టీడీపీ ఎంపీ సీటు.. ఎవరీ మహేశ్?
ఇందులో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ తమ సామాజికవర్గానికి కేటాయించే ఏలూరు ఎంపీ సీటును ఈసారి బీసీ అభ్యర్థికి చంద్రబాబు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది.
By: Tupaki Desk | 22 March 2024 3:21 PM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారు. మిత్రపక్షాలకు 8 పార్లమెంటు, 31 అసెంబ్లీ సీట్లను కేటాయించారు. ఇక టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తోంది.
ఇందులో భాగంగా ప్రతి ఎన్నికల్లోనూ తమ సామాజికవర్గానికి కేటాయించే ఏలూరు ఎంపీ సీటును ఈసారి బీసీ అభ్యర్థికి చంద్రబాబు కేటాయించడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో టీడీపీ తరఫున ఏలూరు ఎంపీ స్థానంలో బోళ్ల బుల్లిరామయ్య, మాగంటి బాబు వంటి కమ్మ నేతలు విజయం సాధించారు. అయితే ఈసారి సామాజిక సమీకరణాల్లో భాగంగా యాదవ సామాజికవర్గానికి చెందిన పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు సీటిచ్చారు.
ఏలూరు ఎంపీ స్థానంలో కాపులు, కమ్మల జనాభా ఎక్కువ. బీసీలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. టీడీపీ, జనసేన పొత్తు ఉండటంతో టీడీపీకి బలంగా ఉండే కమ్మలు, జనసేనకు కాపు కాసే కాపులు టీడీపీ అభ్యర్థికి పుట్టా మహేశ్ కు ఓట్లేస్తే ఆయన ఘనవిజయం ఖాయమని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యాదవ సామాజికవర్గానికి చెందిన పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ కు సీటు ఇచ్చారు.
కాగా పుట్టా మహేశ్ కుమార్ తండ్రి సుధాకర్ యాదవ్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ గా పనిచేశారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లా మైదుకూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ మైదుకూరు నుంచి సుధాకర్ యాదవ్ కు సీటు దక్కింది.
మరోవైపు పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ టీడీపీ ముఖ్య నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు స్వయానా అల్లుడు కావడం విశేషం. వాస్తవానికి మహేశ్ పేరు నరసరావుపేట లోక్ సభ స్థానానికి గతంలోనే వినిపించింది.
అయితే ఏలూరు ఎంపీ సీటును వైసీపీ అధినేత వైఎస్ జగన్ యాదవ సామాజికవర్గానికి చెందిన కారుమూరి సునీల్ కుమార్ కు కేటాయించారు. ఈయన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు కావడం విశేషం.
ప్రస్తుతం ఏలూరు ఎంపీగా ఉన్న కోటగిరి శ్రీధర్ తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా ఏలూరు ఎంపీ సీటును యాదవ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థికి కేటాయించారు.