Begin typing your search above and press return to search.

చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పదవికి మోకాలడ్డుతున్న టీడీపీ

పదవా పదవా అంటే ఒకటి కాదు మూడు పదవులు ఆ యువకుడి చేతిలో ఉన్నాయి. ఆయన తండ్రి రాజకీయంగా రాటు తేలిన నాయకుడు.

By:  Tupaki Desk   |   1 Sep 2023 5:23 PM GMT
చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పదవికి మోకాలడ్డుతున్న టీడీపీ
X

పదవా పదవా అంటే ఒకటి కాదు మూడు పదవులు ఆ యువకుడి చేతిలో ఉన్నాయి. ఆయన తండ్రి రాజకీయంగా రాటు తేలిన నాయకుడు. దాంతో తండ్రి నుంచి వారసత్వంగా పదవులు అలా వచ్చిపడ్డాయి. ఇంకా రావాల్సింది మిగిలి ఉంది ఎమ్మెల్యే పోస్ట్ మాత్రమే. దానికి టికెట్ కూడా వచ్చే ఎన్నికల్లో కన్ ఫర్మ్ అయింది. ఆయనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తండ్రి చిత్తూరు జిల్లా రాజకీయాలలో ఘనత వహించిన ఆయన తండ్రి వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

ఆయన రాజకీయాల నుంచి విరామం ప్రకటిస్తూ తన కుమారుడికి చంద్రగిరి ఎమ్మెల్యే సీటుని కన్ ఫర్మ్ చేసుకున్నారని భోగట్టా. ఇక మోహిత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఇప్పటికే తిరుపతి రూరల్ మండల పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. ఇక ఆయన తాజాగా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ తుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.

తుడా చైర్మన్ అంటే టీటీడీ పాలక మండలిలో ఎక్స్ అఫీషియో హోదాలో మెంబర్ గా ఉంటారు. ఆ మేరకు ప్రభుత్వం ఆయనను తాజా పాలక మండలిలో నియమించింది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వం ప్రకటించిన పాలక మండలి సభ్యుల మీద విపక్షాలు గుర్రు మీద ఉన్నాయి. వారిలో కొందరు వివిధ కేసులలో ఉన్నారని, అలాంటి వారిని ఎలా నియమిస్తారు అంటూ కోర్టుకు కూడా వెళ్లారు.

అలా ముగ్గురు సభ్యుల నియామకాల మీద విపక్షాలు కోర్టుకు వెళ్లిన కధ అలా ఉండగానే ఇపుడు మరో సభ్యుడి వివాదం తెర మీదకు వచ్చింది. ఆయనే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఆయనను ఎక్స్ అఫీషియో మెంబర్ గా నియమించడం పట్ల రచ్చ అవుతోంది. టీటీఎడీ చట్టం ప్రకారం చూస్తే పాలక మండలి సభ్యుడిగా ఉండాలంటే ముప్పయ్యేళ్ల కనీస వయసు ఉండాలి. కానీ చెవిరెడ్డ్ మోహిత్ వయసు కేవలం ఇరవై ఆరేళ్ళు మాత్రమే.

అందువల్ల నిబంధలను పక్కన పెట్టి మరీ ఆయనను ఎలా నియమిస్తారు అంటూ టీడీపీ ప్రశ్నిస్తోంది. దీని మీద టీడీపీ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. మొత్తానికి మోహిత్ రెడ్డికి ఆదిలోనే ఈ కీలకమైన పదవి దక్కకుండా తెలుగుదేశం పార్టీ మోకాలడ్డేలా స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.