వాలంటీర్ల మీద టీడీపీ ప్లాన్ ఇదే !?
వాలంటీర్ల వ్యవస్థ ఏపీలో గత అయిదేళ్ళుగా సాగింది. దాని వల్ల లబ్దిదారులకు మేలు జరిగింది
By: Tupaki Desk | 26 Jun 2024 1:30 AM GMTవాలంటీర్ల వ్యవస్థ ఏపీలో గత అయిదేళ్ళుగా సాగింది. దాని వల్ల లబ్దిదారులకు మేలు జరిగింది. దానిని కేవలం పౌర సేవలకు మాత్రమే వాడుకుంటే బాగుండేది. అలా కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లో వాలంటీర్లను వాడుకోవడంతో అది వివాదాస్పదం అయింది. మొత్తానికి ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్న ఒక వ్యవస్థ మొగ్గలోనే ఇబ్బందుల పాలు అయింది.
వాలంటీర్ల వ్యవస్థ మంచిదే అనే వారే ఎక్కువ మంది ఉన్నారు. అయితే దానిని రాజకీయాలకు కానీ ఇతర అవసరాలకు కానీ వినియోగించకుండా దూరం పెట్టాల్సి ఉంది. ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. గౌరవ వేతనంగా అయిదు వేల రూపాయలు కాస్తా పదివేల రూపాయలకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు.
అయితే వాలంటీర్ల వ్యవస్థ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రావడంలేదు. జూలై నెల పెన్షన్ కూడా సచివాలయ సిబ్బంది చేత ఇప్పించాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తునాయి. దాంతో వైసీపీ హయాంలో రెండున్నర లక్షలకు పైగా నియమితులైన వాలంటీర్లలో లక్ష మంది రాజీనామా చేయగా వారితో పాటు మిగిలిన వారు అంతా ఆందోళన చెందుతున్నారు.
తమను విధులలో తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈసీ కేవలం ఎన్నికల నిబంధలన మేరకే తప్పించిందని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాలంటీర్ల వ్యవస్థ మీద లోతుగానే అధ్యయనం చేస్తోంది అని అంటున్నారు. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించడానికి సుముఖంగానే ఉన్నప్పటికీ ఇదే విధానంలో మాత్రం కొనసాగించడానికి సిద్ధంగా లేదు అని అంటున్నారు.
ఇక ఇపుడు ఉన్న వాలంటీర్లతో మళ్లీ వ్యవస్థ నడిపించడం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీరంతా ఒక మైండ్ సెట్ కి ట్యూన్ అయి ఉంటారు అన్న భావన ఒకటైతే టాలెంట్ తో పాటు కొన్ని అదనపు అర్హతలు పెట్టి కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేపట్టాలని చూస్తున్నారు అని అంటున్నారు
వాలంటీర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం చెల్లించాలని అనుకుంటున్నారు. దానికి తగినట్లుగా విధులు వారి బాధ్యతలను డిజైన్ చేస్తారు అని అంటున్నారు. అలాగే వారు ఎవరికి జవాబుదారిగా ఉంటారో కూడా ఒక విధాన రూపకల్పన చేయాలని అనుకుంటున్నారు.
ఇక వైసీపీ ప్రభుత్వం ప్రతీ యాభై గడపలకు ఒక వాలంటీర్ ని నియమించింది. ఇపుడు కూటమి ప్రభుత్వం కనుక వాలంటీర్లను నియమిస్తే ప్రతీ వంద గడపలకు ఒకరిని ఏర్పాటు చేయాలని అనుకుంటోందిట. అలాగే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టడం ద్వారా వారి సేవలను మరింతగా వినియోగించుకోవాలని చూస్తున్నారు.
అయితే వాలంటీర్లుగా టీడీపీ సానుభూతిపరులకు అవకాశం ఇవ్వడానికే ఇదంతా చేస్తున్నారు అని వైసీపీ నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పార్టీ పరంగా లబ్ది పొందితే తప్పు లేదు అన్న కోణంలోనూ టీడీపీలో చర్చ సాగుతోందిట. మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ మీద తొందరలోనే టీడీపీ కూటమి తన విధానం ఏమిటో బయటపెడుతుందని అంటున్నారు.