Begin typing your search above and press return to search.

నాయిస్ కాదుర్రా.. వాయిస్ కావాలి

అవసరం లేని నాయిస్ ఫుల్ గా.. అవసరమున్న వాయిస్ నిల్ అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యారు

By:  Tupaki Desk   |   13 Sep 2023 6:06 AM GMT
నాయిస్ కాదుర్రా.. వాయిస్ కావాలి
X

అవసరం లేని నాయిస్ ఫుల్ గా.. అవసరమున్న వాయిస్ నిల్ అన్నట్లుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అయ్యారు. అది కూడా ఒక అవినీతి కేసులో. ఆయనపై ఆరోపణలు కుప్పలు.. కుప్పలుగా చెబుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వాదనల్ని బలంగా వినిపిస్తున్నారు. ఇలాంటివేళ.. తెలుగుదేశం పార్టీ కానీ..ఆయన ఫాలోయర్లు కానీ చేయాల్సిందేంటి? అన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తమ వాయిస్ తో చంద్రబాబు అరెస్టు ఎంత అప్రజాస్వామికం అన్న విషయాన్ని చెప్పాలే కానీ.. అవసరం లేని డ్రామాను ప్రదర్శించటం వల్ల లాభం ఏమిటి?

ఆయన ప్రత్యర్థులు చంద్రబాబు చేసిన అవినీతి అంటూ.. పాయింట్ల వారీగా ప్రశ్నలు లేవనెత్తుతున్న వేళ.. టీడీపీ తమ్ముళ్లు దానికి కౌంటర్లుగా లాజిక్కులు చూపిస్తూ వాదనలు వినిపించాలి. అంతే తప్పించి.. గుండెలు బాదుకోవటం.. అడ్డదిడ్డంగా మాట్లాడటం కాదు. రొడ్డు కొట్టుడు మాటల వల్ల ప్రయోజనం ఉండదు. దానికి బదులుగా స్కిల్ డెవల్ మెంట్ స్కాంకు సంబంధించి అధికారులు చెబుతున్న మాటలు.. వాటిల్లో నిజాలు ఏమిటి? అందులో ఏ మాత్రం అతకని అంశాలేమిటి? వారు చెప్పే అంశాలకు.. జరుగుతున్న పరిణామాలకు ఏ మాత్రం సంబంధం లేని విషయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

అందుకు.. చేయాల్సింది మొదట రీసెర్చ్. చంద్రబాబు అరెస్టు వెనుక నెలల తరబడి రహస్య విచారణ సాగిందని అధికార వైసీపీకి చెందిన నేతలు మీడియా ముందు చెప్పటాన్ని చూసినప్పుడు.. అందుకు కౌంటర్ వాదనల్ని వినిపించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీలో గుజ్జు ఉన్న నాయకులు.. లేదంటే బాబును అభిమానించే వారో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా గుండెలు బాదేసుకోవటం.. అర్థం లేని ఆవేశాన్ని ప్రదర్శించటం వల్ల లాభం ఉండదు. బాబు అరెస్టు వేళ.. చంద్రబాబు బలహీనతల గురించి.. అప్పట్లో చంద్రబాబు అలా చేసి ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావన్న మాటల్ని ఆపేసి.. ఇప్పుడు చేయాల్సిన పనుల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే తమ్ముళ్ల నోటి నుంచి వచ్చే మాటలు నాయిస్ మాదిరి కాకుండా వాయిస్ మాదిరి మారతాయి. ఈ విషయాన్ని టీడీపీకి చెందిన వారంతా ఎప్పటికి తెలుసుకుంటారో?