సింగనమల శిగపట్లు.. టీడీపీకి తేల్చడం కష్టమే ...!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల ఎస్సీ నియోజకవర్గం.. టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 5 Feb 2024 1:30 AM GMTఉమ్మడి అనంతపురం జిల్లాలోని సింగనమల ఎస్సీ నియోజకవర్గం.. టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఒకరికి మించి నాయకులు ఎక్కవు మంది రెడీగా ఉన్నారు. పైగా ఆర్థికంగా బలంగా ఉండడం, ప్రజల్లోనూ సింపతీ ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై ఆలోచన సాగుతోంది. ఇప్పటికే.. ఇక్కడ బరిలో ఉన్నానని ప్రకటించుకున్న టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు. ఎం.ఎస్ రాజును బుజ్జగించి పోటీ నుంచి తప్పించారు.
అయినప్పటికీ.. మరో ఇద్దరు నాయకులు మేమేంటే మేనని పార్టీలో పేచీ పెడుతుండడం గమనార్హం. వీరిద్దరూ మహిళా నాయకులు కావడం పార్టీకి చిక్కు తెచ్చింది. వీరిలో ఒకరు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి. ఈమెకు టికెట్ ఇవ్వాలని పార్టీ ప్రాథమికంగా నిర్ణయించినా.. స్థానికంగా పార్టీలోనే ఈమెకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలుకొనసాగుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని.. ఒంటెత్తు పోకడలు పోతున్నారని శ్రావణిపై ఫిర్యాదులు అందాయి.
దీంతో పార్టీ అధిష్టానం బండారు శ్రావణి వ్యవహారాన్ని కొంత పక్కన పెట్టింది. మరోవైపు.. సీనియర్ నేత.. కంబగిరి రాములు కుటుంబం కూడా.. సింగనమల సీటును ఆశిస్తున్నారు. ఆయన కోడలు స్నిగ్ధ.. పార్టీలో యాక్టివ్‌గా ఉండడం, నారా లోకేష్ పాదయాత్రకు కొన్ని ఏర్పాట్లు చేసిన దరిమిలా.. ఆమెకు టికెట్ కావాలని ఈ కుటుంబం పోరు పెడుతోంది. స్థానికంగా కూడా స్నిగ్ధకు ఫాలోయింగ్ ఉన్నదరిమిలా..ఆమెను కూడా పరిశీలనకు తీసుకున్నారు. అయితే.. వీరిలో ఎవరికి ఇచ్చినా.. అందరూ కలిసి పార్టీని గట్టెక్కించేలా ముందుకు సాగాలనేది పార్టీ మాట.
ఇంకోవైపు.. టీడీపీలోకి వస్తానని చెప్పిన.. కాంగ్రెస్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వ్యవహారం.. కూడా తాజాగా చర్చకువచ్చింది. ఆయన పార్టీలోకి వస్తానని రెండు మాసా లకిందట నుంచి సంకేతాలు ఇచ్చారు. అయితే.. సీనియర్ నాయకుడు రఘువీరారెడ్డితో ఉన్నపరిచయాల నేపథ్యంలో ఆయనను ఆపుతున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నారు. చివరి నిముషంలో అయినా.. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఒకవేళ సాకే కనుక పార్టీలోకి వస్తే..ఆయనకు ఈ టికెట్ దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.