీ టీడీపీకి హార్డ్ కోర్ డిస్ట్రిక్ట్ గా ఉన్న విజయవాడలో లోకేష్ పాదయాత్రకు వస్తే కనిపించకపోవడం మాత్రం రాజకీయంగా కాకను రేపుతోంది. చూడాలి మరి దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతాయో మరి.