గుండెలు పగులుతున్నాయి.. ఓదార్పు యాత్రకేనా?
చంద్రబాబు అరెస్టు, రిమాండ్ చూసి ఇప్పటివరకూ 20 మందికి పైగా ప్రజలు గుండెపోటుతో మరణించారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 12 Sep 2023 10:11 AM GMTటీడీపీ కూడా వైసీపీ బాటలోనే సాగబోతుందా? గతంలో జగన్ నడిచిన బాటలో ఇప్పుడు బాబు కానీ లేదా లోకేష్ కానీ వెళ్లబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ మీద జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఆయన అరెస్టు, రిమాండ్ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అభిమానులు ఆవేదన చెందుతున్నారనే వార్తలు వస్తున్నాయి. బాబు అరెస్టు తట్టుకోలేక, ఆయన జైలుకు వెళ్లడం చూడలేక జనాల గుండెలు పగులుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు, రిమాండ్ చూసి ఇప్పటివరకూ 20 మందికి పైగా ప్రజలు గుండెపోటుతో మరణించారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓదార్పు యాత్ర నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరణించిన పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఆదుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంటుంది. ఈ నేపథ్యంలో బాబు లేదా లోకేష్ కానీ ఓదార్పు యాత్ర తరహాలో మరణించిన వాళ్ల కుటుంబాలను పరామర్శిస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మిస్సింగ్, ఆ తర్వాత ఆయన మరణంతో కాంగ్రెస్ కార్యకర్తలు గుండెపోటుతో చనిపోయారనే వార్తలు వచ్చాయి. చనిపోయిన కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేయడం ఎంతటి వైరల్ గా మారిందో తెలిసిందే. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత కూడా జగన్ తిరిగి ఓదార్పు యాత్ర కొనసాగించిన విషయం విదితమే. ఇప్పుడు బాబు కూడా అదే బాటలో సాగే అవకాశాలున్నట్లు టాక్.