Begin typing your search above and press return to search.

టీడీపీ ఎంపీని ఓడించడానికి వైసీపీ మదిలో ఇద్దరు డాక్టర్లు!

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న 25 లోక్‌ సభా స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి మూడు స్థానాలు మాత్రమే దక్కాయి.

By:  Tupaki Desk   |   1 Sep 2023 2:45 AM GMT
టీడీపీ ఎంపీని ఓడించడానికి వైసీపీ మదిలో ఇద్దరు డాక్టర్లు!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్న 25 లోక్‌ సభా స్థానాల్లో గత ఎన్నికల్లో టీడీపీకి మూడు స్థానాలు మాత్రమే దక్కాయి. వీటిలో ఒకటి శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం. ఇది టీడీపీ కంచుకోటల్లో ఒకటి. 1983లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఏకంగా ఏడుసార్లు శ్రీకాకుళం లోక్‌ సభా స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్‌ పార్టీ గాలి బలంగా వీచిన 2004లోనూ, వైసీపీ ప్రభంజనం 2019లోనూ ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుపొందడమే ఇందుకు నిదర్శనం.

కాగా 2014, 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి దివంగత కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు తనయుడు కింజరపు రామ్మోహన్‌ నాయుడు వరుసగా రెండుసార్లు టీడీపీ తరఫున ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టీడీపీ సిట్టింగు సీట్లలోనూ గెలుపొందాలని భావిస్తున్నారు.. వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. అందులోనూ టీడీపీ కంచుకోటగా ఉన్న శ్రీకాకుళంలో విజయ ఢంకా మోగించాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గట్టి అభ్యర్థి కోసం వేట సాగిస్తున్నారు.

ఈ క్రమంలో వైసీపీ దృష్టిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు. వీరిద్దరూ వైద్యులే కావడం మరో విశేషం. గతంలో 2009లో శ్రీకాకుళం ఎంపీగా కిల్లి కృపారాణి విజయం సాధించారు. కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన ఆమె కేంద్ర సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 2004లో టీడీపీ అభ్యర్థి ఎర్రం నాయుడుపై ఓడిపోయిన కృపారాణి 2009 ఎన్నికల్లో ఆయనపైనే గెలుపొందారు. 2014లో కిల్లి కృపారాణి కాంగ్రెస్‌ తరఫునే పోటీ చేసి ఏకంగా మూడో స్థానానికి పడిపోయారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ముందు ఆమె వైసీపీలో చేరారు. అయినప్పటికీ ఆమెకు సీటు రాలేదు.

2014లో వైసీపీ తరఫున శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెడ్డి శాంతి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రెడ్డి శాంతి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు. దీంతో 2019లో పార్లమెంటుకు దువ్వాడ శ్రీనివాస్‌ వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి రామ్మోహన్‌ నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు.

ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈసారి ఆయన భార్య వాణి టెక్కలి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ మళ్లీ కొత్త అభ్యర్థిని పార్లమెంటు బరిలో దింపాల్సి వస్తోంది. ఈ క్రమంలో మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిని బరిలో దించొచ్చని టాక్‌ నడుస్తోంది. అలాగే జిల్లాలో మంచి వైద్యుడిగా పేరు తెచ్చుకున్న దానేటి శ్రీధర్‌ పేరు కూడా వినిపిస్తోంది. వీరిద్దరిలో ఒకరికి వైసీపీ శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిత్వం దక్కే వీలుందని అంటున్నారు.