ఈ తమ్ముళ్లు ఇంతే బ్రో.. కదిలిస్తేనే తప్ప కదలరా...!
దీంతో చంద్రబాబు అనేక సందర్భాల్లో సీరియస్ అయ్యారు. కష్టపడే వారికే టికెట్లు అని ఆయన బాహాటంగా చెప్పాల్సి వచ్చింది
By: Tupaki Desk | 9 Nov 2023 3:15 AM GMTఈ తమ్ముళ్లు ఇంతే బ్రో! ఇప్పుడు ఏపీ టీడీపీలో వినిపిస్తున్న మాట ఇదే!! నిన్న మొన్నటి వరకు చంద్ర బాబు జైల్లో ఉంటే.. ఆయన కోసం పూజలు, వ్రతాలు, హోమాలు చేసి, రోడ్డెక్కి నిరసన తెలిపిన నాయకులు.. ఆయన జైలు నుంచి బయటకు రాగానే(మధ్యంతర బెయిల్‌పై) గప్ చుప్ అయిపోయారు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. నిజానికి చంద్రబాబు జైలుకు వెళ్లక ముందు కూడా నాయకులు ఇలానే ప్రవర్తించారు.
దీంతో చంద్రబాబు అనేక సందర్భాల్లో సీరియస్ అయ్యారు. కష్టపడే వారికే టికెట్లు అని ఆయన బాహాటంగా చెప్పాల్సి వచ్చింది. దీంతో కొంత మేరకు కదలిక వచ్చింది. తర్వాత.. చంద్రబాబుపై కేసులు నమోదు కావడంతో మళ్లీ స్తబ్దత ఏర్పడింది. ఆయన జైలు కు వెళ్లిన తర్వాత.. నారా లోకేష్‌కు ఎవరో సలహా ఇస్తే.. దానిని అమలు చేయాలని ఆయన పిలుపునిస్తే.. అప్పుడు టీడీపీ నాయకులు ముందుకు కదిలారు.
అప్పుడు కూడా.. దాదాపు 40 నియోజకవర్గాల్లో తమ్ముళ్లు ముందుకు రాలేదు. దీనినే ప్రత్యర్థి పత్రిక చిలవలు పలవలు చేసి ప్రచురించింది. అప్పుడు కూడా తమ్ముళ్లలో స్పందన రాలేదు. ఇదిలావుంటే.. చంద్రబాబు విడదల తర్వాత.. ఇక, పార్టీకి పనేం లేదన్నట్టుగా.. అంతా అధినేతే చూసుకుంటాడు అన్నట్టుగా చాలా మంది నాయకులు వ్యవహరిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ, వాస్తవానికి అసలు పని ఇప్పుడే ఉంది.
మరో ఐదు మాసాల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ దూకుడుగా ముందుకు సాగుతోంది. ము ఖ్యంగా టీడీపీ-జనసేన పొత్తుపై తీవ్ర వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో సదరు వ్యతిరేక ప్రచారాన్ని నిలువరించి ముందుకు సాగాల్సిన టీడీపీ నాయకులు, మేనిఫెస్టోను ప్రజల్లో వివరించాల్సిన నాయకులు కులాసాగా తిరుగుతున్నారే తప్ప.. ఎవరో ఒకరిద్దరు మాత్రమే ఎవరూ చెప్పకపోయినా.. నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు తప్ప.. (బండారు సత్యనారాయణ వంటివారు) మిగిలిన వారు మౌనంగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వారిని ఎవరైనా కదిలించాలా? అన్నది సందేహం.