టీడీపీ ఆఫీసుకు నిప్పు... 144 సెక్షన్ విధింపు!
అవును... పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఉన్న టీడీపీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.
By: Tupaki Desk | 8 April 2024 8:09 AM GMTఎన్నికల సమయంలో కొన్ని కీలక ప్రాంతాల్లో పలు అవాంఛనీయ సంఘటనలు జరుగుతుండటం తెలిసిందే! ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా.. ఇవి ఆగడం లేదనే మాట్లు వినిపిస్తున్నాయి. ఈసారి వీలైనంత ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని మరోపక్క ఎన్నికల కమిషన్ కోరుతోంది! ఈ సమయంలో పల్నాడు జిల్లాలో టీడీపీ ఆఫీసుకు నిప్పు పెట్టారు దుండగులు!
అవును... పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో ఉన్న టీడీపీ ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. వైసీపీ నేతలే తమ కార్యాలయానికి నిప్పు పెట్టారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి వాటికి బయపడేది లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... క్రోసూరులో ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు.. 144 సెక్షన్ విధించారు.
వాస్తవానికి పదిరోజుల కిందట పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్.. మన్నెం భూషయ్య కాంప్లెక్స్ లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ కార్యాలయం ముందర.. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ పందిరికి నిప్పంటించడంతో క్షణాల్లో దగ్ధమైందని తెలుస్తుంది!
ఆ సమయంలో పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు ఆందోళనకు గురయ్యారని తెలుస్తుంది. దీంతో... విషయం తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా... పెదకూరపాడు నియోజకవర్గంలో 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసి వరుసగా గెలిచిన కొమ్మలపాటి శ్రీధర్.. 2019లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఆ టిక్కెట్ ను భాష్యం ప్రవీణ్ కు కేటాయించింది టీడీపీ. దీంతో... కూటమి తరుపున కూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ పోటీ చేస్తున్నారు!