ఎన్డీయే ఇండియా కూటములకు సమదూరం...టీడీపీ న్యూ స్ట్రాటజీ !
ఏది ఏమైనా జైలులో చాలా కాలం పాటు ఉన్న ఆగ్రహం అయితే చంద్రబాబు చేత సరికొత్త అడుగులే వేయిస్తుంది అని అంటున్నారు.
By: Tupaki Desk | 12 Oct 2023 4:30 PM GMTఏపీ రాజకీయాల్లోనూ జాతీయ రాజకీయాల్లోనూ టీడీపీ కొత్త స్టాండ్ తీసుకుంటోందా. చంద్రబాబు అరెస్ట్ తరువాత టీడీపీ ఆలోచనలు మారుతున్నాయా. ఇప్పటిదాకా బీజేపీ పట్ల మొగ్గు చూపుతూ నరేంద్ర మోడీ విజనరీ అంటూ పొగిడిన టీడీపీ అధినాయకత్వం ఇపుడు కొత్త పొలిటికల్ టర్న్ తీసుకుంటోందా అంటే జవాబు మాత్రం అలాగే వస్తోంది.
దీని వెనక చంద్రబాబు దూరాలోచనలు ఉన్నాయని అంటున్నారు. జైలులో ఉన్నా చంద్రబాబు రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తూ అటు పార్టీకి ఇటు కుమారుడు లోకేష్ కి సరైనా తీరులో దిశానిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే రీసెంట్ గా నారా లోకేష్ తండ్రి చంద్రబాబుతో ములాఖత్ అయిన తరువాత బయటకు వచ్చి తాను బీజేపీ తన తండ్రి అరెస్ట్ వెనక ఉందని అనుకోవడం లేదు అన్నారు. ఆధారాలు లేకుండా తాను ఎలాంటి కామెంట్స్ చేయబోవడం లేదని అన్నారు.
ఇక ఏపీలో రాజకీయాలు కూడా మారుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వెనక బీజేపీ లేదు అని బయటకు టీడీపీ అగ్రనాయకత్వం అంటున్నా ఆ పార్టీలో అత్యధికులు మాత్రం ఇది కేంద్ర ప్రభుత్వం అండ లేకపోతే జరిగే పని కాదనే భావిస్తున్నారు. మరో వైపు చూస్తే బీజేపీని ఏపీలో టీడీపీ మోయవద్దు, పొత్తుల పేరుతో దగ్గరకు చేర్చుకోవడం ద్వారా రాజకీయ నష్టం తప్ప వేరేదీ ఉండదని కూడా సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక జాతీయ స్థాయిలో చూసుకుంటే ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో ఇంకా తెలియడంలేదు. ఒక అసందిగ్ద పరిస్థితి అక్కడ ఉంది. అనూహ్యంగా విపక్ష ఇండియా కూటమి పుంజుకుని ఐక్యతను ప్రదర్శిస్తోంది. దాంతో పాటు పదేళ్ళుగా వరసగా అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి మీద యాంటీ ఇంకెంబెన్సీ ఒక లెవెల్ లో ఉందని అంటున్నారు. ఈసారి బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ వస్తుందా అన్న డౌట్లు ఉన్నాయని అంటున్నారు.
ఇక ఏపీలో చూస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి ఆ పార్టీ ఏమీ చేయలేదన్న కోపంతో పాటు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా పొత్తు పార్టీల మీద పడుతుందని భావిస్తున్నారుట. అందుకే ఆప్షన్ లు అన్నీ తమ దగ్గర ఉంచుకునేలా తాము ఎన్డీయే, ఇండియా కూటములకు సమదూరంలో ఉంటామని చెబుతున్నారు. ఈ మాట అన్నది కూడా ఎవరో కాదు చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఆయన మాటలను బట్టి చూస్తే చంద్రబాబు ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇదే అయి ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏపీలో జనసేన టీడీపీ మాత్రమే పొత్తు పెట్టుకుని రేపటి ఎన్నికల్లో పోటీ చేయవచ్చు అని అంటున్నారు. ఈ కూటమిలోకి వామపక్షాలను కూడా తీసుకునే అవకాశం ఎంతవరకూ ఉందో కూడా చెప్పలేరని అంటున్నారు. వామపక్షాలను తీసుకుంటే కనుక అది ఇండియా కూటమి వైపుగా వెళ్ళినట్లు అవుతుంది అలా సంకేతాలు వస్తే రేపటి రోజున బీజేపీ ఎన్డీయే కూటమి లో ఆప్షన్లు తామే మూసుకున్నట్లుగా అవుతుంది కాబట్టి అలా ఆలోచించరని అంటున్నారు.
అంటే ఏపీలో టీడీపీ జనసేన కలసి పోటీకి దిగి తమ రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయని అంటున్నారు. ఎన్నికల తరువాత దేశంలో అప్పటికి ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి జాతీయ స్థాయిలో ఏ కూటమికి మద్దతు ఇవ్వాలన్నది ఆధారపడి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి బీజేపీతో పొత్తుల మీద టీడీపీ నుంచి క్లారిటీ వచ్చినట్లే అనుకోవాలి.
ఆ విషయాన్నే లోకేష్ కూడా చూచాయగా ఢిల్లీ మీడియాకు చెప్పారని అంటున్నారు. తాము ఏ కూటమిలోనూ లేము సమదూరం అని లోకేష్ చెప్పిన మాటల వెనక చాలా అర్ధాలు ఉన్నాయని చంద్రబాబు రాజకీయ వ్హూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు.
సో ఏపీలో బీజేపీ ఒంటరి పోరుకే ప్రిపేర్ కావాల్సి ఉంటుందేమో అని అంటున్నారు. మరి చూడాలి చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చాక ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో. ఏది ఏమైనా జైలులో చాలా కాలం పాటు ఉన్న ఆగ్రహం అయితే చంద్రబాబు చేత సరికొత్త అడుగులే వేయిస్తుంది అని అంటున్నారు.