ఆ సర్వే.. టీడీపీ సొంత సర్వేనేనా?
తాజాగా ఇండియా టీవీ సంచలన సర్వే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి 46 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ వెల్లడించింది.
By: Tupaki Desk | 6 Oct 2023 10:12 AM GMTఈ ఏడాది డిసెంబర్ లోపు దేశంలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే ఏడాది వేసవిలో లోక్ సభతోపాటు ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలు గెలుస్తాయని పలు సంస్థలు సర్వేలు ప్రకటిస్తున్నాయి.
తాజాగా ఇండియా టీవీ సంచలన సర్వే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి 46 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ వెల్లడించింది. ఇక టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని తేలింది. బీజేపీకి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే తేల్చింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సైతం 2 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఇండియా టీవీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ప్రస్తుతం 22 మంది లోక్ సభ ఎంపీలు ఉండగా ఈసారి 15 లోక్‌సభ స్థానాలు వస్తాయని సర్వే అంచనా వేసింది. మరోవైపు టీడీపీకి ప్రస్తుతం ముగ్గురు ఎంపీలు ఉండగా వచ్చే ఎన్నికల్లో ఈ సంఖ్య 10కి పెరుగుతుందని సర్వే వెల్లడించింది.
ఈ నేపథ్యంలో ఇండియా టీవీ సర్వేపై టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తుండటం పట్ల రాజకీయ విశ్లేషకుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్లు కరోనా కల్లోలం రేగినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్థంగా ఎదుర్కొందని అంటున్నారు. అలాగే 2019 ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తోందని చెబుతున్నారు. దీంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పేర్కొంటున్నారు.
ముఖ్యంగా నవరత్న పథకాలు అమ్మ ఒడి, పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ అభయహస్తం (ఫించన్లు), కాపు నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద ఇలా ఎన్నో పథకాలను ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కులమతాలకతీతంగా, పార్టీలకతీతంగా అందరికీ ఈ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అంటున్నారు.
వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి చొచ్చుకువెళ్లి పోయాయని రాజకీయ విశ్లేషకులు నొక్కి వక్కాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల వచ్చిన టైమ్స్ నౌ, ఇతర సర్వేల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ విజయం ఖాయమని వెల్లడైంది. దాదాపు 50 శాతం ఓట్లతో వైసీపీ 24–25 లోక్ సభ సీట్లు సాధిస్తుందని టైమ్స్ నౌ తన సర్వేలో పేర్కొంది. పోల్ స్ట్రాటజీ గ్రూప్ చేపట్టిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ ఏకంగా 49 శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడైంది. టీడీపీ, జనసేన కలిసినా 41 శాతం ఓట్లు మాత్రమే తెచ్చుకుంటాయని స్పష్టం చేసింది. ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ మరోసారి విజయదుందుభి మోగించడం ఖాయమని సర్వేలే పేర్కొన్నాయి. దీంతో టీడీపీ క్యాడర్ లో నిస్తేజం, నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి బెంబేలెత్తిన టీడీపీ తన క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు సొంత సర్వేను విడుదల చేయించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందులో భాగంగానే ఇండియా టీవీ– సీఎన్‌ఎక్స్ సర్వే వెలువడిందని ఆరోపిస్తున్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశానికి దాదాపు 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంచార్జులే లేరని అంటున్నారు. ఇక ఎంపీ టికెట్ అయితే అడిగేవారే లేరంటున్నారు. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ సర్వే టీడీపీకి 10 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోటీకి అభ్యర్థులే లేకపోతే 10 ఎంపీ సీట్లు ఎలా వస్తాయని నిలదీస్తున్నారు. ఇండియా టీవీ సర్వే మొత్తం ఓ సొంత వంటకం మాదిరి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం టీడీపీ క్యాడర్ ను నిద్ర లేపడానికి ఈ సర్వే సొంతంగా విడుదల చేశారు తప్ప అందులో వాస్తవం లేదని టీyీ పీ నేతలు సైతం తమ అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేస్తున్నారట.
అవినీతి కేసుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుకు వెళ్లడంతో ఆ పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా తయారైందని అంటున్నారు. కేవలం స్కిల్ డెవలప్మెంట్ స్కామే కాకుండా మరిన్ని కేసులు చంద్రబాబుపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు శిక్ష పడటం ఖాయమని అంటున్నారు. మరి అసలు పార్టీకి అధ్యక్షుడు, పోటీకి అభ్యర్థులు లేకుండా టీడీపీకి 10 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టీవీ సర్వే పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.