Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్లలో టీడీపీ కొత్త ప్రయోగం...సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే...?

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఏదైనా ప్రయోగం చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సి వస్తోంది

By:  Tupaki Desk   |   9 Sep 2023 4:26 AM GMT
ఎంపీ సీట్లలో టీడీపీ కొత్త ప్రయోగం...సక్సెస్ ట్రాక్ ఎక్కాల్సిందే...?
X

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఏదైనా ప్రయోగం చేయాలి అంటే ఒకటికి రెండు సార్లు చూసుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే రిక్స్ చేయడానికి టీడీపీకి ఇపుడున్న పరిస్థితులు అనుకూలించడంలేదు. అదే ఎంపీ సీట్లలో అయితే కొంతవరకూ వెసులుబాటు ఉంది అని అంటున్నారు. దాంతో చాలా మంది ఆశావహులను అంగబలం అర్ధబలం చూసుకుని మరీ పార్లమెంట్ సీట్లలో పోటీకి టీడీపీ దించనుంది అని అంటున్నారు. మొత్తం పాతిక ఎంపీ సీట్లలో ఈసారి టీడీపీ నుంచి కనీసంగా సగానికి సగం సీట్లలో కొత్త ముఖాలు అభ్యర్ధులుగా రానున్నారు అని అంటున్నారు.

అదే విధంగా తనది బీసీ పార్టీ అని క్లెయిం చేసుకుంటున్న టీడీపీ ఈసారి బీసీలకు పెద్ద పీట వేయనుంది అని అంటున్నారు. అదే విధంగా ఎన్నడూ లేని విధంగా ఈసారి అన్ని కులాలకు టికెట్లు ఇచ్చేందుకు కూడా సుముఖంగా ఉంది అని అంటున్నారు. టీడీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫస్ట్ టైం ఒక బ్రాహ్మణ నేత ఎంపీ క్యాడిడేట్ కాబోతున్నారు అని టాక్ నడుస్తోంది. రాజమండ్రి నుంచి యువ పారిశ్రామికవేత్త శిష్టా లోహిత్ కి టికెట్ ఇస్తారు అని అంటున్నారు.

ఇక కొత్త ముఖాలు తీసుకుంటే ఏలూరు నుంచి పారిశ్రామికవేత్తగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోరుముచ్చు గోపాలరావు యాదవ్ పేరుని సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. ఇక్కడ గత ఎన్నికల వరకూ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే టికెట్లు ఇచ్చేవారు. 2019లో వైసీపీ బీసీకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. దాంతో టీడీపీ అదే ప్రయోగం చేయనుంది అంటున్నారు.

అలాగే రాయలసీమలో ఈసారి కొత్త ముఖాలు బీసీలకు ఎంపీ టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఆ వరసలో చూస్తే హిందూపురం నుంచి బలమైన బీసీ నేతను దింపుతారు అని తెలుసోంది. అనంతపురం ఎంపీ సీటుని కూడా బీసీలకే ఇస్తారని అంటున్నారు. ఇక అదే వరసలో నంద్యాల, చితూరు ఎంపీ టికెట్లను కూడా బీసీ సామాజికవర్గాలకే కేటాయించనున్నారని అంటున్నారు.

అదే విధంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న కమ్మ, రెడ్డిలకు కూడా సమానంగా చెరి మూడేసి ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. ఒంగోలు కర్నూల్, నెల్లూరు సీట్లు రెడ్లకు ఇస్తే విశాఖ, విజయవాడ, గుంటూరు ఎంపీ సీట్లను కమ్మలకు ఇస్తారని అంటున్నారు.

ఇక టీడీపీ ఈసారి సీట్లు ఇచ్చే బీసీ వర్గాలలో యాదవులు, గౌడ్స్, కురుబ, బోయ, కొప్పుల వెలమ, తూర్పు కాపు నేతలు ఉంటారని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ అన్ని విషయాలని పరిగణనలోకి తీసుకుని ఎంపీ సీట్లకు అభ్యర్ధులను ఎంపిక చేయనుంది. దాని వల్ల అన్ని వర్గాలకు సామాజికవర్గాల పరంగా న్యాయం చేశామని టీడీపీ చెప్పుకోవడానికి ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి టీడీపీ వ్యూహం ఫలిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.