తెలుగుదేశం పార్టీ ఇంత వీకా.. ఒక్కరంటే ఒక్కరు లేరా?
బాబు అరెస్టుతో మరింత దూకుడును ప్రదర్శిస్తున్న వేళ.. చంద్రబాబును అభిమానించే వారు మాత్రం చేష్టలుడిగినట్లుగా ఉండిపోయారు
By: Tupaki Desk | 13 Sep 2023 6:05 AM GMT'నన్ను అరెస్టు చేస్తారు.. రంగం సిద్దం అవుతోంది'.. అంటూ తన అరెస్టు విషయాన్ని తానే మొదటగా బయటపెట్టుకున్న ఏపీ విపక్ష నేత చంద్రబాబు నాయుడ్ని.. ఆయన చెప్పిన రీతిలోనే అరెస్టు కావటం తెలిసిందే. అయితే.. బాబు తన అరెస్టును ప్రస్తావించినంతనే.. ఆయన దళం అందుకేం చేయాలన్న విషయాన్ని మర్చిపోవటం ఒక ఎత్తు అయితే.. అరెస్టు షాక్ తో చేతులెత్తేసిన పరిస్థితి. చంద్రబాబు అరెస్టు వేళ.. వచ్చి పడుతున్న వీడియోలు.. మీమ్స్.. సరికొత్త ప్రచార హోరు చూస్తున్నప్పుడు.. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అరెస్టు షాక్ కు ఎంతలా తల్లడిల్లిపోతుందన్న విషయం అర్థమవుతుంది.
మాటకు వస్తే పసుపు సైన్యం.. పసుపు దళం.. సీబీఎన్ ఆర్మీ.. ఇలాంటి బోడి మాటలు చాలానే చెప్పుకుంటూ ఉండే వారంతా చేష్టలుడిగిపోయిన వైనం చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ బలహీనత కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు. తమ పార్టీ మూలస్తంభానికి దిమ్మ తిరిగే షాక్ ను జీర్ణించుకోలేని వైనాన్ని చూసినప్పుడు.. పసుపు సైన్యం వైఫల్యం కళ్లకు కట్టినట్లుగా కనిపించకమానదు. జరిగిన పరిణామాలు.. దానికి కౌంటర్లుగా సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు చూస్తే.. చంద్రబాబు అరెస్టుకు ఆయన అభిమానులు ఏ మాత్రం సిద్ధంగా లేరన్న విషయం ఇట్టే అర్థమవుతుంది.
బాబు అరెస్టుతో మరింత దూకుడును ప్రదర్శిస్తున్న వేళ.. చంద్రబాబును అభిమానించే వారు మాత్రం చేష్టలుడిగినట్లుగా ఉండిపోయారు. వేదనలోనూ విరుచుకుపడుతూ యుద్దం చేసే కళ తమలో ఏ మాత్రం లేదన్న విషయాన్ని చంద్రబాబు ఆర్మీ చెప్పేసింది. సాధారణంగా ఏదైనా అనుకోని శోకం ఎదురైనప్పుడు.. దాన్ని జీర్ణించుకోవటానికి కొన్ని నిమిషాలు పడుతుంది. కానీ.. అది గంటలుగా.. రోజులుగా ఉండటం చూస్తే.. తెలుగుదేశం పార్టీ బలహీనత ఇట్టే అర్థమవుతుంది.
పార్టీని పరుగులు తీయించే ఏకైక వ్యక్తి జైల్లో ఉన్న వేళ.. దానికి ఎలా స్పందించాలన్న దానిపై నడిపించే నాయకుడే లేకపోవటం చూస్తే.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక లోపాలు ఇట్టే బయటపడిపోతాయి. మైకులు పగిలిపోయేలా మాట్లాడే వారంతా మూగపోవటం ఏమిటి? తమ అధినాయకుడు అరెస్టు అయిన వేళ.. కట్టలు తెగిన ఆగ్రహాన్ని.. ఆవేదనను చూపించిన తెలుగుదేశం పార్టీలో ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించలేదన్న మాట.. నిజమేనన్న భావన కలుగక మానదు.
జరిగిన పరిణామాలు చూస్తే.. తెలుగుదేశం పార్టీ ఇంత వీకా? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. సెవన్టీ ప్లస్ వయసులో ఉన్న చంద్రబాబు మీదనే పార్టీ ఆధారపడిందే తప్పించి.. ఆయనకు అసలుసిసలు వారసత్వం లేదా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అదేపనిగా సంక్షోభాలు మీద విరుచుకుపడిన వేళలోనే.. సరికొత్త నాయకత్వాలు ఆవిష్కరిస్తాయన్న మాట.. తెలుగుదేశం పార్టీకి సూట్ కాదన్న విమర్శ వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ పసుపు పార్టీకి పరీక్షగా.. తమను తాము సరి చూసుకునేందుకు.. తమ బలాన్ని సరైన రీతిలో మదింపు చేసుకోవటానికి కలిగిన ఒక అవకాశమని మాత్రం చెప్పక తప్పదు. బాబు అరెస్టు వేళ.. ఆయన తరఫు వాదనల్ని బలంగా వినిపించే గళం ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించకపోవటమే అసలుసిసలు విషాదంగా చెబుతున్నారు.